కరెంట్‌ బిల్లులపై అనుమానాలుంటే నివృత్తి చేసుకోండి

14 May, 2020 19:44 IST|Sakshi

ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌ 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్‌ బిల్లులు పెరిగాయన్న ప్రచారంలో వాస్తవం లేదని, కేవలం అపోహలు మాత్రమేనని ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌ స్పష్టం చేశారు. ఆయన గురువారం మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘కరోనా నేపథ్యంలో మార్చి తర్వాత మే నెలలో మీటర్‌ రీడింగ్‌ తీసుకున్నాం. ఈ 60 రోజుల బిల్లు ఒకే కేటగిరీ కింద ఒకే శ్లాబ్‌ సిస్టమ్‌ కింద బిల్లు వేశారన్నది అపోహ మాత్రమే. 60 రోజుల బిల్లును రెండుతో భాగించి రెండు నెలలకు బిల్లు వేశామని’’ ఆయన వివరించారు.
(టెన్త్‌ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం)
 
మార్చి నెలలో 20 రోజులకు గత ఆర్థిక సంవత్సరంలో ఏ కేటగిరి కింద వినియోగదారుడు ఉంటే అదే కేటగిరి వర్తించేలా బిల్లు వేశామని పేర్కొన్నారు. ఏప్రిల్‌ నెలకు సంబంధించి కొత్తగా రూపొందించిన కేటగిరి ప్రకారం బిల్లులు వేశామన్నారు. గతంలో స్ట్రాటిక్‌ విధానం ఉండేదన్నారు. కానీ ఈ విధానం సరిగా లేని కారణంగా ఏపీఈఆర్‌సీలో వచ్చిన సూచనల మేరకు డైనమిక్‌ విధానం అమల్లోకి వచ్చిందన్నారు. ఒకవేళ ఒక నెలలో కరెంట్‌ బిల్లు అధికంగా వస్తే ఆ నెలలోనే కేటగిరి మారుతుందే తప్ప 12 నెలలకూ వర్తించదన్నారు. మే నెలలో వేసవి వల్ల అధికంగా బిల్లు వస్తే జూన్‌లో అదే కేటగిరి కొత్త విధానంలో ఉండదని చెప్పారు. బిల్లింగ్‌ విధానంపై ఎవరికైనా అనుమానాలుంటే వెబ్‌సైట్‌లో నంబర్‌ టైప్‌ చేసి పాత బిల్లులను కూడా తెలుసుకోవచ్చన్నారు. అనుమానాలుంటే ‘1912’ లో సంప్రదించవచ్చని.. ఉన్నతాధికారులు వెంటనే అందుబాటులోకి వచ్చి అనుమానాలు నివృత్తి చేస్తారని తెలిపారు.
(విద్యుత్‌ బిల్లులపై ప్రజల్లోకి వెళ్దాం)

ప్రతీ ఏడాది శీతాకాలంలో కరెంట్‌ బిల్లులు తక్కువగా ఉంటాయని వేసవిలో బిల్లులు అధికంగా ఉంటాయని పేర్కొన్నారు. కోవిడ్‌ వల్ల కూడా గృహ వినియోగం గతంలో కంటే ఈ సారి అధికంగా పెరిగిందన్నారు. అనుమానం ఉంటే ఆన్‌లైన్‌లో గత ఏడాది బిల్లులు, ఇప్పటి బిల్లులు చూసుకోవచ్చన్నారు. బిల్లింగ్‌ విధానం కూడా పూర్తి పారదర్శకంగా జరిగిందని ఎక్కడా తప్పు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా జూన్‌ 30 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించవచ్చన్నారు. గడువు పెంచిన కారణంగా ఈలోపు డిస్‌ కనెక్షన్‌ జరగదని, ఒకవేళ డిస్‌కనెక్షన్‌ చార్జీలు వేస్తే రాబోయే బిల్లులో మినహాయింపు ఇస్తామని వివరించారు. కరెంట్‌ బిల్లులపై ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉన్నా నివృత్తి చేయడానికి విద్యుత్‌ శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారని శ్రీకాంత్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు