విద్యుత్‌ బిల్లులపై ప్రజల్లోకి వెళ్దాం

14 May, 2020 03:44 IST|Sakshi

అదనపు భారం వేయలేదు.. 

వాస్తవాలతో వినియోగదారులకు  లేఖ 

అన్ని చోట్లా సగటున విద్యుత్‌ బిల్లుల తనిఖీ 

అనుమానం వచ్చిన వారికి అధికారుల వివరణ 

డిస్కమ్‌ల సీఎండీలతో ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ టెలికాన్ఫరెన్స్‌  

సాక్షి, అమరావతి: విద్యుత్‌ బిల్లులపై నెలకొన్న అనుమానాలను తొలగించేందుకు ప్రతీ వినియోగదారుడికీ సవివరంగా లేఖ రాయాలని ఇంధనశాఖ నిర్ణయించింది. 1.45 కోట్ల విద్యుత్‌ వినియోగదారులకు వ్యక్తిగతంగా లేఖలు రాసే బాధ్యతను విద్యుత్‌ పంపిణీ సంస్థల సీఎండీలకు అప్పగించింది. మరోవైపు అన్ని ప్రాంతాల్లోనూ విద్యుత్‌ బిల్లులను సగటు (ర్యాండమ్‌)గా పరిశీలన చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. విద్యుత్‌ బిల్లులు పెరిగాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో డిస్కమ్‌ల సీఎండీలు, జిల్లా సూపరింటెండెంట్‌ ఇంజనీర్లతో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి బుధవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వివరాలను ఇంధనశాఖ సీఈవో చంద్రశేఖర్‌ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

► వినియోగదారుల్లో ఉన్న అపోహలను దూరం చేయడానికి బిల్లులను పారదర్శకంగా వారి సమక్షంలోనే తనిఖీ చేయాలి. శాస్త్రీయ పద్ధతిలో బిల్లులు ఏ విధంగా తీశామో... వినియోగదారులకు భారం ఏ విధంగా తగ్గించామో వివరించాలి. ఇంకా అనుమానాలుంటే అధికారులు వారికి అర్థమయ్యేలా తెలియజెప్పాలి. 
► డిస్కమ్‌లు తమ వెబ్‌సైట్‌లో 1.45 కోట్ల వినియోగదారులకు సంబంధించిన గత రెండేళ్ల విద్యుత్‌ వినియోగ వివరాలు అందుబాటులో ఉంచాలి. వినియోగదారులు తమ కస్టమర్‌ ఐ.డీ  నంబరు ఫీడ్‌ చేయడం ద్వారా వివరాలు తెలుసుకునేలా విస్తృత ఏర్పాట్లు చేయాలి.  
► 60 రోజులకు మీటర్‌ రీడింగ్‌ తీసినా.. ఏ నెలకు ఆ నెల విద్యుత్‌ వినియోగం మేరకే కరెంటు బిల్లు అందిస్తాం. ఎంత వాడితే అంతే కరెంటు బిల్లు వస్తుంది. 

శాస్త్రీయ పద్ధతిలోనే బిల్లులు 
రెండు నెలల వినియోగాన్ని విభజించి మార్చి నెల వినియోగానికి 2019–20 టారిఫ్‌ కేటగిరీ వర్తింప చేశామని, అలాగే ఏప్రిల్‌ వినియోగానికి 2020–21 నూతన టారిఫ్‌ ప్రకారం బిల్లులు జారీ చేశామని శ్రీకాంత్‌ స్పష్టం చేశారు. దీని వల్ల ఏప్రిల్‌లో విద్యుత్‌ బిల్లు కొంత మేర తగ్గే అవకాశం ఉందని తెలిపారు. మే నెలకు కూడా విడిగానే బిల్లులు తయారుచేస్తామని వివరించారు. 1912 టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశామని, ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించామని తెలిపారు. మే విద్యుత్‌ బిల్లుల చెల్లింపు గడువును జూన్‌ 30 వరకు పెంచినట్టు తెలిపారు. విద్యుత్‌ బిల్లు ఇచ్చిన 15 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దీన్ని 45 రోజుల పాటు పొడిగించారు. అప్పటిదాకా ఎలాంటి అపరాధ రుసుములు ఉండవన్నారు.

మరిన్ని వార్తలు