ఏపీ రాజధానిపై ఏకపక్ష నిర్ణయం తగదు

28 Nov, 2014 02:45 IST|Sakshi
ఏపీ రాజధానిపై ఏకపక్ష నిర్ణయం తగదు

జనచైతన్య వేదిక సమావేశంలో మేధావుల మనోగతం

తిరుపతి: ఏపీ రాజధాని ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం తగదని పలువురు మేధావులు అభిప్రాయపడ్డారు. రాజధాని కోసం పంటపొలాల విధ్వంసాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. తిరుపతిలోని యూటీఎఫ్ కార్యాలయంలో గురువారం జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘ఏపీ రాజధాని-భూసేకరణ’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ భూసమీకరణ ద్వారా కాకుండా భూసేకరణ చట్టం 2013ను అనుసరించి రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా రాజధాని ఏర్పాటు జరగాలన్నారు. రాజధాని ప్రాంతంలో కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు.

వాస్తు లాంటి మూఢ నమ్మకాలతో రాజధాని ఎంపిక తగదన్నారు. కార్పొరేట్, రియల్ ఎస్టేట్ కంపెనీలకు వేలాది ఎకరాలు దోచిపెట్టే భూయజ్ఞాన్ని ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ వై.శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ రాజధాని ఎంపిక శాస్త్రీయంగా జరగలేదన్నారు. పంట భూములను విధ్వంసం చేసి రాజధానిని నిర్మించే ప్రయత్నం మంచిది కాదని స్పష్టం చేశారు. కార్పొరేట్ సంస్థలకు ఎర్ర తివాచీ పరిచే సింగపూర్ లాంటి పట్టణాలు మనకు అవసరం లేదన్నారు. రాజధాని పేరుతో సన ్న, చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతుల ప్రయోజనాలను హరిస్తే ఉద్యమాలు తప్పవన్నారు.

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చుచేసి ఆకాశాన్ని అంటే మేడలు నిర్మించాల్సిన అవసరం కానీ, హైదరాబాద్ లాంటి నగరాన్ని కోరుకోవాల్సిన అవసరం కానీ లేదని అన్నారు. పరిపాలన సౌలభ్యంగా రాజధాని ఉంటే చాలన్నారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ విషయమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం నాయకుడు ఆదికేశవులు రెడ్డి మాట్లాడుతూ రాజధాని ఏర్పాటుకు వ్యవసాయేతర బంజరు, బీడు, ప్రభుత్వ భూములను వాడుకోవాలన్నారు. పంట పొలాలను లాగేసుకుని రైతులు కడుపులు కొట్టడం మంచి పద్ధతి కాదన్నారు. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లి వద్ద నిరుపయోగంగా ఉన్న 4,500 ఎకరాల ప్రభుత్వ భూముల్లో రాజధానిని ఎందుకు నిర్మించరాదని ప్రశ్నించారు.

సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కందారపు మురళి ప్రసంగిస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఏదో అద్భుతాలు జరగ బోతున్నట్లు ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. ల్యాండ్ పూలింగ్ వెనుక రూ.6 లక్షల కోట్ల కుంభకోణం దాగి ఉందని, ఎన్నికల్లో తనకు సహాయ పడిన వారికి లబ్ధి చేకూర్చేందుకే చంద్రబాబు అవసరాలకు మించి భూములు సేకరిస్తున్నారని ఆరోపించారు. రైతు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు మాంగాటి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాజధాని కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న భూసమీకరణ విధానానికి చట్టబద్ధత లేదన్నారు. భూముల అప్పగింత విషయంలో రాజీ పడితే సత్యవేడు ఎస్‌ఈజెడ్ రైతులకు వచ్చిన కష్టాలే  తుళ్లూరు రైతులకు వస్తాయన్నారు.

రాయలసీమకు అనాదిగా జరుగుతున్న అన్యాయాల పరంపరలో భాగంగానే రాజధాని ఏర్పాటు నిర్ణయం జరిగిందని సీనియర్ పాత్రికేయులు రాఘవశర్మ అన్నారు. ప్రొఫెసర్ సుబ్రమణ్యంరెడ్డి మాట్లాడుతూ సీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని అడిగే హక్కు సీమ ప్రజలకు ఉందన్నారు. రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన్ మాట్లాడుతూ రాజధాని అవసరమేనని అయితే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.అంజయ్య మాట్లాడుతూ ఒక సామాజిక వర్గానికి ప్రయోజనం కల్పించే దృక్పథంతో రాజధాని నిర్మాణం జరుపుతున్నారని ఆరోపించారు.  సీపీఎం నాయకుడు వి నాగరాజు, ఊట్ల రంగనాయకులు, రామ్మూర్తి రెడ్డి, జేఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి.నవీన్‌కుమార్‌రెడ్డి, విద్యార్థి నాయకులు హరిప్రసాద్ రెడ్డి, కాటంరాజు, రాజశేఖర్‌రెడ్డి, హేమంత్ యాదవ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు