బోర్లు రెండు.. మోటారు ఒకటే!

3 Mar, 2014 02:30 IST|Sakshi
బోర్లు రెండు.. మోటారు ఒకటే!

సాధారణ రైతు అద్భుత ఆవిష్కరణ
50% వ్యవసాయ విద్యుత్ ఆదా!
 
ఉన్న రెండెకరాలకు నీరు పారించడానికి అప్పోసొప్పో చేసి బోరు వేస్తే.. వచ్చిన అంగుళం నీరు ఎకరానికీ చాలదాయె! ఎకరం పంట ఎండిపోక తప్పని దుస్థితి. ఎట్ల చేద్దునురా దేవుడా.. అని మథనపడుతున్న బడుగు రైతుకు.. చప్పున మెరుపు లాంటి ఆలోచన తట్టింది. ఆలస్యం చేయకుండా తనకొచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టాడు. తొలి ప్రయత్నమే ఫలించింది! రెండున్నర ఇంచుల నీరు పారింది. అంతేకాదు.. రెండెకరాలతోపాటు మరో అరెకరం పైగా పారే నీరుందిప్పుడు! ఈ అసాధారణ ఘనత సాధించిన సాధారణ రైతు పేరు పందిరి పుల్లారెడ్డి(47). ఆయన ఊరు నల్లగొండ జిల్లా మునగాల మండలంలోని ముకుందాపురం. ఇంతకీ.. ఈ కృషీవలుడు సాధించిన ఘనత ఏమిటంటే.. పొలంలో రెండు బోర్లను ఒక మోటారుతో నడిపించడం! పదో తరగతి వరకూ చదువుకొని మారుమూల గ్రామంలో రెండెకరాల సొంత భూమిలో పంటలు పండించుకొని కుటుంబాన్ని పోషించు కుంటున్న పుల్లారెడ్డి సాధించిన ఈ విజయం చిన్నా, పెద్దా రైతులందరికీ ఊరటనిచ్చే గొప్ప ఆవిష్కరణ.

 

అన్నిటికీ మించి.. విద్యుత్తును సగానికి సగం ఆదా చేసే అద్భుత టెక్నిక్ ఇది. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు కిలో మీటరు దూరంలో పుల్లారెడ్డి పొలం ఉంది.  రెండేళ్ల క్రితం రూ.25 వేల ఖర్చుతో తన భూమిలో బోరు వేసి మరో రూ. 25 వేలతో 5 హెచ్‌పీ సబ్‌మెర్సిబుల్ విద్యుత్ మోటారు అమర్చాడు. బోరులో సరిపడా నీరు లేక సాగు చేసిన రెండెకరాలలో ఎకరం భూమిలో వరి పంట ఎండిపోయింది. దీంతో మరో రూ.25 వేలు అప్పు చేసి పాత బోరుకు 30 అడుగుల దూరంలో మరో బోరు వేశాడు. రెండో బోరుకు విద్యుత్ మోటార్ అమర్చడానికి మరో రూ. 25 వేలు కావాలి.

 

దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న దశలో.. ఒకే మోటారుతో ఈ రెండు బోర్లను ఎందుకు నడపకూడదు? అన్న వినూత్న ఆలోచన మదిలో మెదిలింది. వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టి రూ. 5 వేల ఖర్చుతో 140 అడుగుల పొడువున ఇంచున్నర (ఒకటిన్నర అంగుళాల) పైపును కొనుక్కొచ్చాడు. రెండో బోరులోకి 100 అడుగుల మేర దింపి.. మొదటి బోరుకు లింక్ కలిపాడు. అంతే..! ఒకే మోటార్‌తో రెండు బోర్లలో ఉన్న నీటిని తోడేందుకు చేసిన ప్రయత్నం ఫలించింది. గతంలో ఒక్క బోరు ద్వారా కేవలం ఒక ఇంచు నీరు వస్తుండగా.. ప్రస్తుతం రెండు బోర్లలోని నీరు కలిపి దాదాపు రెండున్నర ఇంచుల నీరు వస్తోంది. తన ప్రయత్నానికి చక్కని ఫలితం దక్కడంతో పుల్లారెడ్డి ఆనందానికి అవధుల్లేవు. గతంలో ఒక ఎకరంలో ఏడాదికి ఒకసారే వరి పంట పండేది. ఇప్పుడు నిక్షేపంగా రెండెకరాల్లో వరి రెండు పంటలు పండిం చగలు గుతున్నాడు. ఈ టెక్నిక్‌కు పుల్లారెడ్డి ‘వెంకట శేషాద్రి పంపింగ్ సిస్టమ్’గా నామకరణం చేశాడు. కొందరు రైతులు ఆయన సహాయంతో తమ పొలాల్లోని బోర్లను అనుసం ధానం చేయించుకుంటూ.. ఖర్చు తగ్గించుకుంటున్నారు.
 - జీఎస్ రెడ్డి, న్యూస్‌లైన్, మునగాల, నల్లగొండ జిల్లా

బ్రహ్మాండం.. పుల్లారెడ్డి జ్ఞానం!
సాధారణ రైతైన పుల్లారెడ్డి జ్ఞానం బ్రహ్మాండం. 50%  వ్యవసాయ విద్యుత్‌ను పొదుపు చేయడం ఎలాగో చేసి చూపించాడు. పేటెంట్ కోసం నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్‌కు నివేదిక పంపాం.  
 - విశ్రాంత బ్రిగేడియర్
 పోగుల గణేశం(9866001678)
 
50 అడుగుల దూరంలో బోర్లను కలిపా రెండు బోర్లను కలిపి ఒకే మోటారుతో నడిపిస్తున్నా. ఆరుగురు రైతుల పొలాల్లో ముప్పయి నుంచి ఏభై అడుగుల దూరంలో ఉన్న బోర్లకు ఇలాంటి మార్పులు చేశా.  ఇంకా ఎక్కువ దూరంలో ఉన్న బోర్లకు, 200 అడుగుల కన్నా లోతు వేసిన బోర్లకు ఈ టెక్నిక్ పనిచేస్తుందో లేదో తెలీదు. పేటెంట్ కోసం  దరఖాస్తు చేశా. రైతులకు మేలు చేస్తున్నందుకు సంతృప్తిగా ఉంది.   
 - పందిరి పుల్లారెడ్డి (9963239182), రైతు, ముకుందాపురం, మునగాల మండలం, నల్లగొండ జిల్లా

 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా