పులుల మనుగడకు ప్రత్యేక చర్యలు

23 May, 2014 02:00 IST|Sakshi

రుద్రవరం, న్యూస్‌లైన్ : నల్లమల్ల అడవిలో పులుల మనుగడ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా స్క్వాడ్, నంద్యాల ఇన్‌చార్జ్ డీఎఫ్‌ఓ చంద్రశేఖర్ తెలిపారు. చాగలమర్రి, అహోబిలం, రుద్రరవం అటవీ కార్యాలయాల సమీపంలోని బేస్ క్యాంపులు, చెక్ పోస్టులను సోషల్ ఫారెస్టు నర్సరీ, రుద్రవరం కార్యాలయ సమీపంలోని మరో నర్సరీని గురువారం ఆయన పరిశీలించారు.
 
 ఈ సందర్భంగా స్థానిక ఫారెస్టు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుండ్ల బ్రహ్మేశ్వరం అడవి నుంచి రుద్రరవం మీదుగా తిరుపతి వరకు అడవిని కారిడార్‌గా గుర్తించాలని ఉన్నతాధికారులకు నివేదికలు పంపినట్లు తెలిపారు. నంద్యాల అటవీ డివిజన్ పరిధిలో సీసీ కెమెరాల ద్వారా ఎనిమిది, పాదముద్రల ద్వారా మరో నాలుగు పెద్ద పులులున్నట్లు గుర్తించామన్నారు.
 
 వీటి మనుగడ కోసం రుద్రవరం, చెలిమా రేంజిలను కారిడార్లుగా గుర్తించి అడవిలోకి ఎవ రూ ప్రవేశించకుండా చర్యలు తీసుకునే ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు. నంద్యాల అటవీ డివిజన్ పరిధిలోని చెలిమా రేంజిలో 10 హెక్టార్లు, రుద్రవరం రేంజి పరిధిలో 30, బండి ఆత్మకూరు రేంజిలో 10 హెక్టార్లలో మొక్కల పెంపకానికి చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రశేఖర్ చెప్పారు. ఇందుకోసం నారవేపి, ఎర్రచందనం, ఊసరి, నల్లమద్ది, ఎగిసా, జుట్టేగా, రోజ్‌హుడ్ తదితర మొక్కలను నర్సరీల్లో సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆయన వెంట రేంజర్ రాంసింగ్, డీఆర్‌ఓ సౌదర్యరాజు, సెక్షన్ ఆఫీసర్లున్నారు.

మరిన్ని వార్తలు