నమాజ్‌.. స్వర్గానికి తాళం చెవి

9 May, 2019 13:10 IST|Sakshi

నమాజ్‌ ఇస్లాం ధర్మానికి మూలాధారం

ఇది లేనిదే రోజాకు అర్థం ఉండదు

అల్లా అనుగ్రహం పొందలేరు

కర్నూలు (ఓల్డ్‌సిటీ): నమాజ్‌ అనేది స్వర్గానికి తాళం చెవి లాంటిది. ఇది లేకపోతే స్వర్గ ప్రవేశమే ఉండదు. ఎన్ని పుణ్య కార్యాలు చేసినా, దైవచింతనలు చేసినా నమాజ్‌ లేకుండా అల్లా అనుగ్రహం పొందలేరని మౌల్వీలు చెబుతున్నారు. అసలు నమాజ్‌ లేనిదే  రంజాన్‌ ఉపవాసాలకు పరిపూర్ణత ఉండదు. అందువల్ల నమాజ్‌ అనేది ఇస్లాం ధర్మానికి మూలాధారం. దీనిని  మహమ్మద్‌ ప్రవక్త తన కంటిచలువగా పేర్కొన్నారు. ప్రతి ముస్లిం కచ్చితంగా రోజుకు ఐదుపూటలా నమాజు చేయాలని నిబంధన. నమాజ్‌ను అరబ్బీ భాషలో సలాహ్, పర్షియన్లు సలాత్‌ అని అంటారు. నమాజుకు ముందు వజూ (శారీరక శుద్ధత) అనేది తప్పనిసరి. వజూ ద్వారా కాళ్లు, చేతులు, ముఖం, మెడ భాగాలు శుభ్రమవుతాయి. దీనివల్ల శారీరక శుద్ధి లభిస్తుంది. ఆ తర్వాత ఏకాగ్రతతో నమాజు ఆచరించడం వల్ల మానసిక శుద్ధి కలుగుతుంది. నమాజు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.  ప్రతి ముస్లిం కచ్చితంగా నమాజు చేసే  విధానం తెలుసుకుని ఉండాలి. అంతేకాకుండా నిత్యజీవితంలో ప్రతి రోజూ ఐదు పూటలా నమాజు ఆచరించాలి.

ఎలాంటి పరిస్థితుల్లో కుర్చీలో ఆశీనులై నమాజ్‌ చేయవచ్చు?  
సర్వసాధారణమైన నమాజు విధానం ప్రతిఒక్కరికి తెలుసు. అయితే ఆర్థోరైటిస్‌తో మోకాలు వంగని వ్యక్తులు, వృద్ధులు కూడా నమాజు చేయాల్సి ఉంటుంది. వారు కుర్చీలో కూర్చుని నమాజ్‌ చేసుకోవచ్చు. అయితే వారు పాటించాల్సిన నమాజు కొంత వేరుగా ఉంటుంది. ఇలాంటి వారికి సదుపాయంగా ఉండేందుకు వీలుగా  మసీదుల్లో కుర్చీలు ఏర్పాటు చేశారు.

సమయపాలన పాటించాలి..
నమాజుకు సమయపాలన పాటించడం చాలా ముఖ్యం. అందువల్ల  అన్ని మసీదుల్లోనూ నమాజు వేళల బోర్డులు ఏర్పాటు చేశారు. అందరూ  ఆ సమయానికి చేరుకుని సామూహిక నమాజులో (ఫరజ్‌ నమాజ్‌లో) పాల్గొనాల్సి ఉంటుంది. నమాజ్‌ వేళ అయ్యిందని గుర్తుచేయడానికి మసీదుల నుంచి ఐదు పూటలా అజాన్‌ అనే పిలుపు వినిపిస్తూఉంటుంది. ఉదయం నమాజును ఫజర్‌ అని, మధ్యాహ్నం నమాజును జొహర్, సూర్యాస్తమయం కంటే గంట లేక గంటన్నర ముందు చేసే నమాజ్‌ను అసర్‌ అని, సూర్యాస్తమయం తర్వాత చేసే నమాజును మగ్‌రిబ్, రాత్రి 8.30 గంటల ప్రాంతంలో చేసేది ఇషా నమాజ్‌. ఇంకా ఆసక్తి కలిగిన వారు ఇష్రాక్, తహజ్జుద్‌ నమాజులు కూడా చేస్తారు. ఒక్క జొహర్‌ తప్ప మిగతా నమాజుల వేళలు సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాలను బట్టి మారుతుంటాయి.  

నమాజులో ఇవి చేయాలి..
ఖిబ్లా (మక్కాలోని కాబా మసీదు) వైపు తిరగాలి.     శరీర భాగాలు పూర్తిగా కప్పుకోవాలి.
దుస్తులు, శరీరం, సజ్దాచేసే ప్రదేశం పరిశుభ్రంగా ఉండాలి.
ప్రార్థనకు ముందు ఆచార శుద్ధత, వజూ, తైమామ్, గుసూల్‌ వీటిలో ఏదో ఒకటి పాటించాలి.

ఇవి చేయకూడదు..
నమాజు చేసే వారి ముందు ఎవరూ వెళ్లకుండా చూడాలి.
రక్త గాయమై రక్తం ప్రవహిస్తూ ఉంటే నమాజు చేయరాదు.
మహిళలు రుతుక్రమ సమయంలో నమాజు చేయరాదు.

నమాజ్‌లోని దశలు..
తక్బీర్‌ తహిరియా ∙  ఖియామ్‌ ∙  రుకూ
సజ్దా ∙  ఖాయిదా ∙ సలామ్‌ ఫేర్‌నా ∙దువా

నమాజ్‌ ప్రతి ముస్లింకు తప్పనిసరి
ఇస్లాం ధర్మంలో నమాజ్‌కు మినహాయింపు ఉండదు. ప్రతి ముస్లింకు ఇది తప్పనిసరి. ఐదు పూటలా నమాజ్‌ చేస్తూ మహమ్మద్‌ ప్రవక్త సూచించిన శైలిలో జీవనం గడపాలి. సమయ పాలన కూడా చాలా ముఖ్యం. ఎప్పుడూ ఆలస్యంగా నమాజు చేసే వారు కూడా అల్లాకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది.   – ముఫ్తి అబ్దుర్రహ్మాన్‌  

అల్లా చల్లగా చూస్తున్నాడు
నేను ఐదు పూటలా నమాజ్‌ చేస్తుంటాను. నమాజ్‌కు వెళ్లొస్తే మానసిక అలజడులు దూరం అవుతాయి. నమాజ్‌ అనంతరం దువా చేస్తూ బాధలన్నింటినీ అల్లా ముందు పెట్టేస్తాను. అల్లా నన్ను చల్లగా చూస్తున్నాడు.  – సాహెబ్‌జాని

మరిన్ని వార్తలు