డెంగీ బూచి.. రోగులను దోచి..

10 Sep, 2019 11:05 IST|Sakshi

సాక్షి, నంద్యాల(కర్నూలు) : నంద్యాల పట్టణంలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగీ పేరిట దోపిడీ సాగుతోంది. జ్వరమని వెళితే చాలు..ప్లేట్‌లెట్లు తగ్గాయని, డెంగీ ఉండొచ్చంటూ భయపెడుతున్నారు. రకరకాల వైద్య పరీక్షలు చేయించడంతో పాటు ఆసుపత్రిలో అడ్మిట్‌ చేసుకుని వేలాది రూపాయలు దండుకుంటున్నారు. నెల రోజులుగా కురుస్తున్న వర్షాలు, వాతావరణ మార్పుల వల్ల సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా విష జ్వరాలు ఎక్కువయ్యాయి. నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ, బనగాన పల్లె, నందికొట్కూరు, ఆత్మకూరు నియోజక వర్గాల ప్రజలు ఎక్కువగా నంద్యాలకు వచ్చి చికిత్స తీసుకుంటున్నారు. ఈ పరిస్థితిని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. 

అనుమతి లేకున్నా.. 
వాస్తవానికి నంద్యాలలోని ఏ ఒక్క ప్రైవేటు ఆసుపత్రికీ డెంగీ వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయడానికి అనుమతి లేదు. పైగా ఏ ఆసుపత్రిలోనూ అందుకు అవసరమైన పరికరాలు కూడా లేవు.  నంద్యాల, కర్నూలు ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రమే డెంగీ నిర్ధారణ కేంద్రాలు ఉన్నాయి. ఈ వైద్య పరీక్ష కిట్లు కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో ఆగస్టులో 1,200 మందికి డెంగీ పరీక్షలు చేశారు.  ఒక్కరికీ వ్యాధి నిర్ధారణ కాలేదు. వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా.. పట్టణంలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు మాత్రం ‘డెంగీ నిర్ధారణ పరీక్ష చేశాం, మీకు పాజిటివ్‌ వచ్చిందం’టూ రోగులను బెంబేలెత్తిస్తున్నారు. రోగులు విధిగా ఆసుపత్రిలో చేరేలా, వారు చెప్పిన వైద్యపరీక్షలన్నీ చేయించుకునేలా ప్రేరేపిస్తున్నారు.  

ఐసీయూలో ఉంచి అడ్డంగా దోపిడీ 
కొన్ని ఆసుపత్రుల్లో దోపిడీ మరీ శ్రుతిమించుతోంది. జ్వరం తగ్గే వరకు రోగులను బలవంతంగా ఐసీయూలో ఉంచుతున్నారు. ఇందుకు గాను రోజుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు ఐసీయూలో ఉంచిన తర్వాత ప్రత్యేక గదికి మార్చి.. అక్కడ కూడా కనీసం వారం రోజులు ఉంచుతున్నారు. అలాగే మందుల చీటీపై ఖాళీ ఎంత ఉంటుందో అన్ని రకాల ఔషధాలు రాస్తున్నారు. సదరు ఆసుపత్రి మెడికల్‌ స్టోర్‌లోనే కొన్పిస్తున్నారు. ఇలా రోగి స్థోమతను బట్టి ఎంత వీలైతే అంత గుంజుతున్నారు. ఒక్కో రోగి కనీసం రూ.30 వేల నుంచి రూ.లక్ష దాకా సమర్పించుకోవాల్సి వస్తోంది. 

ప్లేట్‌లెట్లు తగ్గినంత మాత్రాన.. 
సాధారణంగా మనిషి రక్తంలో 1.50 లక్షల నుంచి 4.50 లక్షల ప్లేట్‌లెట్లు ఉంటాయి. అనారోగ్యానికి గురైనప్పుడు ఇవి కొంతమేర తగ్గుతుంటాయి. సాధారణ జ్వరాల్లోనూ ఈ పరిస్థితి ఉంటుంది. డెంగీ బారిన పడితే మాత్రం బాగా తగ్గుముఖం పడతాయి. 20 వేల కంటే దిగువకు పడిపోయి.. కళ్లు, మూత్రంలో రక్తం రావడం,  జ్వరం ఎంతకీ తగ్గకపోవడం, శరీరంపై దద్దుర్లు, తీవ్ర తల నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కన్పించినప్పుడు మాత్రమే ఆందోళన చెందాల్సి ఉంటుంది. 

డెంగీ నిర్ధారణ ఇలా.. 
డెంగీ అనే అనుమానం ఉంటే ఎన్‌ఎస్‌–1, ఐజీఎం పరీక్షలు చేస్తారు. పాజిటివ్‌గా నివేదిక వస్తే ఎలిసా పరీక్ష చేసి..నిర్ధారిస్తారు. కొన్నిసార్లు మొదటి, రెండు పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చినా..ఎలీసా పరీక్షలో నెగిటివ్‌ వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రైవేటు ఆసుపత్రికి డెంగీ అనుమానిత రోగి వెళ్తే వెంటనే జిల్లా వైద్యాధికారులకు సమాచారం ఇవ్వాలి. అలా కాకుండా ప్రైవేటు వైద్యులు కొందరు రోగులను భయపెట్టి వైద్యం చేస్తున్నట్లు నటిస్తూ ఆర్థికంగా దోచుకుంటున్నారనే విమర్శలున్నాయి.  

ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగీ అని నిర్ధారిస్తే చర్యలు 
నంద్యాల చుట్టుపక్కల ఏ ప్రైవేటు ఆసుపత్రికీ డెంగీ పరీక్షలు చేసేందుకు అనుమతి లేదు. ఎవరైనా అలా చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చే డెంగీ అనుమానితుల వివరాలను వెంటనే జిల్లా వైద్య, ఆరోగ్య శాఖకు తెలియజేయాలి. వెంటనే అవసరమైన వైద్యపరీక్షలు చేయిస్తాం. ఎలిసా వంటి పరీక్షలు చేసి, పాజిటివ్‌ అని తేలితేనే డెంగీగా గుర్తిస్తాం.  దాంతో పాటు రోగి నివాసం ఉండే పరిసర ప్రాంతాలను శుభ్రం చేయాలని సంబంధిత విభాగాల అధికారులకు సూచిస్తాం. అలా కాకుండా కార్పొరేట్, ప్రైవేటు వైద్యశాలల్లో డెంగీగా నిర్ధారించినట్లు తేలితే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం. నంద్యాల ఆసుపత్రిలో ఇంత వరకు ఒక్క డెంగీ కేసు కూడా నమోదు కాలేదు.  ప్లేట్‌లెట్లు తగ్గినంత మాత్రాన అది డెంగీగా భావించవద్దు.   
–డాక్టర్‌ రామకృష్ణారావు, డీసీహెచ్‌ఎస్, నంద్యాల 

వాస్తవాలు ఇవీ.. 
⇔ నంద్యాలలో ఏ ప్రైవేటు ఆసుపత్రికీ డెంగీ నిర్ధారణ పరీక్ష చేయడానికి అనుమతి లేదు. 
⇔ నంద్యాల, కర్నూలు ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రమే వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఉన్నాయి. 
⇔ నంద్యాల ప్రాంతంలో మూడు నెలలుగా ఒక్క డెంగీ కేసు కూడా నమోదు కాలేదు. 
⇔ ప్లేట్‌లెట్లు తగ్గినంత మాత్రాన డెంగీ కాదు. సాధారణ జ్వరపీడితుల్లోనూ ఈ లక్షణం కన్పిస్తుంది. 

దగ్గు, జ్వరానికే రూ.70 వేలు 
247 ఏళ్ల వయస్సుండే ఓ ప్రైవేటు ఉద్యోగి దగ్గు, జ్వరంతో నంద్యాల వన్‌టౌన్‌ ఏరియాలోని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి డాక్టర్లు శ్రీనివాస సెంటర్‌లోని ఓ ప్రైవేటు ల్యాబ్‌కు పంపి వైద్యపరీక్షలు చేయించారు. ప్లేట్‌లెట్లు 50 వేలు ఉన్నట్టు రిపోర్టు వచ్చింది. దీంతో వైద్యులు మూడు రోజుల పాటు ఐసీయూలో ఉంచి, అనంతరం మరో వారం రోజులు జనరల్‌వార్డులో ఉంచుకుని రూ.70 వేలు వసూలు చేశారు. మరో 10 రోజులకు మందులు రాసిచ్చి పంపారు.  

ప్లేట్‌లెట్లు తగ్గాయని రూ.40 వేల వసూలు 
2నంద్యాల గిరినాథ్‌ సెంటర్‌ ప్రాంతంలో ఉండే పదేళ్ల బాలికకు పది రోజుల క్రితం జ్వరమొచ్చింది. రెండు రోజుల పాటు జ్వరం తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు సంజీవనగర్‌ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ టైఫాయిడ్, మలేరియా, ప్లేట్‌లెట్‌ కౌంట్‌ పరీక్షలు రాశారు. ప్లేట్‌లెట్లు 60 వేలకు తగ్గకూడదని, మీ పాపకు 55 వేలు ఉన్నాయని, డెంగీ లక్షణాలు కనిపిస్తున్నాయని భయపెట్టారు. చేసేది లేక చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించగా.. వారం రోజులు ఉంచుకుని రూ.40 వేల బిల్లు వేశారు.  

మరిన్ని వార్తలు