చైతన్యానికి చిరునామా..నందిగామా

19 Mar, 2019 08:21 IST|Sakshi
నందిగామ ముఖచిత్రం

సాక్షి, నందిగామ : రాజకీయ చైతన్యం కల్గిన ప్రాంతం నందిగామ నియోజకవర్గం.  1955లో తొలిసారిగా నందిగామ నియోజకవర్గం ఏర్పడింది.  మొత్తం నాలుగు మండలాలతో దేశంలోని అత్యంత రద్దీ రహదారుల్లో రెండో స్థానం ఆక్రమించిన 65వ నెంబరు జాతీయ రహదారి ఈ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల మీదుగా వెళ్తుంది. ముఖ్యంగా నందిగామ, కంచికచర్ల పట్టణాలు ఈ రహదారి పక్కనే విస్తరించి ఉన్నాయి. తొలిసారి శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన అయ్యదేవర కాళేశ్వరరావు ఈ నియోజకవర్గానికి చెందిన వాడే కావడం విశేషం.

దేశంలోని జీవనదుల్లో ఒకటైన కృష్ణా నది చందర్లపాడు, కంచికచర్ల మండలాల మీదుగానే తూర్పునకు సాగిపోతుంది. దీనికితోడు నందిగామ, వీరులపాడు మండలాల మీదుగా మున్నేరు, వైరా ఏరు, కట్టెలేరు వంటి ఉప నదులు ప్రవహిస్తాయి. చుట్టూ నీరు ఉన్నప్పటికీ నేటికీ మంచినీరందని గ్రామాలు అనేకం ఉన్నాయి. నందిగామ పట్టణంలో కూడా ఈ సమస్య అధికం. ఇక పారిశ్రామిక పరంగా పూర్తిగా వెనుకబడిన ప్రాంతంగా చెప్పుకోవచ్చు.

ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించి వసంత నాగేశ్వరరావు హోం మంత్రి పదవిని అలంకరించారు. అదేవిధంగా రాజకీయ కురు వృద్ధుడిగా పేరుపొందిన ముక్కపాటి వెంకటేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా,  దేవినేని వెంకట రమణ ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.

అత్యధిక పంచాయతీలు 
నందిగామ నియోజకవర్గంలో నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు మొత్తం నాలుగు మండలాలున్నాయి. నందిగామ మండల పరిధిలోని 13 గ్రామాలు మాత్రమే నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. మిగిలిన 10 గ్రామాలు జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. మొత్తం నందిగామ మండలంలో 23 గ్రామ పంచాయతీలు, కంచికచర్ల మండలంలో 16, వీరులపాడు మండలంలో 24, చందర్లపాడు మండలంలో 18 పంచాయతీలున్నాయి. నియోజకవర్గ పరిధిలో మొత్తం 71 గ్రామ పంచాయతీలు, ఓ నగర పంచాయతీ ఉన్నాయి.

జీవన శైలి 
నందిగామ నియోజకవర్గంలో 80 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారు. మెట్ట ప్రాంతం కావడంతో పత్తి, మిర్చి, అపరాలు, సుబాబుల్, వరి, మొక్కజొన్న వంటివి అధికంగా సాగు చేస్తారు. దీనికితోడు పాడి పరిశ్రమపై ఆధారపడి చాలా మంది జీవిస్తున్నారు. ఎన్నికల సమయం మినహా మిగిలిన సమయంలో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది.  నందిగామకు పడమర వైపు దేశంలోని జీవ నదుల్లో ఒకటిగా ఉన్న కృష్ణా నది ప్రవహిస్తోంది. ఉత్తరాన జగ్గయ్యపేట నియోజకవర్గం, తూర్పున తెలంగాణ రాష్ట్ర సరిహద్దు, దక్షిణాన మైలవరం నియోజకవర్గం ఉన్నాయి. 

అధిక శాతం నిరుపేదలే
నియోజకవర్గంలో అధిక శాతం నిరుపేదలు, మధ్య తరగతి ప్రజలే. వ్యాపారాలు చేసే వారి సంఖ్య తక్కువనే చెప్పాలి. సంపన్నుల శాతం అతి తక్కువ. నిరుద్యోగులు అధికం. పారిశ్రామికంగా కూడా నియోజకవర్గం ఎటువంటి వృద్ధి సాధించకపోవడంతో జీవనశైలిలో పెద్దగా మార్పులు కనపడటం లేదు. 

నందిగామకు ప్రత్యేక స్థానం
ఎన్నికలు జరిగిన తొలి ఏడాదిలోనే ఇక్కడి నుంచి సీపీఐ తరపున బరిలో నిలిచిన పిల్లలమర్రి వెంకటేశ్వర్లు ఘన విజయం సాధించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో సైతం విజయం ఆయననే వరించింది. 1955 నుంచి ఇప్పటివరకు మొత్తం 14 సార్లు (బై ఎలక్షన్‌తో కలిపి) ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గం నుంచి వివిధ పార్టీల ద్వారా విజయం సాధించిన వారిలో మొత్తం ముగ్గురు మంత్రులుగా పనిచేశారు. వీరిలో వసంత నాగేశ్వరరావు ఏకంగా హోం మినిష్టర్‌గా పనిచేయడం గమనార్హం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి తొలి   శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన అయ్యదేవర కాళేశ్వరరావు నందిగామకు చెందిన వారే. 

మహిళలే కింగ్‌ మేకర్లు
నందిగామ నియోజకవర్గంలో మహిళల ఓట్లే అత్యంత కీలకం, వారు ఎవరికి ఓటు వేస్తే వారినే విజయలక్ష్మి వరిస్తుంది. నియోజకవర్గంలో మహిళ ఓటర్లే అధికంగా ఉండటంతోపాటు జనాభా పరంగా కూడా వారే అధికం కావడమే కాకండా ఓటు హక్కు వినియోగించుకోవడంలో కూడా వీరి శాతమే అధికంగా ఉంటోంది. దీంతో వీరు ఎవరి వైపు మొగ్గు చూపితే, ఆ పార్టీ, సంబంధిత అభ్యర్థి ఎమ్మెల్యే కావడం ఖాయం. దాదాపుగా మొత్తం జనాభా 2,54,734 కాగా వీరిలో 1,28,531  మహిళా ఓటర్లు ఉన్నాయి.      ప్రతి ఎన్నికల్లో 65 నుంచి 75 శాతం మధ్య పోలింగ్‌ జరుగుతుంది. ఓటు వేసే వారిలో మహిళల సంఖ్యే అధికంగా ఉంటోంది. 

నాడు కంచుకోట!
పదకొండు పర్యాయాలపాటు జనరల్‌ కేటగిరీలో ఉన్న నియోజకవర్గం 2009 నుంచి ఎస్సీలకు రిజర్వు చేశారు. దీంతో 2009, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల ప్రభాకరరావు విజయం సాధించారు. అయితే ఎన్నికలు పూర్తయిన నెల రోజులకే ఆయన మృతిచెందారు. దీంతో ఉప ఎన్నికల్లో ఆయన కుమార్తె ప్రస్తుత ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గెలుపొందారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని నిలబెట్ట లేదు. అయితే కాంగ్రెస్‌ పార్టీ బరిలో నిలిచినా, డిపాజిట్లు కూడా దక్కలేదు. 

నందిగామ నియోజకవర్గం
మొత్తం జనాభా : 2,54,734
పురుషులు : 1,26,203
మహిళలు : 1,28,531
నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య : 1,93,712
పురుషులు :  95,279
మహిళలు    :    98,426
థర్డ్‌ జెండర్‌    :    7
విస్తీర్ణం(చదరపు కిలోమీటర్లలో  :  718 
రెవెన్యూ గ్రామాలు  :  81
గ్రామ పంచాయతీలు  :  69 

మరిన్ని వార్తలు