ఎన్నికల ప్రచారంలో అఖిలప్రియకు భంగపాటు

14 Aug, 2017 11:45 IST|Sakshi
ఎన్నికల ప్రచారంలో అఖిలప్రియకు భంగపాటు
నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో భూమా కుటుంబానికి అడుగడునా నిరసనలు ఎదురవుతున్నాయి. గత ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించినా తమ సమస్యలు తీర్చడం లేదంటూ స్థానికులు నిలదీస్తున్నారు. అభివృద్ధి చేస్తారని ఓట్లేస్తే న్యాయం జరగలేదంటూ భూమా అఖిలప్రియను అడ్డుకుంటున్నారు. ‘సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ సమస్యలు అలానే ఉన్నాయి. మీరు చేసిన అభివృద్ధి ఏంటి? అన్యాయం జరిగినా స్పందించలేదు. ఎన్నికలు వస్తే మాత్రం ఓట్లు అడుగుతారా?’ అంటూ నంద్యాలలో మంత్రి భూమా అఖిలప్రియతో పాటు ఆమె సోదరుడు విఖ్యాత రెడ్డిని స్థానికులు నిలదీసిన తీరుది.
 
నంద్యాల తొమ్మిదో వార్డు గడిపాడు ప్రాంతంలో అఖిలప్రియ, విఖ్యాత రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏడేళ్ల క్రితం నంద్యాల సమీపంలోని అయ్యలూరు గ్రామ పంచాయితీలోని సిద్ధార్థ నగర్‌ లో 854 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి పట్టాలు కూడా ఇచ్చారు. అయితే ప్రభుత్వం మరిన్ని ఇళ్లు కట్టిస్తామని చెప్పడంతో ఇప్పటికే అక్కడ నిర్మాణాలు చేపట్టిన లబ్థిదారుల ఇళ్ల బేస్‌మెంట్ల ను కూల్చివేశారు.
 
న్యాయం చేయాలంటూ బాధితులు ఎన్నిసార్లు ధర్నాలు, విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదు. అప్పటినుంచి ఆగ్రహంగా ఉన్న స్థానికులు ఉప ఎన్నిక కోసం ఓట్లు అడిగేందుకు వచ్చిన టీడీపీ నేతలను నిలదీశారు. తమ సమస్యలు తీర్చిన తర్వాత ఓట్ల కోసం తమ కాలనీలకు రావాలంటూ మహిళలు తేల్చిచెప్పి అఖిలప్రియకు ఒకింత షాక్‌ ఇచ్చారు. దీంతో టీడీపీ నేతలు మరోమాట మాట్లాడకుండా అక్కడ నుంచి వెనుదిరిగారు.