‘శిల్పా కుటుంబాన్ని ఏమీ చేయలేరు’

22 Aug, 2017 03:04 IST|Sakshi
‘శిల్పా కుటుంబాన్ని ఏమీ చేయలేరు’

►శిల్పా కుటుంబంపై ఎన్నడూ అవినీతి ఆరోపణలు లేవు
►నీతి నిజాయితీలే పరమావధిగా భావించి రాజకీయాల్లోకి వచ్చాం
►వైఎస్‌ జగన్‌ ప్రజాదరణను చూసి టీడీపీ భయపడుతోంది
►భూమా కుటుంబంలోని పిల్లలు చిన్నపిల్లలేం కాదు
►ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దు

నంద్యాల : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...శిల్పా సహకార సొసైటీపై చేసిన ఆరోపణలను వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి ఖండించారు. సోమవారం ఉదయం శిల్పా మోహన్‌ రెడ్డి  నంద్యాలలో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం విమర్శలు, ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు. శిల్పా కుటుంబంపై ఎన్నడూ అవినీతి ఆరోపణలు లేవని,  తాము ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు. తమ కుటుంబానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారాలు, తాజా పరిణామాలు చాలా బాధపెడుతున్నాయన్నారు.

తనపై ఇప్పటివరకూ చిన్నకేసు కూడా లేదని శిల్పా మోహన్‌ రెడ్డి తెలిపారు. తాము ఎన్నడూ సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదన్నారు. పదిమందికి సహాయం చేయాలని ఆశించామని, నీతి నిజాయితీలే పరమావధిగా భావించి రాజకీయాల్లోకి వచ్చామన్నారు. బెదిరింపులతో భయపడేది లేదని శిల్పా మోహన్‌ రెడ్డి అన్నారు.

నంద్యాల ఎన్నికల్లో టీడీపీ పెద్ద ఎత్తున అక్రమాలు చేస్తోందని, టీడీపీకే ఓట్లు వేయాలంటూ అన్నివర్గాలను బెదిరింపులకు గురి చేస్తున్నారని, కోట్ల రూపాయిలు టీడీపీ నేతలు వెదజల్లుతున్నారని శిల్పా మోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు.  అధికార బలంతో టీడీపీ నేతలు భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రలోభపెట్టి కౌన్సిలర్లను, నాయకులను తీసుకున్నారన్నారు. అర్థరాత్రి తమ కార్యకర్తలు, అనుచరులపై పోలీసులు దాడి చేశారని ఆయన తెలిపారు. ప్రజల అండ ఉన్నంతవరకూ శిల్పా కుటుంబాన్నిఎవరూ ఏమీ చేయలేరని అన్నారు.

ఆరోపణలు బాధాకరం..
‘శిల్పా సహకార బ్యాంకుపై చంద్రబాబు ఆరోపణలు చేయడం బాధాకరం. శిల్పా సహకార సొసైటీ చట్ట వ్యతిరేకమని సీఎం ఆరోపించారు. చంద్రబాబు చేసిన ఆరోపణలపై వివరణ ఇవాల్సిన అవసరం ఉంది. శిల్పా సహకార సొసైటీ రిజిస్ట్రర్‌ అయింది. ఏ విచారణకు అయినా మేం సిద్ధం. ఎప్పుడు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. ఈ రోజు వరకూ మేం నిజాయితీగా ఉన్నాం. మానవ సేవే మాధవ సేవగా నమ్మి రాజకీయాల్లోకి వచ్చాం. పేద కుటుంబంలో పుట్టి పదిమందికి సేవ చేయాలని ఆశించా. శిల్పా కుటుంబంపై ఎప్పుడు అవనీతి ఆరోపణలు లేవు.

టీడీపీ భయపడుతోంది..
12 రోజుల పర్యటనలో వైఎస్‌ జగన్‌కు ప్రజా స్పందన వస్తోందని, ప్రచారంలో అనేక మందిని కలిశారన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రజాదరణను చూసి టీడీపీ భయపడుతోంది. మూడున్నరేళ్లుగా చంద్రబాబు అవినీతి పాలనపై మాట్లాడారు. వైఎస్‌ జగన్‌కు మా కుటుంబం తరఫున ధన్యవాదాలు. మూడేళ్లు టీడీపీలో ఉన్నాం. ఎన్ని విజ్ఞప్తులు చేసి చంద్రబాబు పట్టించుకోలేదు. ఇప్పటికిప్పుడు టీడీపీ చేస్తున్న పనులను మేం నమ్మడం లేదు. టీడీపీకే ఓటు వేయాలంటూ అన్ని వర్గాలను బెదిరిస్తున్నారు. ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దు.

వైఎస్‌ఆర్‌ సీపీ అండగా ఉంటుంది..
మీకు వచ్చే పెన్షన్లు, రేషన్‌ మొత్తం ఆన్‌లైన్‌లో ఉంటుంది. మీకు ఏ ఇబ్బంది కలిగినా వైఎస్‌ఆర్‌ సీపీ అండగా ఉంటుంది. ఎన్ని కుట్రలు పన్నినా శిల్పా కుటుంబాన్ని ఏమీ చేయలేరు. బెదిరిస్తే నేను భయపడేవాడిని కాదు. అలాంటి బెదిరింపులకు లొంగేది లేదు. మేం ఎప్పుడు ఏ వ్యక్తి గురించి చెడు మాట్లాడలేదు. చెడను ప్రచారం చేయలేదు. నేను అనని మాటలను కూడా అన్నానని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇదంతా నంద్యాల ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలి.’  అని సూచించారు.