నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూత

30 Apr, 2019 22:52 IST|Sakshi

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నంద్యాల ఎంపీ

దాదాపు నెల రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స

కేర్‌లో చికిత్స పొందుతూ మృతి

2004, 2009, 2014లో నంద్యాల ఎంపీగా విజయం

అనారోగ్యంతో హైదరాబాద్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి

నంద్యాల నుంచి మూడు సార్లు ఎంపీగా ఎన్నిక

నంద్యాల: నంద్యాల ఎంపీ, నంది గ్రూప్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకుడు ఎస్పీవై రెడ్డి (69) అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లోని కేర్‌ ఆసు పత్రిలో మంగళవారం మృతి చెందారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరా బాద్‌లో చికిత్స తీసుకుంటున్న విషయం విదితమే. ఎస్పీవైరెడ్డి మరణవార్త విని కుటుంబ సభ్యులు,  అభిమానులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఎస్పీవై రెడ్డి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం అంకా లమ్మ గూడూరులో 1950లో జన్మించారు. 2004, 2009 ఎన్నికల్లో నంద్యాల లోక్‌ సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందిన ఎస్పీవై రెడ్డి 2014లో వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసి హ్యాట్రిక్‌ విజయాన్ని సాధించారు. ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరారు.

టీడీపీ నాయకత్వం తనకే టికెట్‌ ఇస్తుందని చివరి నిమిషం వరకూ ఆశ పెట్టుకున్న ఆయనకు చంద్రబాబు మొండిచెయ్యి చూపారు. చంద్రబాబు చేసిన మోసానికి ఎస్పీవైరెడ్డి కుంగిపోయారు. చివరికి ఎస్పీవైరెడ్డి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఎస్పీ వైరెడ్డితో పాటు తన ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లను నంద్యాల, పాణ్యం, శ్రీశైలం ఎమ్మెల్యే అభ్యర్థులుగా జనసేన పార్టీ తరుఫున పోటీ చేయించారు. ప్రచారం మధ్యలోనే అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరిన ఎస్పీవై రెడ్డి కోలుకోలేక మృతి చెందాడు. ఎస్పీవైరెడ్డి నంద్యాల, కర్నూలులో రూపాయికే రొట్టె, పప్పు కేంద్రాలు నడిపి ప్రజాభిమానం పొందారు. గ్రామాల్లో వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయడం, పార్లమెంట్‌ పరిధిలో ఏ కార్యక్రమాలు జరిగినా వారి కి ఉచిత భోజన వసతి కల్పించడం, బోర్లు, బావులు వేయించడం ద్వారా ప్రజలకు చేరువయ్యా రు.

పైపుల రెడ్డిగా ప్రాచుర్యం
ఎస్పీవై రెడ్డి పూర్తి పేరు సన్నపురెడ్డి పెద్ద యెరుకల రెడ్డి. ఆయన స్థాపించిన నంద్యాల పైపుల పరిశ్రమ వల్ల పైపుల రెడ్డిగా ప్రాచుర్యం పొందారు. బీటెక్‌ చదివిన ఆయన మొదట ముంబాయిలోని బాబా అటామిక్‌ రీసెర్చ్‌ కేంద్రంలో ఉద్యోగం చేశారు. అనంతరం 1977లో నంద్యాలలో పైపుల ఫ్యాక్టరీ స్థాపించారు. ఆయన మంచి బాస్కెట్‌బాల్‌ ఆట గాడు. జొన్నరొట్టె, సంగటి, పోలూరు వంకాయతో చేసిన కూర అంటే ఆయనకు ఇష్టం. 1991లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓటమి చవి చూశారు. 2001లో మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు.

ఏపీ సీఎం సంతాపం: ఎస్పీవై రెడ్డి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. పారిశ్రామిక వేత్తగా, స్వచ్ఛంద సేవకునిగా ఆయన సేవలను   కొనియాడారు. 

మరిన్ని వార్తలు