అర్షద్‌..సాధించెన్‌

21 Sep, 2019 08:36 IST|Sakshi

భగీరథి–2ను ఎక్కిన నంద్యాల దివ్యాంగుడు 

ఆత్మవిశ్వాసమే ఆయుధంగా రాణింపు 

స్విమ్మింగ్‌లో కింగ్‌.. ఆర్చరీలో హీరో

బాడీ బిల్డిండ్‌లోనూ ప్రతిభ 

సాక్షి, కర్నూలు: సంకల్ప బలం ఉంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించాడు నంద్యాల పట్టణానికి చెందిన షేక్‌ అర్షద్‌. పర్వతమంత ఆత్మస్థైర్యాన్ని నింపుకుని అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచాడు ఆ యువకుడు. దివ్యాంగుడైనా..పలు క్రీడల్లో ప్రతిభ కనబరుస్తూ ప్రశంసలందుకుంటున్నాడు. హిమాలయాల్లో భగీరథి–2 పర్వతాన్ని 18వేల అడుగుల ఎత్తు ఎవరకు అధిరోహించి శుక్రవారం కర్నూలుకు వచ్చిన సందర్భంగా ఈయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అర్షద్‌ సాధించిన విజయాలపై ప్రత్యేక కథనం... 


అర్షద్‌కు స్వాగతం పలుకుతున్న కర్నూలు ప్రజలు 

నంద్యాల పట్టణం  సంజీవనగర్‌కు చెందన షేక్‌ ఇస్మాయిల్, ససీమ్‌ల ఐదుగురి  సంతానంలో రెండు వాడు అర్షద్‌. చిన్న తనం నుంచే క్రీడల్లో రాణిస్తూ తైక్వాండోలో గ్రీన్‌ బెల్ట్‌ సాధించాడు. అయితే ఏడో తరగతి చదువు చదువుతున్న సమయంలో (2004)లో ఆటో ప్రమాదానికి గురయ్యాడు. దీంతో ఎడమ కాలు తొలగించాల్సి వచ్చింది. అయినా క్రీడలపై అర్షద్‌కు మక్కువ తగ్గలేదు. దాతల సహకారంతో అర్చరీలో శిక్షణ తీసుకొని..జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటాడు. బాడీ బిల్డింగ్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించాడు. ‘మిస్టర్‌ ఆంధ్ర’, ‘మిస్టర్‌ రాయలసీమ’గా ఎంపికయ్యాడు. స్విమ్మింగ్‌లోనూ రాణించి ఎన్నో పతకాలు సాధించాడు. హ్యాండ్‌ సైక్లింగ్, మారథాన్, వీల్‌ ఛైర్‌ ఫెన్సింగ్‌.. ఇలా పలు క్రీడల్లోనూ రాణిస్తున్నాడు. ఆగస్టు నెల 26వ తేదీన హిమాలయాల్లో భగీరథి–2 పర్వతాన్ని ఎక్కేందుకు బయలు దేరాడు. మంచు వర్షంతో చరియలు విరిగిపడిన కారణంగా 18 వేల అడుగుల ఎత్తు వరకు వెళ్లి నిపుణుల సూచనల మేరకు వెనుదిరగాడు. శుక్రవారం కర్నూలుకు వచ్చిన షేక్‌ అర్షద్‌కు కర్నూలు సిటీ రైల్వే స్టేషన్‌లో ఘన స్వాగతం లభించింది. హర్షద్‌ తండ్రి షేక్‌ ఇస్మాయిల్, ఆవాజ్‌ కమిటీ నాయకులు ఇక్బాల్, షరీఫ్, అబ్దుల్‌ దేశాయ్‌ తదితరులు పాల్గొన్నారు. 

చదవండి : వణుకుతున్న నంద్యాల

మరిన్ని వార్తలు