అందరం కలిసికట్టుగా ఈ చీకటిపై పోరాడుదాం

26 Jun, 2020 17:12 IST|Sakshi

సాక్షి, అమరావతి‌:  నేడు (జూన్ 26న) అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం. ఈ సందర్భంగా మాదకద్రవ్యాలు ఎంత ప్రమాదకరమో, వాటికి బానిస అయితే జీవితాలు ఎంత ప్రమాదకరంగా మారతాయో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖ ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. సినీ, క్రీడా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులతో కలిసి ప్రజల్లో అవగాహన కలిగించేలా వీడియోలను రూపొందించి విడుదల చేసింది. నేచురల్‌ స్టార్‌ నానితో కలిసి ఏపీ పోలీస్‌ శాఖ ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ప్రజలకు ముఖ్యంగా యువతకు నాని ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. (మనసును కలిచివేస్తోంది: చిరంజీవి)

‘మీరు జీవితంలో చాలా ఎత్తుకు ఎదిగితే చూడాలిన మీ స్నేహితులు‌, కుటుంబ సభ్యులు‌, చుట్టూ ఉన్న సమాజం ఇలా చాలా మంది ఎదురుచూస్తుంటారు. అయితే మీరు ఎదగకుండా పాతాళానికి పడిపోతే చూడాలని ఒకడు ఎదురుచూస్తున్నాడు. అదే డ్రగ్స్‌. ఆ డ్రగ్స్‌ వైపు వేసే ఒకే ఒక తప్పటడుగు మీ చేతులోంచి మీ జీవితంపై మీకున్న మొత్తం కంట్రోల్‌ను లాగేసుకుంటుంది. ఆ కంట్రోల్‌ మొత్తం దాని చేతుల్లోకి వెళుతుంది. మిమ్మల్ని డ్రగ్స్‌కు బానిసల్ల మార్చి మీ నుంచే డబ్బులను సంపాదించాలనుకునే మాఫియాలు, బ్లాక్‌మార్కెట్‌లు చాలానే ఉన్నాయి.  

అవన్నీ ఒకవైపు.. వాటన్నింటి నుంచి మిమ్మల్ని కాపాడాలని కష్టపడుతున్న వేలాది పోలీసులు ఒక వైపు.. మీరేవైపు? వాళ్లు చీకటితో చేస్తున్న యుద్దంలో మనం కూడా భాగస్వాములు అవుదాం. వాళ్లకు కొంచెం సహాయం చేద్దాం. మీ దగ్గర లేదంటే మీ స్నేహితుల దగ్గర ఏమైనా సమాచారం ఉన్నా.. లేదంటే మీకేమైనా తెలిస్తే అది పోలీసులతో షేర్‌ చేసుకోండి. మీ పేరు కూడా బయటకు రానివ్వరు. అందరం కలిసి ఈ చీకటిపై పోరాడుదాం‌.. జైహింద్‌’ అంటూ నాని పేర్కొన్నాడు. ఇక నానితో పాటు మెగాస్టార్‌ చిరంజీవి, సాయిధరమ్‌ తేజ్‌, ఇతర ప్రముఖులు ప్రజల్లో అవగాహన కల్పించేలా వీడియోలు రూపొందించి విడుదల చేశారు. (నాన్న అంటే ప్రేమ.. ధైర్యం)

మరిన్ని వార్తలు