‘భార్యా బాధితులే ఎక్కువ’

10 Nov, 2017 21:02 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం భార్యా బాధితుల ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. మహిళా కమిషన్‌కు మహిళలపై జరిగే గృహహింస కేసుల కన్నా ‘భార్యా బాధితులవే’ ఎక్కువయ్యాయని ఆమె అన్నారు. అసెంబ్లీ లాబీల్లో శుక్రవారం ఆమె మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. 

మహిళలపై గృహహింసకు సంబంధించి తమకు వస్తున్న ఫిర్యాదుల్లో కొన్ని తప్పుడు ఫిర్యాదులు కూడా ఉంటున్నాయని అన్నారు. తమపై కూడా తమ భార్యలు హింసకు దిగుతున్నారని, తమకు న్యాయం చేయాలంటూ పలువురు పురుషుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. తమది మహిళా కమిషన్ కనుక వాటిని స్వీకరించి విచారించే అధికారం తమకు లేదని చెబుతున్నా పలువురు తమ గోడు వెళ్లబోసుకొనేందుకు కమిషన్‌ వద్దకు వస్తున్నారన్నారు. తాము తిరస్కరిస్తున్న ఫిర్యాదులను తిరిగి వారి తల్లి ద్వారానో, చెల్లెల ద్వారా ఇప్పిస్తున్నారని తెలిపారు.

తమ కుమారుడిని భార్య వేధిస్తోందని వారితో ఫిర్యాదులు చేయిస్తున్నారని చెప్పారు. మహిళల ద్వారా అందుతున్న ఆ ఫిర్యాదులను నిబంధనల ప్రకారం స్వీకరించి విచారిస్తున్నామని చెప్పారు. ఇటీవల ఓ మహిళ తమ కమిషన్ను కలసి తనను భర్త వేధిస్తున్నాడని, తన చేతులపై గాయాలు చేశారని చూపించింది. తాము ఫిర్యాదును స్వీకరించి విచారిస్తే ఆమె చేతులకు ఉన్న గాయాలను తనకు తాను గాజులను పగులగొట్టుకోవడం వల్ల అయ్యాయని తేలిందని నన్నపనేని రాజకుమారి తెలిపారు.

తమకు మాత్రం తన భర్తే తన రెండు చేతులను కొట్టి గాయపర్చినట్లు ఆమె ఫిర్యాదు చేసిందన్నారు. అయితే ఆమె కుమార్తె స్వయంగా తన తల్లే గాజులు పగులగొట్టుకున్నట్లు తెలిపిందని వివరించారు. మరో కేసులో ఎన్ఆర్‌ఐ భర్త తనను వేధించాడని ఒక మహిళ ఫిర్యాదు చేసింది. కానీ, ప్రాథమిక విచారణ చేయించి కేసు పెట్టించామని, దాంతో అతను అరెస్టు అయ్యాడన్నారు. తరువాత లోతుగా విచారస్తే ఆమె వైపు నుంచే పొరపాట్లు ఉన్నాయని తెలిపారు. అయితే అప్పటికే అరెస్టు అవ్వడంతో ఆయన తిరిగి తన ఉద్యోగం చేస్తున్న దేశానికి వెళ్లే పరిస్థితి లేకుంగా పోయిందన్నారు. ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు కూడా అందుతున్న నేపథ్యంలో తాము గృహహింస కేసుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నన్నపనేని రాజకుమారి అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు