కీచక అధ్యాపకుడిని నిలదీసిన మహిళలు..

14 Oct, 2019 18:34 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి : లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్‌ ఎన్‌. సూర్యరాఘవేంద్ర సస్పెండ్‌ అయ్యారు. రాఘవేంద్రపై లైంగిక ఆరోపణలు రావడంతో అంతర్గత విచారణ చేపట్టిన యూనివర్సిటీ వైఎస్‌ చాన్సలర్‌ అతన్ని సస్సెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే అంతకు ముందు యూనివర్సిటీ వద్దకు చేరుకున్న పలువురు మహిళలు రాఘవేంద్ర చేసిన తప్పును ఒప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. వారిలో వైఎస్సార్‌సీపీ మహిళా నాయకులు  జక్కంపూడి విజయలక్ష్మి, మేడపాటి షర్మిలారెడ్డి కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా రాఘవేంద్ర సాగించిన వేధింపులను వారు వీసీ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే రాఘవేంద్రను పలు అంశాలపై నిలదీశారు. అధ్యాపకుడు అయి ఉండి విద్యార్థినిలతో రాత్రి పూట చాటింగ్‌ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాఘవేంద్రపై చర్యలు తీసుకోవాలని.. ఆయన్ని కచ్చితంగా శిక్షించాలని కోరారు. విద్యార్థుల లేఖపై స్పందించి చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, పాఠాలు చెప్పాల్సిన ఈ మాస్టారు ప్రేమ పాఠాలు చెబుతూ.. లైంగిక వాంఛ తీర్చాలంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు. చాలా కాలంగా ప్రొఫెసర్‌ వేధింపులను భరిస్తూ వచ్చారు. వేధింపులు ఇటీవల మితిమీరిపోవడంతో నలుగురైదుగురు విద్యార్థినులు ధైర్యం చేసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. ప్రొఫెసర్‌ నుంచి ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను లేఖలో పూసగుచ్చినట్టు వివరించారు. దీనిపై తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి విచారణకు ఉన్నత విద్యాశాఖను ఆదేశించారు. ఆ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్‌ టేకీ ఆధ్వర్యంలో అంతర్గతంగా విచారణ జరుపుతున్నారు. 

మరిన్ని వార్తలు