తల్లిదండ్రుల కష్టం..ఉన్నత స్థానం

2 Oct, 2017 15:13 IST|Sakshi

 గిరిజన కాలనీ నుంచి యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ స్థాయిఅశోక్‌ జీవితగమనం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కోట : జీవితంలో ఏదో సాధించాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. అయితే కొందరు జీవన పోరాటంలో కొంత దూరం ప్రయాణించి అలిసిపోతారు. మరి కొందరు అలుపెరుగని పోరాటంతో తమ జీవిత కలను సాకారం చేసుకుంటారు. ఈ ప్రయత్నంలో ఎన్నికష్టాలు ఎదురొచ్చినా అధిగమిస్తూ విజయతీరాలకు చేరుతారు. ఈ కోవకు చెందిన వారే కోట మండలం సిద్ధవరం గ్రామానికి చెందిన తుపాకుల అశోక్‌. మారుమూల గిరిజన కాలనీలో పుట్టిపెరిగిన అశోక్‌ నన్నయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ఉన్నత స్థాయి బాధ్యతను గత ఆగస్టులో చేపట్టాడు. ఆదివారం కోటకు వచ్చిన ఆశోక్‌ ‘సాక్షి’తో తన జీవిత అనుభవాలను పంచుకున్నారు.

సుబ్బరామయ్య, రాగమ్మ కుమారుడు అశోక్‌. తల్లిదండ్రులిద్దరూ కూలీలు. నిరుపేదలు కావడంతో విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే సాగింది. సిద్ధవరంలో ప్రాథమిక విద్య అనంతరం కోట ఎస్టీ గురుకుల పాఠశాలలో 1996లో టెన్త్‌ పూర్తి చేశారు. ఇంటర్,డిగ్రీ విద్యానగర్‌ ఎన్‌బీకేఆర్‌లో చదివారు. తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో పీజీ చేశారు. అనంతరం పులివెందుల వైఎస్‌ రాజారెడ్డి లయోలా డిగ్రీ కళాశాలలో నాలుగేళ్ల పాటు ఇంగ్లిష్‌ అధ్యాపకుడిగా పనిచేశారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని కాకినాడ పీజీ సెంటర్‌లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా, ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వేరుపడటంతో అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఉత్తమ పనితీరుతో అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆగస్టు 28న నన్నయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు.

తల్లిదండ్రులకు చదువు రాకపోయినా ఉన్నత లక్ష్యం అందుకోవాలన్న బలమైన కోరికే తన ఎదుగుదలకు కారణమని అశోక్‌ చెప్పారు. 38 ఏళ్లకే యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ స్థాయికి ఎదిగినా తన ఉన్నతిని చూసేందుకు తల్లిదండ్రులు లేక పోవడం తీరని లోటని ఆశోక్‌ అన్నారు. 460 అఫిలియేటెడ్‌ కళాశాలలున్న నన్నయ్య యూనివర్సిటీ ఖ్యాతిని మరింత పెంచేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.

మరిన్ని వార్తలు