రౌడీషీటర్‌తో లోకేష్‌ ములాఖత్‌ 

23 Nov, 2019 10:30 IST|Sakshi
సబ్‌జైల్‌ లో ఉన్న రౌడీషీటర్‌ కోటిరెడ్డిని పరామర్శించి బయటకు వస్తున్న మాజీ మంత్రి నారా లోకేష్, టీడీపీ నేతలు     

తొమ్మిది క్రిమినల్‌ కేసుల్లో     ముద్దాయిగా ఉన్న కోటిరెడ్డి 

వారం క్రితం హత్యాయత్నం కేసులో రిమాండ్‌ 

సబ్‌ జైల్‌లో ఉన్న రౌడీషీటర్‌తో లోకేష్‌ ఏకాంత చర్చలు 

సాక్షి, నరసరావుపేట : సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహించటం.. అల్లర్లకు ఉసిగొల్పటం వంటి చర్యలకు పాల్పడటంలో తెలుగుదేశం పార్టీది మొదటి నుంచి అందెవేసిన చెయ్యిగా చెప్పుకోవచ్చు. తొమ్మిది క్రిమినల్‌ కేసుల్లో ముద్దాయిగా ఉండి రౌడీషీటర్‌గా చెలామణి అవుతూ సబ్‌ జైల్‌లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న నిందితుడితో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ ములాఖత్‌ అవ్వటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్యకర్తల సంఘీభావం ముసుగులో టీడీపీ గూండాలను అక్కున చేర్చుకొని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు గొడవలు సృష్టించేందుకు టీడీపీ పక్కా వ్యూహం రచించిందన్న ఆరోపణలు సర్వతార వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకెళితే.. రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలేనికి చెందిన కుమ్మెత కోటిరెడ్డి తొమ్మిది క్రిమినల్‌ కేసుల్లో ప్రధాన నిందితుడు. అతనిపై రొంపిచర్ల పోలీస్‌స్టేషన్‌లో 2014 నుంచి ఏ ప్లస్‌ రౌడీషీట్‌ ఓపెన్‌ అయి ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కోటిరెడ్డి తన గ్రామంలోని పోలింగ్‌ కేంద్రంలో బ్యాలెట్‌ బాక్స్‌లు అపహరించాడు. ఆ సమయంలో పోలీసులు ఫైరింగ్‌ కూడా జరిపారు. 2013లోనే కోటిరెడ్డిపై హత్యాయత్నం, మహిళపై లైంగికదాడియత్నం వంటి కేసులు నమోదయ్యాయి.

దీంతో పాటు భూకబ్జాలు, బెదిరింపు వసూళ్లు, పలు దాడి కేసుల్లో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 20న రామిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన రాజనాల వెంకటరెడ్డిపై కోటిరెడ్డి, అతని అనుచరులు మారణాయుధాలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కోటిరెడ్డిని వారం రోజుల క్రితం రొంపిచర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ చదలవాడ అరవింద్‌బాబులతోపాటు ఆ పార్టీ మాజీ మంత్రులు అతన్ని విడిచిపెట్టాలని పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. పోలీసులు వినకపోవటంతో స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం డ్రామాకు తెరతీశారు.

అక్కడ నుంచి వైద్యశాలకు తరలించిన పోలీసులు ఎటువంటి హానీ లేదని వైద్యులు చెప్పిన సలహా మేరకు నిందితుడిని కోర్టులో హాజరు పరిచి సబ్‌ జైలుకు తరలించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి నారా లోకేష్‌ సబ్‌ జైల్‌లో ఉన్న రౌడీషీటర్‌ కోటిరెడ్డిని శుక్రవారం ములాఖత్‌ అయి ఏకాంతంగా మాట్లాడారు. రొంపిచర్ల మండలంలో గత కొన్నేళ్లుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్న కోటిరెడ్డిని లోకేష్‌ పరామర్శించటం పలు ఆరోపణలకు తావిస్తోంది. సొంత పార్టీలో నాయకులే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అసలే పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో రౌడీషీటర్‌ను లోకేష్‌ పరామర్శించటాన్ని ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

మరిన్ని వార్తలు