కొలువుల వల

14 Dec, 2019 12:12 IST|Sakshi

ఉద్యోగం పేరుతో నిరుద్యోగులకు టోపీ

మాజీ మంత్రి లోకేష్‌ వ్యక్తిగత కార్యదర్శి నిర్వాకం

బందరు రూరల్‌ స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు

రూ. 19 లక్షలు వసూలు చేశారని ఆరోపణ

ఫిర్యాదు చేసి రెండు నెలలు గడిచినా చర్యలు  తీసుకోని పోలీసులు

బాధితులపై బెదిరింపులకు పాల్పడుతున్న వసూలుదారుడు

ఆయన ఓ మాజీ మంత్రికి వ్యక్తిగత కార్యదర్శి(పీఎస్‌).. నిరుద్యోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్నాడు.. ఏపీ జెన్‌కో, డీఎం అండ్‌ హెచ్‌ఓ, ఆర్‌డీఓ, వ్యవసాయ కమిటీ.. ఎక్కడ కావాలంటే అక్కడ..ఉద్యోగం ఇప్పిస్తా.. మంత్రితో సిఫార్సు చేపిస్తా.. ప్రభుత్వం మనదే అంటూ నిరుద్యోగులకు కొలువుల వల విసిరాడు.. గుడ్డిగా నమ్మిననిరుద్యోగులు రూ. లక్షల్లో ఆయనకుసమర్పించుకున్నారు. నెలలు గడుస్తున్నాయి.. ఉద్యోగం లేదు.. ఈలోపుప్రభుత్వం కూడా మారిపోయింది..ఉద్యోగం సంగతి అటుంచితే తాముఇచ్చిన డబ్బు సంగతేంటని నిలదీస్తే..తిరిగి బెదిరింపులు.. రివర్స్‌ కేసు పెడతామంటూ హూంకరింపులు.. విసిగి
వేశారిన బాధితులు పోలీసులనుఆశ్రయించారు. ఇది జరిగి రెండు నెలలు దాటినా పోలీసులుఫిర్యాదుపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

సాక్షి, అమరావతిబ్యూరో : మాజీ మంత్రి లోకేష్‌ వ్యక్తిగత కార్యదర్శి(పీఎస్‌) పలువురు నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల పేరిట రూ.లక్షల్లో వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మచిలీపట్నానికి చెందిన కోన నాగార్జునకు.. మాజీ మంత్రి నారా లోకేష్‌ వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన బొంత అర్జునరావుతో పరిచయం ఉంది. మంత్రి సిఫార్సుతో వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలకడంతో కోన నాగార్జున పలువురు నిరుద్యోగులను అర్జునరావుకు పరిచయం చేశాడు. ఇలా పరిచయమైన వారితో అర్జునరావు బేరసారాలు నడిపి ముందుగా డబ్బులు తీసుకున్నాక ఇదిగో ఉద్యోగం.. అదిగో ఉద్యోగం అంటూ కాలం వెల్లదీశాడు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలవడంతో లోకేష్‌కు మంత్రి పదవి, ఆయన వద్ద పీఎస్‌ అర్జునరావుకు పదవి పోయింది. ఇక తమకు ఉద్యోగాలు ఇప్పించలేరని నిర్ధారించుకున్న బాధితులంతా కలిసి ఆయనను నిలదీయగా మీ డబ్బులు తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. సమయం గడుస్తున్నా డబ్బులుతిరిగి రాకపోవడంతో వారంతా కలిసి బందరు రూరల్‌ పోలీసుస్టేషన్‌లో అర్జునరావుపై అక్టోబరు 10న ఫిర్యాదు చేశారు. 

ఏఈ పోస్టుకు రూ. 9 లక్షలు వసూలు..
పామర్రుకు చెందిన ఊటుకూరి పవన్‌కుమార్‌ గుడివాడలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి 2016లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పట్టా అందుకున్నాడు. ఆ సమయంలో అతనికి బందరు తెలుగు యువత కార్యదర్శి కోన నాగార్జున పరిచయం అయ్యారు. ఇరువురు కలిసి అర్జునరావును వెలగపూడిలోని సచివాలయం కలిశారు. ఉద్యోగం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఏపీ జెన్‌కో సంస్థలో జూనియర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన పవన్‌కుమార్‌ అర్జునరావుకు మూడు దఫాలుగా రూ. 9 లక్షలు అందజేశాడు. అనంతరం అర్జునరావు జెన్‌కో సంస్థలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టు ఇవ్వాలంటూ మంత్రి సిఫార్సు చేశారంటూ నకిలీ లేఖను పవన్‌కు ఇచ్చాడు. తర్వాత తాను మోసపోయానని గ్రహించి మధ్యవర్తిగా వ్యవహరించిన కోన నాగార్జునను నిలదీయగా.. తాను కూడా మోసపోయానని తన వద్ద కూడా రూ.6.50 లక్షలు తీసుకున్నాడని వాపోయాడు. వీరితోపాటు మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్‌లో సెక్యూరిటీ గార్డు పోస్టు కోసం లంకె పోతురాజు రూ.1,50 లక్షలు.. డీఎం అండ్‌ హెచ్‌ఓ కార్యాలయంలో రెగ్యులర్‌ ఉద్యోగం కోసం రాజకుమారి అనే మహిళ, ఎక్స్‌–సర్వీస్‌మెన్‌ కోటా కింద వ్యవసాయభూమి కోసం దరఖాస్తు చేసిన కృతివెన్ను మండలం ఇంతేరు గ్రామానికి చెందిన కొల్లటి లక్ష్మి రూ.5 లక్షలు చెల్లించినట్లు తెలిసింది. 

బందరు రూరల్‌ పీఎస్‌లో ఫిర్యాదు...
డిప్యూటేషన్‌పై వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసి అర్జునరావు మాకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశాడని.. మా వద్ద రూ. లక్షలు దండుకున్నారని పేర్కొంటూ కోన నాగార్జున, పవన్‌కుమార్, లక్ష్మి, లంకె పోతురాజులు బందరు రూరల్‌ పోలీసుస్టేషన్‌లో అక్టోబరు 10న ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో వివిధ దఫాలుగా అర్జునరావు మొత్తం రూ. 19 లక్షలు మా నుంచి వసూలు చేశాడని బాధితులు పేర్కొన్నారు. అయితే రెండు నెలలు గడిచినా అర్జునరావుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అర్జునరావు గతంలో తనకు పరిచయం ఉన్న పోలీసు ఉన్నతాధికారులతో సిఫార్సు చేయించడంతోపాటు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఓ అధికారికి పెద్దమొత్తంలో లంచం ఇవ్వడం వల్లే కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

అసత్య ఆరోపణలు..
దీనిపై ప్రస్తుతం గుంటూరు జిల్లా రొంపిచర్ల ఎంపీడీవో పనిచేస్తున్న బొంత అర్జునరావును వివరణ కోరగా.. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదన్నారు.

రూ. 6.50 లక్షలు తీసుకున్నారు..  
నేను బందరు తెలుగుయువత కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో చాలా సార్లు నారా లోకేష్‌బాబును కలవడం జరిగింది. ఆ సమయంలో ఆయన వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న అర్జునరావు పరిచయం అయ్యారు. ఆయన మాటలు నమ్మి.. నాతోపాటు మరికొందరిని అతనికి పరిచయం చేశా.. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకున్నారు. నా భార్యకు ఏపీ జెన్‌కో సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.6.50 లక్షలు తీసుకున్నాడు. తీరా అతను నాతోపాటు అందరినీ మోసం చేశాడు.   – కోన నాగార్జున, మచిలీపట్నం

మూడు దఫాల్లో రూ. 9 లక్షలు ఇచ్చాను..
నేను బీటెక్‌ పూర్తి చేశాక.. కోన నాగార్జునతో పరిచయం ఏర్పడింది. అతనికి ఉద్యోగం గురించి చెప్పగా నారా లోకేష్‌ వద్ద పీఎస్‌గా పనిచేస్తున్న అర్జునరావుకు పరిచయం చేశాడు. అతడు నాకు ఏపీ జెన్‌కో సంస్థలో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టు ఇప్పిస్తానన్నాడు. అతని మాటలు నమ్మి బయట నుంచి వడ్డీకి తెచ్చి 2018 నవంబర్‌లో రూ. 2 లక్షలు, మరుసటి నెలలో రెండు లక్షలు, మూడోసారి 2019 జనవరిలో రూ. 5 లక్షలు ఇచ్చా. నకిలీ సిఫార్సు లేఖ ఒకటి నాకు ఇచ్చాడు. నా డబ్బు నాకు తిరిగి ఇవ్వమని అడితే నన్నే బెదిరిస్తున్నారు.      – ఊటుకూరి పవన్‌కుమార్,పామర్రు, కృష్ణా జిల్లా

అప్పు చేసి రూ. 5 లక్షలు ఇచ్చా..  
నా భర్త భాస్కరరావు మిలటరీలో పనిచేసి ఉద్యోగ విరమణ తీసుకున్నారు. ఆ తర్వాత తనకు హక్కుగా రావాల్సిన వ్యవసాయ భూమి కోసం కలెక్టరేట్‌లో దరఖాస్తు చేశా. ఇటీవల ఆయన అనారోగ్యంతో మంచంపట్టారు. ఈ సమయంలో కోన నాగార్జున ద్వారా పరిచయమైన అర్జునరావు తాను భూమి ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో అతనికి  రూ. 2 లక్షలు, మరోసారి రూ. 3 లక్షలు అందజేశా. నేటికీ మాకు వ్యయసాయ భూమి ప్రభుత్వం కేటాయించలేదు. అర్జునరావు మాత్రం నారా లోకేష్‌ పేరుతో సిఫార్సు లేఖను ఇచ్చాడు.  – లక్ష్మి, ఇంతేరు,కృతివెన్ను మండలం

తక్షణం డీఎస్పీతో విచారణ జరిపిస్తాం..
బాధితుల ఫిర్యాదును పరిశీలించి తగిన న్యాయం చేస్తాం. లోతైన దర్యాప్తునకు వెంటనే డీఎస్పీకి బాధ్యతలు అప్పగిస్తాం. సంబంధిత స్టేషన్‌ అధికారుల పనితీరును కూడా పరిశీలిస్తాం.  – ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఎస్పీ

మరిన్ని వార్తలు