దౌర్జన్యమే ‘చినబాబు’ న్యాయం

22 Jun, 2017 08:45 IST|Sakshi
దౌర్జన్యమే ‘చినబాబు’ న్యాయం

కేశినేని ట్రావెల్స్‌ కార్మికులకు తీవ్ర పరాభవం
కలిసేందుకు నిరాకరించిన మంత్రి నారా లోకేశ్‌
తాను వారితో మాట్లాడేదేమిటని వ్యాఖ్య  
జీతాల కోసం వెళ్తే చెయ్యి చేసుకున్న టీడీపీ కార్యకర్తలు


సాక్షి, అమరావతి బ్యూరో: తమకు న్యాయం చేయాలని కోరడానికి వెళ్లిన కేశినేని ట్రావెల్స్‌ కార్మికులను మంత్రి నారా లోకేశ్‌ తీవ్రంగా అవమానించి పంపించేశారు. వారిలో కనీసం మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు. వారితో తాను మాట్లాడేదేమిటని ప్రశ్నించారు. పైగా కార్మికులపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. అంతు చూస్తామని హెచ్చరించారు. విజయవాడలో మంగళవారం కేశినేని ట్రావెల్స్‌ యజమాని, టీడీపీ ఎంపీ కేశినేని నాని కార్యాలయం వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది.

మంత్రికి గోడు వెళ్లబోసుకుందామని..
కేశినేని ట్రావెల్స్‌ను ఎంపీ కేశినేని నాని అర్ధాంతరంగా మూసివేసిన సంగతి తెలిసిందే. అప్పటికే దాదాపు ఏడాదిగా కార్మికులకు జీతాల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపించకుండా సంస్థను మూసివేశారు. దాదాపు 400 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. జీతాల బకాయిలు చెల్లించాలని కార్మికులు ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేకపోయింది. లేఖలు, సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎంపీ కేశినేని నాని స్పందించలేదు. మంత్రి లోకేశ్‌ విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఎంపీ కేశినేని నాని కార్యాలయంలోనే ఈ సమావేశం నిర్వహిస్తారని తెలుసుకున్న కార్మికులు అక్కడికి వెళ్లి, మంత్రి లోకేశ్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకోవాలని భావించారు. పెద్ద సంఖ్యలో కార్మికులు మంగళవారం ఉదయమే ఎంపీ కేశినేని నాని కార్యాలయానికి చేరుకున్నారు.

మళ్లీ వస్తే అంతు చూస్తాం...
మంత్రి లోకేశ్‌ను కలిసేందుకు ప్రయత్నించిన కార్మికులకు తీవ్ర పరాభవం ఎదురైంది. కార్యాలయం గేటు వద్దే పోలీసులు వారిని అడ్డు కున్నారు. ఎంతగా ప్రాధేయపడినా లోపలికి వెళ్లనివ్వలేదు. తమలో కొందరు వెళ్లి వినతిపత్రం ఇచ్చి వస్తామని చెప్పినా వినిపించుకోలేదు. అంతలోనే టీడీపీ కార్యకర్తలకు అక్కడికి చేరుకు న్నారు. కార్మికులను తీవ్రంగా దుర్భాష లాడారు. మరోసారి వస్తే అంతు చూస్తామని హెచ్చరించారు. కొందరు కార్మికులను నెట్టివేశారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై మరింతగా దౌర్జన్యం చేశారు. కొందరిపై చెయ్యి కూడా చేసుకున్నారు. దాంతో తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. కార్మికులు నినాదాలతో ఆ ప్రాంగణం మార్మోగింది.

అదే అదనుగా టీడీపీ కార్యకర్తలు మరింత రెచ్చి పోయారు. అక్కడ ఒక్క క్షణం ఉన్నా సరే ఏం చేస్తామో తెలియదని హెచ్చరించారు. పోలీసులు కార్మికులకు అతికష్టం మీద సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. న్యాయం కోసం మంత్రి లోకేశ్‌ను కలుద్దామని వెళితే తమపై దౌర్జన్యం చేయించారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కేశినేని ట్రావెల్స్‌ కార్మికుల పట్ల మంత్రి వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

మరిన్ని వార్తలు