పోలీసులపై లోకేష్, టీడీపీ ఎమ్మెల్సీల జులుం

17 Mar, 2020 14:35 IST|Sakshi
సీఐ శేషగిరిరావుతో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు లోకేష్‌ తదితరులు

మా ఉద్యోగిని అదుపులోకి తీసుకుంటావా అంటూ దబాయింపు

సాక్షి, మంగళగిరి: మాజీ మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్సీలు మంగళగిరి రూరల్‌ పోలీసులపై జులుం ప్రదర్శించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)పై సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో భాగంగా టీడీపీ కార్యాలయంలో పనిచేసే నాయబ్‌ రసూల్‌ను సోమవారం మంగళగిరి రూరల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్సీలు లోకేష్, అశోక్‌బాబు, రాజేంద్రప్రసాద్, దీపక్‌రెడ్డి హుటాహుటిన మంగళగిరి రూరల్‌ స్టేషన్‌కు చేరుకున్నారు.

‘‘మా కార్యాలయంలో పనిచేసే వారినే అరెస్ట్‌ చేస్తావా? ఎవరు ఇచ్చారు మీకు అధికారం?’’ అంటూ సీఐపై లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఫిర్యాదు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ రెచ్చిపోయారు. సీఐ శేషగిరిరావు మాట్లాడుతూ.. ఆరునెలలుగా తాను ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నానని, ఇప్పటి వరకూ తనకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. సీఐ మాటలను టీడీపీ నేతలు పట్టించుకోలేదు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. చట్టాలు మాకు నేర్పుతావా అంటూ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి రెచ్చిపోయారు. సోషల్‌ మీడియాలో పెట్టింది తప్పు అని చట్టంలో ఎక్కడ రాసి ఉందో చూపాలంటూ చిందులు వేశారు. (చదవండి: ఇంకెన్ని విచిత్రాలు చూడాలో!)

మరిన్ని వార్తలు