ఇదే చివరి అవకాశం

15 Apr, 2014 01:47 IST|Sakshi
ఇదే చివరి అవకాశం

 ఎన్‌టీఆర్  విగ్రహానికి పూలమాల వేస్తున్న నారా లోకేష్
 కార్యకర్తలతో నారా లోకేష్
 ఎన్నికల కోడ్ ఉల్లంఘన

 
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ‘ఎన్నికలకు మూడు వారాల సమయం ఉంది..కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలి. ఇదే తెలుగుదేశం పార్టీకి చివరి అవకాశం. ఈ ఎన్నికల్లో గెలవకపోతే పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళుతుంది.

అప్పుడు పార్టీని కాపాడేవారే ఉండరు’ అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం పర్చూరు నియోజకవర్గం మార్టూరులో నిర్వహించిన సమావేశంలో కార్యకర్తలకు క్లాస్ తీసుకున్నారు.పార్టీ కష్టకాలంలో ఉన్నందునే తన తండ్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులకు సీట్లు ఇవ్వడంలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని కార్యకర్తలకు నచ్చజెప్పే ధోరణితో మాట్లాడారు. 

గొంతు నొప్పిగా ఉందంటూ సగం మాటలను మింగేస్తూ మాట్లాడిన ఆయన చంద్రబాబు హైదరాబాద్‌ను తొమ్మిదేళ్లలో అభివృద్ధి చేశాడని, కొత్త రాజధానిని అభివృద్ధి చేయాలంటే మళ్లీ ఆయన అవసరమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. తరువాత ఆయన మార్టూరు, అద్దంకి, ఒంగోలులో ప్రసంగించారు.
 
యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన

నారా లోకేష్ పర్యటనలో రెండు చోట్ల ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. పర్చూరు నియోజకవర్గం మార్టూరు మండలంలోని ఇసుకదర్శి చేరుకున్న లోకేష్, అక్కడ ఉన్న ఎన్‌టీఆర్ విగ్రహానికి కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో విగ్రహానికి ముసుగు వేయాల్సి ఉండగా దాన్ని ఉల్లంఘించారు.
 
ఎన్‌టీఆర్ విగ్రహం ముందు పర్చూరు నియోజకవర్గ అభ్యర్థి ఏలూరి సాంబశివరావుకు బీ ఫారం   అందజేశారు. అక్కడ నుంచి ఏలూరి సాంబశివరావు స్వగ్రామం కోణంకి చేరుకుని, అక్కడ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు పూలమాల వేశారు. దీంతోపాటు పనిలోపనిగా పక్కనే ఉన్న ఎన్‌టీఆర్ విగ్రహానికి కూడా పూలమాల వేశారు. అక్కడ పోలీసులున్నా, ఎన్నికల కోడ్‌పై అభ్యంతరం వ్యక్తం చేయలేదు.

మరిన్ని వార్తలు