పోటెత్తిన పేట

17 Dec, 2018 07:36 IST|Sakshi
జగన్‌తో కలిసి నడుస్తున్న ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, రెడ్డి శాంతి, దువ్వాడ శ్రీనివాస్‌

నరసన్నపేటలో అడుగడుగునా జన నీరాజనం

పోటెత్తిన జనంతో బహిరంగ సభ విజయవంతం

చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలపై జగన్‌ ధ్వజం

అధికారంలోకి వచ్చిన వెంటనే     వంశధార పూర్తిపై హామీ  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పేట పులకించిపోయింది. మునుపెన్నడూ చూడని రీతిలో హాజరైన జనంతో ప్రజా సంకల్ప యాత్ర సత్తా అందరికీ తెలిసింది. రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర, బహిరంగ సభ సందర్భంగా ఆదివారం నరసన్నపేట పోటెత్తింది. ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వ వైఖరిపై జగన్‌ ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు తీరును ప్రజల నోట చెప్పిస్తూ మరోవైపు ప్రభుత్వ అవినీతిని, అక్రమాలను ఎండగట్టారు. జగన్‌ ప్రసంగం ఆద్యంతం జనాన్ని ఆకట్టుకుంది. వెనకబడిన శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధిలో ముందు వరుసలో నిలబెట్టేలా చేసిన ఘనత వైఎస్‌ఆర్‌దే అని గుర్తుచేశారు.

అంతకుముందు పాదయాత్రగా వచ్చిన జగన్‌కు దారిపొడవునా నీరాజనం పలికారు. సమస్యలను చెప్పుకున్న బాధితులను జగన్‌ ఓదార్చి పరిష్కారానికి భరోసా కల్పించారు. ఆదివారం ఉదయం దేవాది నుంచి యాత్ర ప్రారంభించారు. కోమర్తి, గుండువిల్లిపేట, సత్యవరం క్రాస్‌ మీదుగా మధ్యాహ్నానికి నరసన్నపేటకు చేరుకున్నారు. సాయంత్రం 3 గంటలకు బహిరంగ సభ తర్వాత సాయంత్రం 6 గంటలకు జమ్ము వరకు పాదయాత్రగా వెళ్లి అక్కడే రాత్రి బస చేశారు. 

చంద్రబాబును ఊసరవెల్లితో పోల్చుతూ...
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అరాజకీయాలను జగన్‌ తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలను, రాష్ట్రాన్ని విడిచిపెట్టి, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల కోసం తిరుగుతున్నారని, వదిలేస్తే అంతరిక్ష రాజకీయాలు కూడా చేస్తారని ఎద్దేవా చేయడంతో జనాల్లో మంచి స్పందన వచ్చింది. పూటకో మాట, గంటకో పార్టీ జెండాలతో ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని ఘాటుగా విమర్శించడంతో జనాలంతా చప్పట్లు కొట్టి మద్దతు పలికారు.

వంశధార ప్రాజెక్టులో చంద్రబాబు బినామీ సీఎం రమేష్‌కు చెందిన కంపెనీకి కాంట్రాక్టులు ఇవ్వడం, అలాగే పోలవరం ప్రాజెక్టులో సబ్‌లీజులను రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి బంధువుకే ఇచ్చి అక్రమాలకు పోటీ పడుతున్నారని చెప్పడంతో చర్చనీయాంశమైంది. ఇలాంటి అడ్డగోలు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో కలవడంతో ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని చెబుతూ ఆసక్తికర ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ప్రజలంతా చంద్రబాబు మోసాలను గమనించి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను జగన్‌ కోరారు.

హామీల వరాలపై హర్షం
రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టును సుమారు రూ.900 కోట్లు వరకు నిధులు ఇచ్చి, దాదాపుగా రూ.700 కోట్ల మేరకు పనులు కూడా పూర్తి చేసిన ఘనత వైఎస్‌దే అని జగన్‌ గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం వంశధారను పక్కన పెట్టిందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే వం«శధార ప్రాజెక్టును పూర్తి చేస్తామని జగన్‌ ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే కులాల కార్పొరేషన్లను ప్రక్షాళన చేసి, ప్రతి కులానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో యావత్తు జనమంతా హర్షధ్వానాలతో హోరెత్తించారు. అలాగే నవరత్నాల అమలును పటిష్టంగా చేపడతామని, ఈ సందర్భంగా ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం కోసం వివరించారు. 45 ఏళ్ల వయసు మించిన ప్రతి అక్కచెల్లెమ్మలకు నాలుగు దఫాలుగా రూ.75 వేలు ఉచితంగా ఇస్తామని ప్రకటించడంతో మహిళలంతా ఆనందం వ్యక్తం చేశారు.

హాజరైన ప్రముఖులు
ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా నరసన్నపేట నియోజకవర్గంలో జరిగిన పాదయాత్ర, బహిరంగ సభల్లో రాష్ట్ర, జిల్లా పార్టీ ముఖ్యులు పాల్గొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రీజనల్‌ కోఆర్డినేటర్‌ భూమన కరుణాకరరెడ్డి, రీజనల్‌ కోఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు తలశిల రఘురాం, రెడ్డి శాంతి, శ్రీకాకుళం పార్లమెంట్‌ జిల్లా అ«ధ్యక్షుడు తమ్మినేని సీతారాం, రాజాం, పాలకొండ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, విశ్వాసరాయి కళావతి, శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా, సిఈసి సభ్యుడు అంధవరపు సూరిబాబు, జిల్లా పరిషత్‌ ఫ్లోర్‌ లీడర్‌ ధర్మాన పద్మప్రియ, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్తలు సీదిరి అప్పలరాజు, పేరాడ తిలక్, గొర్లె కిరణ్, పార్టీ నేతలు నర్తు రామారావు, ఎన్ని ధనుంజయ, చింతాడ మంజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు