వైద్యుడిపై పోలీస్‌ ఆఫీసర్‌ దాడి..!

23 Mar, 2019 08:49 IST|Sakshi
సీఐ దాడిలో గాయపడిన డాక్టర్‌ జయభారత్‌రెడ్డిని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి   

వీధి రౌడీలా ప్రవర్తించిన నరసరావుపేట పోలీసు అధికారి 

అసభ్య పదజాలంతో దూషించి కారు అద్దం ధ్వంసం 

దాడిలో డాక్టర్‌ జయభారత్‌రెడ్డికి గాయాలు 

ఈసీకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి 

సాక్షి, నరసరావుపేట రూరల్‌ : ఎన్నికల సమయంలో పోలీసులు ఒంటెద్దు పోకడలకు పోతున్నారు. ఎంతో హుందాగా ఉండాల్సిన వీరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేట టూటౌన్‌ సీఐ ఆదినారాయణ.. అత్యవసర చికిత్స అందించేందుకు ఆస్పత్రికి వెళ్తున్న వైద్యునిపై అకారణంగా దాడికి పాల్పడి వీధి రౌడీలాగా వ్యవహరించాడు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలో టీడీపీ, జనసేన అభ్యర్థులు శుక్రవారం నామినేషన్ల ర్యాలీలు నిర్వహించారు. టీడీపీ ర్యాలీ ఆర్డీవో కార్యాలయానికి బయలుదేరింది. ఇదే సమయంలో స్థానిక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి చెందిన సుస్మిత ఆర్థో ట్రామాకేర్‌ సెంటర్‌లో రోగికి చికిత్స అందించేందుకు డాక్టర్‌ జయభారత్‌రెడ్డి తన కారులో అక్కడికి చేరుకున్నారు.

కారు ఆసుపత్రిలోకి వెళ్లే సమయంలో ర్యాలీ రావడంతో అక్కడే విధుల్లో ఉన్న టూటౌన్‌ సీఐ ఆదినారాయణ ఆగ్రహంతో ఊగిపోతూ చేతిలో ఉన్న వాకీటాకీతో కారు అద్దంపై గట్టిగా కొట్టాడు. అంతటితో ఆగకుండా.. డ్రైవింగ్‌ సీటులో ఉన్న డాక్టర్‌ జయభారత్‌రెడ్డిని కారు నుంచి బలవంతంగా చొక్కా పట్టుకుని కిందకు లాగి భౌతికదాడికి పాల్పడ్డాడు. దీంతో జయభారత్‌రెడ్డి తాను డాక్టర్‌నని, రోగికి అత్యవసర చికిత్స అందించేందుకు వెళ్తున్నానని ఎంత చెప్పినా వినకుండా దౌర్జన్యానికి పాల్పడ్డాడు. డాక్టర్‌ను గుర్తించిన స్థానికులు.. సీఐకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా వారిపైనా దురుసుగా ప్రవర్తించాడు.

కాగా, సంఘటనలో కారు అద్దం దెబ్బతినగా, డాక్టర్‌ జయభారత్‌రెడ్డి ఒంటిపై గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆసుపత్రికి చేరుకుని జయభారత్‌రెడ్డిని పరామర్శించి దాడిని తీవ్రంగా ఖండించారు. అనంతరం ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సీఐ దాడిని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కూడా తీవ్రంగా ఖండించింది. డాక్టర్‌ విధులకు ఆటంకం కలిగించిన సీఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఐఎంఏ పట్టణ శాఖ అధ్యక్షుడు డా.ఏఏవీ రామలింగారెడ్డి డిమాండ్‌ చేశారు. దాడికి పాల్పడిన సీఐ ఆదినారాయణపై జయభారత్‌రెడ్డి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  

మరిన్ని వార్తలు