నరసింహ.. ఓ మంచి అధికారి

11 Nov, 2014 01:10 IST|Sakshi
నరసింహ.. ఓ మంచి అధికారి

నేను, నా కుటుంబం బాగుంటే చాలని అనుకుంటూ చాలామంది గిరి గీసుకుని బతికేస్తూంటారు. కానీ, దానికి భిన్నంగా సాటి మనిషి కష్టాలు తెలుసుకొని, చలించి, తోచిన సహాయం చేస్తున్నవారు కూడా అక్కడక్కడ ఉంటారు. అటువంటి కోవకు చెందిన అధికారి నరసింహ. జైళ్ల అధికారిగా సేవాపథంలో ముందుకు సాగుతూ, ఖైదీల అభిమానాన్ని చూరగొంటున్నారు.
 
* ఖైదీల పిల్లల చదువులకు ఆర్థిక సహాయం అందిస్తున్న కోస్తా రీజియన్ జైళ్ల డీఐజీ
* వారి కుటుంబాలకూ తోచిన సాయం చేస్తున్న వైనం

 కోటగుమ్మం (రాజమండ్రి): ఖైదీలు కూడా మనుషులేనని.. క్షణికావేశంలో తప్పులు చేసి, జైలుపాలైన వారికి కూడా కుటుంబం ఉంటుందని.. యజమాని ఖైదులో ఉంటే అతడి కుటుంబం మొత్తం కష్టాలపాలవుతుందని.. వారిని ఆదుకోవాలని చెబుతారు కోస్తా రీజియన్ జైళ్ల శాఖ డీఐజీ ఎ.నరసింహ. కేవలం ఆ మాటలు చెప్పడంతో ఆయన ఆగరు. స్వయంగా ఆ కుటుంబాలకు తోచిన సహాయం చేస్తూంటారు. ఫలితంగా ఖైదీలతో ‘మంచి అధికారి’గా ప్రశంసలు అందుకుంటున్నారు. కోస్తా రీజియన్ జైళ్ల అధికారిగా మూడేళ్ల కిందట బాధ్యతలు స్వీకరించిన ఆయన.. జైళ్లను సంస్కరణాలయాలుగా మార్చారు. విశాఖ, రాజమండ్రిల్లోని సెంట్రల్ జైళ్లు; విజయవాడ, గుంటూరు, ఏలూరు, శ్రీకాకుళంలలోని జిల్లా జైళ్లు; కాకినాడ, భీమవరం, నర్సరావుపేట, మచిలీపట్నం, గురజాలల్లోని సబ్ జైళ్లతోపాటు 35 మినీ సబ్ జైళ్లు ఆయన పరిధిలో ఉన్నాయి.
 
ఇదీ ప్రస్థానం..
నల్గొండ జిల్లా చౌటుప్పల్ గ్రామానికి చెందిన నరసింహ దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టారు. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. చిన్నచిన్న పనులు చేసుకుంటూ, ట్యూషన్లు చెప్పుకుంటూ నరసింహ విద్యాభ్యాసం పూర్తి చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో ఎంఏ, బీఈడీ చదివి, కొద్దికాలం పార్ట్‌టైమ్ లెక్చరర్‌గా పని చేశారు. 1990లో గ్రూప్-1లో ఎంపికై జైళ్ల శాఖలో వివిధ హోదాల్లో పని చేశారు. వరంగల్, విశాఖ, కడప, విజయవాడల్లో పని చేసి, పదోన్నతిపై కోస్తా రీజియన్ జైళ్ల శాఖ డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు.
 
తాను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని..
బాల్యంలోను, చదువుకునే రోజుల్లోను తాను పడిన కష్టాలు మరొకరు పడకూడదని నరసింహ భావిస్తారు. ఈ ఆలోచనతోనే ఏ ఆధారమూ లేని ఖైదీల పిల్లల చదువులకు తోచిన సహాయం చేస్తున్నారు. స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం, ఉన్నత చదువుల కోసం ఫీజులు కట్టడం, ఖైదీల పిల్లల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం తదితర రూపాల్లో ఆయన సహాయపడతారు. ప్రాథమిక విద్య చదువుతున్న ఖైదీల పిల్లలు సుమారు 50 మందికి స్కాలర్‌షిప్పులు ఇస్తున్నారు. ఉన్నత విద్య చదువుతున్న 20 మంది విద్యార్థులకు ప్రైవేటు కళాశాలలో హాస్టల్ వసతి కల్పించి, ఫీజులు కట్టి మరీ చదివిస్తున్నారు.

ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకూ సుమారు 500 మంది విద్యార్థులను ఈ విధంగా చదివించారు. దీనికోసం ఏటా తన ఆదాయంలో సుమారు లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నారు.కృష్ణా జిల్లా కోడూరు మండలం నరసింహపురానికి చెందిన గుంటూరు సోమేశ్వరరావు ఒక హత్య కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అతడి కుమారుడు గుంటూరు గోపీచంద్ టెన్‌‌తలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు.

తండ్రి జైలులో ఉండడంతో పై చదువులు చదివించే స్తోమత లేక అతడు సతమతమవుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న డీఐజీ విజయవాడ ఆంధ్రా లయోలా కళాశాలలో గోపీచంద్‌ను చదివించేందుకు ఆర్థిక సహాయం అందించారు. ఐఏఎస్ చదివేవరకూ హాస్టల్ విద్యాభ్యాసానికి అవసరమైన సహాయం చేస్తానని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. పెద్దాపురానికి చెందిన మోకమాటి సత్యనారాయణ అనే జీవిత ఖైదీ కుమార్తె వివాహానికి రూ.30 వేల వరకూ ఆర్థిక సహాయం చేసి, ఆ పెళ్లి జరిగేందుకు కృషి చేశారు.
 
ఏటా ఉత్తమ ఖైదీలకు పురస్కారాలు
ఏటా అక్టోబర్ 2న ఖైదీల సంక్షేమ దినోత్సవం నిర్వహించి సత్ప్రవర్తనతో మెలిగే ఖైదీలకు కలెక్టర్ చేతుల మీదుగా నగదు పురస్కారాలు అందజేస్తారు. తద్వారా ఖైదీల్లో మంచి ప్రవర్తన నెలకొల్పేందుకు కృషి చేస్తున్నారు.
 
విద్యా ప్రదాత
జైలులో ఉన్న నాకు, నా కుటుంబానికి నా కుమారుడిని చదివించే స్తోమత లేదు. ఖైదీల ద్వారా ఈ విషయం తెలుసుకున్న డీఐసీ నరసింహ నా కుమారుడికి కాలేజీ, హాస్టల్ ఫీజులు చెల్లించి చదివిస్తున్నారు. ఆయనకు రుణపడి ఉంటా.             - గుంటూరు సోమేశ్వరరావు, జీవిత ఖైదీ

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు