కరువు భత్యానికి ఆమోదం

8 May, 2014 00:02 IST|Sakshi

 డీఏ ఇచ్చిన తొలి గవర్నర్‌గా నరసింహన్ రికార్డు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు శుభవార్త. వారు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కరువు భత్యం (డీఏ) చెల్లింపునకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ బుధవారం ఆమోదముద్ర వేశారు. అయితే ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని నిర్ణయాన్ని అమలు చేయాలని సూచించారు. కేంద్రం రెండు నెలల క్రితమే డీఏ ప్రకటించడం తెలిసిందే. జనవరి నుంచి జూన్ వరకు వర్తించే ఈ డీఏ చెల్లింపునకు ఆర్థిక శాఖ మొదట మోకాలడ్డినా, విభజన నేపథ్యంలో వేతనాలను వారం ముందుగానే చెల్లిస్తున్నందున డీఏను కూడా చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడం తెలిసిందే. ఆ తర్వాత ‘డీఏపై దయ తలుస్తారా?’ శీర్షికన బుధవారం సాక్షిలో వచ్చిన వార్తను కూడా గవర్నర్ తెలుసుకున్నారు. ఆర్థిక శాఖ నుంచి వచ్చిన డీఏ ఫైలును పరిశీలించి ఆమోదముద్ర వేశారు. ఉద్యోగులకు డీఏ మంజూరు చేసిన తొలి గవర్నర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. గవర్నర్ నుంచి ఆమోదముద్ర లభించడంతో ఉద్యోగులకు 8.56 శాతం డీఏ మంజూరైంది. దీనివల్ల ఖజానాపై నెలకు రూ.193 కోట్ల భారం పడనుంది. గవర్నర్ ఆమోదించిన ఫైలును ఆర్థిక శాఖ అధికారులు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు పంపించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగిసినందున డీఏ పెంపును ఆయన కూడా నేడో రేపో అనుమతిస్తారని సమాచారం. ఆ వెంటనే డీఏ పెంపు ఉత్తర్వులు వెలువడతాయి.
 
 పెన్షన్‌దారుల హర్షం
 
 రాష్ట్రంలోని 10 లక్షల మంది పెన్షనర్లకు గవర్నర్ డీఏ మంజూరు చేయడం పట్ల పెన్షన్‌దారుల చర్చా వేదిక అధ్యక్షుడు ఈదర వీరయ్య హర్షం వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో వారికిది ఊరట కల్పిస్తుందన్నారు.
 

>
మరిన్ని వార్తలు