చై.. నా... గిమ్మిక్కులు చానా!

22 Feb, 2020 07:45 IST|Sakshi
ప్రాక్టికల్స్‌ పరీక్షలు జరుగుతున్న దృశ్యం

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌లోమాయాజాలం

ఎక్స్‌టర్నల్‌ అధికారులకు కాసుల వల

30కి 30 మార్కుల కోసం చక్రం తిప్పిన చైతన్య,నారాయణ కళాశాలలు

టాస్క్‌ఫోర్స్‌ కమిటీ తనిఖీల్లో వెలుగులోకి అక్రమాలు

ఎక్స్‌టర్నల్‌ అధికారులపై వేటుకు రంగం సిద్ధం  

ఇంటర్‌లో ప్రభంజనం.. స్టేట్‌ టాపర్‌ మా కళాశాల విద్యార్థే.. అంటూ రిజల్ట్‌ రోజున చెవులు చిల్లులు పడేలా టీవీల్లో నిమిషానికోసారి ప్రచారం చేసే కార్పొరేట్‌ కళాశాలల డొల్లతనం తేలిపోయింది. మనీతో మార్కులు సాధించిన తీరు బట్టబయలైంది. ప్రాక్టికల్స్‌లో కార్పొరేట్‌ కళాశాలలు చేసే గిమ్మిక్కులను టాస్క్‌ఫోర్స్‌ కమిటీ పట్టేసింది. 30కి 30 మార్కులు సాధించిన విద్యార్థుల పేపర్లను పునర్‌ మూల్యాకనం చేసి బోగస్‌ మార్కులకు చెక్‌పెట్టింది. కాసులకు కక్కుర్తి పడిన ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్‌ల లెక్కలు కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ పరిణామంతో అందరిలో టెన్షన్‌ మొదలైంది.

అనంతపురం విద్య: ఇంటర్‌ మార్కుల వెయిటేజీతో ర్యాంకులు తారుమారవుతాయి. అందుకే విద్యార్థి గణనీయమైన మార్కులు సాధించేలా కళాశాలలు ప్రణాళిక సిద్ధం చేస్తాయి. ఈ క్రమంలో కొన్ని కళాశాలలు అడ్డదారులు తొక్కుతున్నాయి. ప్రాక్టికల్స్‌లో గంపగుత్తగా మార్కులు కొట్టేసేందుకు మనీతో మాయ చేస్తున్నాయి. ఈ సారి కూడా కార్పొరేట్‌ కళాశాలలన్నీ ఏకమయ్యాయి. తమ కళాశాలల విద్యార్థులకు మంచి మార్కులు తెప్పించుకునేందుకు డబ్బు కుమ్మరించాయి. ఏకంగా ఎక్స్‌టర్నల్‌ అధికారులను కొనేసి  మార్కులు వేయించాయి. అయితే ప్రాక్టికల్స్‌పై కన్నేసిన రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ కమిటీని రంగంలోకి దించింది. దీంతో కార్పొరేట్‌ ఖరత్నాక్‌ కథలన్నీ ఒక్కొక్కటిగా వెలుగుచూశాయి. కాసులకు ఆశపడిన అధికారులపై వేటు రంగం సిద్ధమవుతోంది.

టార్గెట్‌ 30కి 30  
ఇంటర్‌లో జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ సబ్జెక్టుల్లో ప్రతి సబ్జెక్టుకు 30 మార్కులకు ప్రాక్టికల్స్‌ ఉంటాయి. ఇంటర్‌ స్కోర్‌ బాగా ఉండాలంటే తప్పకుండా ప్రాక్టికల్స్‌లోనూ మంచి మార్కులు రావాల్సి ఉంటుంది. అందుకే కార్పొరేట్‌ కళాశాలలు తమ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌లో వీలైనన్ని మార్కులు తెప్పించుకునేందుకు కృషి చేస్తాయి. జిల్లా వ్యాప్తంగా 62 పరీక్ష కేంద్రాల్లో ఫిబ్రవరి 4 నుంచి 19 వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించగా... 14వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే ప్రాక్టికల్స్‌పై ఎప్పటినుంచో పథకం రచించిన జిల్లాలోని పలు కార్పొరేట్‌ కళాశాలలు.. అందులోనూ నారాయణ, చైతన్య జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు తమదైన శైలిలో చక్రం తిప్పాయి. దీంతో చాలా మందికి 30కి 30 మార్కులు వచ్చాయి.

షరా మామూలేనని భావించి...
ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ప్రాక్టికల్స్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించింది. సీసీ కెమెరాలతో ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తూ జంబ్లింగ్‌ విధానాన్ని అనుసరించి పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించింది. దీంతో ఇంటర్‌బోర్డు అధికారులు కూడా రోజూ పరీక్ష ముగిసిన వెంటనే వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించి ఆర్‌ఐఓలతో సమీక్ష నిర్వహించారు. అయితే కార్పొరేట్‌ కళాశాల యాజమాన్యాలు మాత్రం షరా మామూలేనన్న రీతిలో వ్యవహరించాయి. ఎప్పటిలాగే ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్లను పెద్దమొత్తంలో నగదు ముట్టజెప్పి ‘మార్కులు’ కొనుగోలు చేసేశారు. టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను నియామకాన్ని గోప్యంగా ఉంచిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రాక్టికల్స్‌ ముగిసే రోజున రంగంలోకి దింపింది. దీంతో కార్పొరేట్‌ కళాశాల బాగోతం బట్టబయలైంది. 

ప్రభుత్వ కళాశాలల విద్యార్థులపై వివక్ష
ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులపై ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్‌లు వివక్ష చూపారు. ప్రతిభ కనబరిచినప్పటికీ మామూళ్లు ఇవ్వలేదనే కారణంతో వారికి ఇవ్వాల్సి మార్కులు కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. కార్పొరేట్‌ కళాశాల విద్యార్థులకు వచ్చిన మార్కులు, ప్రతిభ ప్రదర్శించినప్పటికీ ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు వచ్చిన మార్కుల్లో భారీ వ్యత్యాసం ఉండడంతో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులు చర్యలకు ఉపక్రమించారు. అధికంగా వేసిన మార్కుల్లో కోత విధించి.. మార్కులు ఎన్ని రావాల్సి ఉందో.. అన్నే మార్కులు వేశారు.

రంగంలోకి టాస్క్‌ఫోర్క్‌
ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ మార్కులను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం.. వెంటనే టాస్క్‌ఫోర్స్‌ కమిటీని రంగంలోకి దింపింది. 30కి 30 మార్కులు వచ్చిన ప్రతి పేపర్‌ను పరిశీలించి పునర్‌ మూల్యాంకనం(రీవాల్యుయేషన్‌ ) చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో 16 మందితో కూడిన నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. జిల్లాలోని నారాయణ, చైతన్యతో పాటు ఇతర కార్పొరేట్‌ కళాశాలల విద్యార్థుల మార్కులను పరిశీలించాయి. నారాయణ కళాశాలలో చదివిన ఒక విద్యార్థికి కెమిస్ట్రీలో 30 మార్కులు వచ్చాయి. టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులు పునఃపరిశీలన చేస్తే 10 మార్కులు కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. దీంతో కమిటీ సభ్యులు నివ్వెరపోయారు.

ఎక్కువ మార్కులు వేశారు
ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్లు ప్రాక్టికల్స్‌లో విద్యార్థి చేసిన దానికంటే అదనంగా మార్కులు వేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు గుర్తించాయి. ఇందుకు కారణాలను ఆరా తీశారు. ముఖ్యంగా 30కి 30 మార్కులు వచ్చిన జవాబుపత్రాలను పునర్‌మూల్యాంకనం చేశారు.– వెంకటరమణ నాయక్,ఆర్‌ఐఓ, అనంతపురం 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు