పేదలకు దూరం చేయడానికే

5 May, 2020 03:29 IST|Sakshi

మద్య నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు

డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి

నకిలీ మద్యం, సారా తయారీలో పట్టుబడుతోంది టీడీపీవారేనని వెల్లడి

వెదురుకుప్పం(చిత్తూరు జిల్లా): మద్య నిషేధంలో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగేసిందని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కళత్తూరు నారాయణస్వామి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధర పెంచి, పేదలకు మద్యం దూరం చేయాలనే ఆలోచనతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రభుత్వానికి రాబడి తగ్గిందనే ఉద్దేశంతో కాదని స్పష్టం చేశారు. ధరలు పెంచడం ద్వారా విక్రయాలు తగ్గించి, ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు కానుకగా మద్య నిషేధం అమలు చేసి ఇవ్వనున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించి, పరిష్కరిస్తుంటే, ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు. మద్యం లేదనేది టీడీపీ వాళ్లే.. మద్యం విక్రయాలు ఆపడంతో సారా తయారు చేస్తున్నారనేది కూడా వారేనని ఎద్దేవా చేశారు. 80 శాతం బార్లు టీడీపీ హయాంలో వారికి అనుకూలమైనోళ్లకే అప్పజెప్పారని తెలిపారు. రాష్ట్రంలో సారా, నకిలీ మద్యం తయారీలో పట్టుబడింది టీడీపీ నేతలు, మద్దతుదారులేనన్నారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తుంటే ఏదోరకంగా బురదజల్లి ప్రతిపక్ష నేత చంద్రబాబు పబ్బం గడుపుకుంటున్నారన్నారు. 

దశలవారీ నిషేధమే సర్కారు లక్ష్యం: లక్ష్మణరెడ్డి
సత్తెనపల్లి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ దృఢ సంకల్పమైన దశలవారీ మద్యనిషేధం అమలును ఎవరూ నీరుగార్చవద్దని మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్‌ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి విజ్ఞప్తి చేశారు. దశలవారీ మద్యపాన నిషేధమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో సంపూర్ణ మద్య నిషేధం అసాధ్యమని, నియంత్రించడమే మేలని సీపీఐ, సీపీఎం పేర్కొన్నాయని, ప్రస్తుతం ఇప్పటికిప్పుడు అమలు చేయాలనడం హాస్యాస్పదమన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర, నవరత్నాలు, ఎన్నికల మేనిఫెస్టోల్లో పేర్కొన్నట్లుగా దశల వారీ మద్య నిషేధాన్ని నిక్కచ్చిగా అమలు చేస్తున్నారన్నారు. మద్యం దుకాణాలు ఏటా 20 శాతం తగ్గిస్తూ, మద్యం విక్రయ సమయం కుదించినట్టు చెప్పారు. 2024 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో త్రీస్టార్, ఫైవ్‌స్టార్‌ హోటళ్లలోనే మద్యం లభ్యమయ్యే పరిస్థితి ఉంటుందని, మరెక్కడా లభించదని స్పష్టం చేశారు. మద్యం అక్రమాలపై 14500, 180042454868 టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు