నారాయణకు జాక్‌పాట్‌లో మంత్రి పదవి

25 Jan, 2015 01:28 IST|Sakshi
నారాయణకు జాక్‌పాట్‌లో మంత్రి పదవి

 నెల్లూరు(సెంట్రల్): రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణకు జాక్‌పాట్‌లో మంత్రి పదవి వచ్చిందని, అందుకే ఆయనకు ప్రజల కష్టాలు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆయన కుమారుడు లోకేష్‌కు డబ్బు సంచులు ఇచ్చి మంత్రి పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. నగరంలోని వైఎస్సార్‌సీపీ సిటీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అనిల్ మంత్రి నారాయణపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

మంత్రి నారాయణ ఎప్పుడు నెల్లూరుకు వస్తారో.. ఎప్పుడు సమావేశాలు నిర్వహిస్తారో.. అర్థం కావడం లేదన్నారు. ఆయన రాత్రులు మాత్రమే అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారన్నారు. నెల్లూరులో ఇద్దరు ఎమ్మెల్యేలం ప్రజలు సమస్యలపై మాట్లాడుతుంటే మంత్రి ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సిగ్గు చేటన్నారు. తాము చేసే ప్రతి విమర్శకూ కట్టుబడి ఉన్నామని, దానికి సమాధానం చెప్పలేక నోటి కొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. పదవి చేపట్టి ఎనిమిది నెలలు అవుతున్నా అభివృద్ధి పనులకు ఇంత వరకు రూ.లక్ష అయినా ఖర్చు చేశారా అంటూ మంత్రిని ప్రశ్నించారు.

అధికారం చేపట్టిన కొత్తల్లో సీఎం చంద్రబాబుతో కలసి ఒకే వేదికపై నెల్లూరుకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తదితర సదుపాయాలు కల్పిస్తానని డాబు మాటలు చెప్పి ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తకపోవడం దారుణమన్నారు. నెల్లూరులో వీధిలైట్లు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా అధ్వానంగా ఉన్నాయని ప్రజల పక్షాన ప్రశ్నిస్తే వీటికి సమాధానం చెప్పకుండా తమపై ఎదురు దాడికి దిగడం సిగ్గుగా లేదా అంటూ ప్రశ్నించారు. మున్సిపల్ స్కూళ్లలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు అవస్థలు పడుతుంటే మంత్రి ఇవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు.

మంత్రి నెల్లూరు పర్యటనకు వస్తుంటే కనీసం ఎమ్మెల్యేలకు, అధికారులకు తెలియకపోవడం దారుణమన్నారు. మంత్రిగా ఎలా నడుచుకోవాలో నెల రోజుల పాటు శిక్షణ తీసుకుని పనులు చేపట్టాలని మంత్రి నారాయణకు హితవు పలికారు. కార్పొరేషన్‌లో సమావేశాలు నిర్వహిస్తే కనీసం ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వరా..? సమావేశానికి వస్తే ప్రజా సమస్యలపై ఎక్కడ నిలదీస్తారేమో అని భయమా అని ప్రశ్నించారు.

రాష్ర్టంలోని కమిషనర్లు ఇటీవల ఒంగోల్లో సమావేశం ఏర్పాటు చేసి పురపాలక శాఖ మంత్రి ఆగడాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయని, సమయపాలన లేకుండా రోజూ సమావేశాలు ఏమిటని కమిషనర్లు ప్రశ్నించిన ఘన చరిత్ర ఆయనదన్నారు. మంత్రికి, తమకూ మధ్య వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. తాము ప్రశ్నించేది ప్రజల సమస్యలపైనే అని తెలిపారు. సమస్యలను పట్టించుకోకుండా అధికార బలంతో గొంతు నొక్కాలని చూస్తే ఇక్కడ ఎవరూ భయపడేవాళ్లు లేరన్నారు.

ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఇదేవిధంగా మంత్రి వ్యవహరిస్తే జిల్లాలో ఆయన పర్యటనలను అడ్డుకుంటామని హెచ్చరించారు. డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, ఫ్లోర్ లీడర్ రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్లు ఖలీల్‌అహ్మద్, మాధవయ్య, నాగరాజు, డి.రాజశేఖర్, రవిచంద్ర, డి.అశోక్, నాయకులు కె.శ్రీనివాసులు, వి.రంగ, వి.మషేష్, టి.రఘురామిరెడ్డి, వి.శ్రీనివాసులురెడ్డి, జి.సుధీర్‌బాబు, వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్, సత్యకృష్ణ, హరికృష్ణ, హాజీ, మైనార్టీ నాయకులు మునీర్‌సిద్ధిక్ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు