అది విష జ్వరాల గ్రామం..

16 Aug, 2015 14:27 IST|Sakshi

బలిజపేట(విజయనగరం జిల్లా): విజయనగరం జిల్లా బలిజపేట మండలం నారాయణపురం గ్రామంలో ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారు. గత కొద్ది రోజులుగా గ్రామంలో దాదాపు 100మందికి పైగా విషజ్వరాలతో బాధపడుతున్నారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి హెల్త్‌ క్యాంప్ కార్యక్రమాలు చేపట్టక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో చేసేదేంలేక ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించడంతో వారు ప్రజలను దోచుకుంటున్నారు. కాగా, ఇదే గ్రామంలో విషజ్వరాల కారణంగా ఆరోగ్య శాఖ అధికారులు పది రోజుల క్రితం ఒక హెల్త్ క్యాంప్‌ను నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రజల వద్ద నుంచి శాంపిల్స్‌ను సేకరించారు. కాగా, ఇప్పటి వరకు ఆ శాంపిల్స్‌కు సంబంధించిన ఫలితాలను అధికారులు వెలువరించలేదు. అంతేకాకుండా ఇప్పటి వరకు గ్రామంలోని ప్రజలకు ఎలాంటి మందులను కూడా అధికారులు అందించలేదు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మాత్రం మలేరియా, టైపాయిడ్ సోకినట్లుగా వైద్యులు తేల్చారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి వైద్య సేవలు అందించాలని గ్రామస్తులు వాపోతున్నారు.

మరిన్ని వార్తలు