'మద్యం నుంచి దూరం చేయడమే మా లక్ష్యం'

17 Dec, 2019 17:02 IST|Sakshi

సాక్షి, అమరావతి : మద్యంను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎక్సైజ్‌శాఖ మంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. మద్య నిషేదంపై మంగళవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఈ వాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దశలవారీగా మద్య నియంత్రణను అమలు చేస్తున్నామని, ఏడాదికి 20శాతం చొప్పున మద్యం దుకాణాలను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం మద్యంను ఆదాయ వనరుగా చూసిందని, వారి హయాంలో 43వేల బెల్ట్‌ షాప్‌లు ఏర్పాటు అయ్యాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్ర ద్వారా మద్యం వల్ల చితికిపోయిన కుటుంబాల కష్టాలను ప్రత్యక్షంగా చూశారన్నారు. మద్యం వల్ల అవస్తలు పడుతున్న మహిళల బాధలను దగ్గరుండి చూశారని తెలిపారు. అందుకే మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యపానం క్రమంగా తగ్గించేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని వెల్లడించారు.

అందులో భాగంగానే రాష్ట్రంలో బెల్ట్‌ షాపులను లేకుండా చేసిందని, 4380 మద్యం దుకాణాలను 3500లకు తగ్గించిందని పేర్కొన్నారు. అలాగే బార్ల విషయానికి వస్తే 839 ఉన్న బార్ల సంఖ్యను 487కి తగ్గించామని వివరించారు. పర్మిట్‌ రూంలు ఎత్తివేయడంతో పాటు మద్య విక్రయాలను ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు, బార్‌ల సమయాన్ని కూడా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిమితం చేసినట్లు వెల్లడించారు. మద్యం ధరలపై ఎక్సైజ్‌ శాఖ అదనపు రిటైల్‌ పన్నును పెంచినట్లు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలను మద్యం అలవాటు నుంచి క్రమంగా దూరం చేసేందుకు తాము కృషి చేస్తున్నట్లు మంత్రి నారాయణస్వామి తెలిపారు.  

మరిన్ని వార్తలు