నార్లాపూర్‌లో వరి విత్తనం తయారీ

7 Jun, 2014 03:16 IST|Sakshi
  •      రైతుల సమష్టి సాగుతో అరుదైన రికార్డు
  •      పరకాల ఏడీఏ గంగారాం వెల్లడి
  •  పరకాల, న్యూస్‌లైన్ : జిల్లాలోనే తొలిసారిగా పరకాల మండలం నార్లాపూర్‌లో రైతులు వరి విత్తనం తయారు చేశారని పరకాల ఏడీఓ బి.గంగారాం తెలిపారు. శుక్రవారం వ్యవసాయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఓ నాగరాజుతో కలిసి ఆయన మాట్లాడారు. విత్తన తయారీ కోసం ప్రతి ఏటా ఖరీఫ్, రబీలో వ్యవసాయశాఖ నుంచి ‘గ్రామీణ విత్తనోత్పత్తి’ కార్యక్రమం చేపడుతున్నామని, ఇందులో భాగంగా నార్లాపూర్ గ్రామాన్ని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.

    స్థానిక ఆదర్శ రైతు క్లబ్ ఆధ్వర్యంలో 25 ఎకరాల్లో విత్తనాల కోసం వరి సాగును చేపట్టినట్లు చెప్పారు. క్లబ్ కన్వీనర్ చేపూరి సాంబయ్యతోపాటు కొందరు రైతులను ప్రోత్సహించి పంట వేయగా ఇప్పుడు చేతికి వచ్చిందని తెలిపారు. వరి విత్తనాలను పరీక్షకు పంపగా సరైనవేనని రిపోర్టు వచ్చిందని, నార్లాపూర్ ఈ ఘనత సాధించడం జిల్లానే ప్రథమని అన్నారు.

    ఈ విత్తనానికి డబ్ల్యూజీఎల్-32100 ఫౌండేషన్‌గా నామకరణం చేశారని, గ్రామంలో పండిన ఈ విత్తనాలు 1200 ఎకరాలకు సరి పోతుందన్నారు. క్వింటాల్‌కు రూ.2600లుగా ధర నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇప్పటికే హసన్‌పర్తికి 60 బస్తాలు, జనగామకు 100 బస్తాలు విక్రయించినట్లు తెలిపారు.

    రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ యోజన(ఆర్‌కేవీవై) పథకం ద్వారా రూ.4.35 లక్షల మినీ మొబైల్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను 90శాతం సబ్సిడీపై క్లబ్ రైతులకు అందించినట్లు వివరించారు. రైతులు పండించిన వరి విత్తనాలకు బ్యాగులు, లేబులింగ్ అందించి త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకువస్తామని చెప్పారు. విత్తన సాగుకు రైతులను ప్రోత్సహించిన ఏఓ నాగరాజును ఏడీఏ అభినందించారు.
     

మరిన్ని వార్తలు