ఉద్దండుల పట్నం

12 Mar, 2019 15:52 IST|Sakshi

సుదీర్ఘ కాలం మంత్రి పదవులు నిర్వహించిన నర్సీపట్నం ఎమ్మెల్యేలు

ఏజెన్సీ ముఖద్వారంగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు

సాక్షి, నర్సీపట్నం: నర్సీపట్నం నియోజకవర్గం మారుమూలగా ఉన్నా జిల్లాలో ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడ గెలుపొందిన ఎమ్మెల్యేలకు కేబినెట్‌ హోదాతో మంత్రి పదవులు లభించాయి. రాజుల కాలంలో కాంగ్రెస్‌ను ఆదరించిన ఓటర్లు, టీడీపీ ఆవిర్భావం తర్వాత అనేకసార్లు ఆ పార్టీకే పట్టం కట్టారు. ఆంగ్లేయులను ఎదురొడ్డి పోరాడి, వీరమరణం పొందిన అల్లూరి ఉద్యమానికి ఊపిరులూదిన ప్రాంతంగా నర్సీపట్నం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఏజెన్సీ ముఖద్వారంగా పేరుగాంచిన నర్సీపట్నం మారుమూలగా ఉన్నా.. రాష్ట్ర, జిల్లా స్థాయిలో గుర్తింపు పొందింది. ఇక్కణ్ణుంచి ఎన్నికైన సాగి సూర్యనారాయణరాజు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కాసు బ్రహ్మానందరెడ్డి, పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు మంత్రివర్గాల్లో కేబినెట్‌ మంత్రి పదవులను అలంకరించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై  ఎన్టీ రామారావు, చంద్రబాబునాయుడు మంత్రివర్గాల్లో కేబినెట్‌ మంత్రిగా పనిచేశారు.

ఈ విధంగా ఉన్నత పదవులు పొందిన నియోజకవర్గ నాయకులు జిల్లా రాజకీయాలను శాసించే స్థాయిలో పనిచేశారు. తొలి ఎమ్మెల్యేగా సాగి సూర్యనారాయణరాజు చరిత్రలో నిలిచారు. ఇండిపెండెంట్‌గా రుత్తల లత్సాపాత్రుడు, రెడ్డి కాంగ్రెస్‌ తరపున బోళెం గోపాత్రుడు ఎన్నికయ్యారు. పదిహేనేళ్లు అప్రతిహతంగా ప్రాతినిథ్యం వహిస్తున్న టీడీపీని నిలువరిస్తూ 2009లో బోళెం ముత్యాలపాప కాంగ్రెస్‌ తరపున గెలుపొందారు.

అప్పట్లో నాతవరం మండలంలోని 20 గ్రామాలు, నర్సీపట్నం మండలంలోని పది గ్రామాలు, మూడు గ్రామాలు మినహా మాకవరపాలెం మండలం,  పూర్తిస్థాయిలో కోటవురట్ల మండలం నర్సీపట్నం నియోజకవర్గంలో ఉండేవి. 2009 పునర్విభజన తరువాత చింతపల్లి నియోజకవర్గంలో ఉన్న గొలుగొండ మండలం, పూర్తిస్థాయిలో నర్సీపట్నం, నాతవరం, మాకవరపాలెం మండలాలు నర్సీపట్నం నియోజకవర్గంలో కలిశాయి. కోటవురట్ల మండలాన్ని విడదీసి పాయకరావుపేట నియోజకవర్గంలో కలిపారు. 

నర్సీపట్నం అసెంబ్లీకి ఎన్నికైన నేతల వివరాలు

కాలపరిమితి ఎమ్మెల్యే పార్టీ
1955 సాగి సూర్యనారాయణరాజు కాంగ్రెస్‌
1962 రుత్తల లత్సాపాత్రుడు స్వతంత్ర
1967,1972 సాగి సూర్యనారాయణరాజు కాంగ్రెస్‌
1978 బోళెం గోపాత్రుడు రెడ్డి కాంగ్రెస్‌
1983,1985 చింతకాయల అయ్యన్నపాత్రుడు టీడీపీ
1989 సాగి కృష్ణమూర్తిరాజు కాంగ్రెస్‌
1996 వేచలపు శ్రీరామ్మూర్తి టీడీపీ
1999,2004 చింతకాయల అయ్యన్నపాత్రుడు టీడీపీ
2009 బోళెం ముత్యాలపాప కాంగ్రెస్‌
2014 చింతకాయల అయ్యన్నపాత్రుడు టీడీపీ

వెనుకబడిన వర్గం ఓటర్లే ఎక్కువ!

నియోజకవర్గంలో 80 శాతం వెనుకబడిన తరగతులకు చెందిన ఓటర్లే ఉన్నారు.  ఒకప్పుడు తంగేడు రాజుల ఆధిపత్యం ఉండగా, టీడీపీ అధికారంలోకి వచ్చాక వెలమ సామాజిక వర్గం ఆధిపత్యం కొనసాగుతోంది. జనాభాలో అత్యధికంగా వెలమలు ఉండగా, ద్వితీయ స్థానంలో కాపులున్నారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో కాపులున్నప్పటికీ ఇప్పటివరకు అత్యధిక పర్యాయాలు ప్రజాప్రతినిధులుగా వెలమల సామాజిక వర్గ నేతలే ఎన్నికయ్యారు. బీసీలతో పాటు ఇటీవల కాలంలో ఎస్సీ, ఎస్టీ జనాభా కూడా ఈ నియోజకవర్గంలో పెరుగుతూ వస్తోంది. 

జనాభా 2,66,639
పురుషులు 1,31,538
స్త్రీలు 1,35,101
గ్రామీణులు  2,20,101
పట్టణవాసులు 46,538
విస్తీర్ణం 0.9 చదరపు కిలోమీటర్లు
మండలాలు     నర్సీపట్నం, మాకవరపాలెం, నాతవరం, గొలుగొండ
రెవెన్యూ గ్రామాలు  107
పంచాయతీలు  85
మొత్తం గ్రామాలు 283
మొత్తం ఓటర్లు 2,12,028
పురుషులు  98,191
మహిళలు 1,03,020
ఇతరులు 17
పోలింగ్‌ కేంద్రాలు 262

పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా..

బ్రిటీష్‌ పాలనలో జిల్లా కేంద్రమైన విశాఖపట్నం తర్వాత ప్రముఖ పట్టణంగా గుర్తింపు పొందిన నర్సీపట్నం చాన్నాళ్లు గ్రామ పంచాయతీగానే కొనసాగింది. 2012లో మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయిన నర్సీపట్నం రాష్ట్రంలో అతి పురాతన  రెవెన్యూ డివిజన్లలో ఒక్కటిగా గుర్తింపు ఉంది. బ్రిటీష్‌ కాలం నుంచి ఎందరో ప్రముఖులు సబ్‌ కలెక్టర్లు, ఏఎస్పీలుగా ఇక్కడ పనిచేయడంతో నర్సీపట్నానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. యువ ఐఏఎస్, ఐపీఎస్‌లు శిక్షణ అనంతరం తమ తొలి పోస్టింగ్‌ నర్సీపట్నంలో రావాలని కోరుకుంటూ ఉంటారు. 

నర్సీపట్నం కేంద్రంగా..

1922–24 మధ్యకాలంలో ఏజెన్సీలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కొనసాగించిన మన్యం పితూరీ పోరాటాన్ని అణచివేసేందుకు బ్రిటీష్‌ పాలకులు నర్సీపట్నం కేంద్రంగా పోలీస్, సైనిక చర్యలు చేపట్టారు. ప్రస్తుతమున్న ఏఎస్పీ, సబ్‌కలెక్టర్, రెవెన్యూ కార్యాలయ భవనాలు అప్పట్లో బ్రిటీష్‌ పాలకుల నివాస గృహాలు. అల్లూరి సీతారామరాజును కొద్దిరోజుల పాటు నర్సీపట్నంలో గృహ నిర్బంధం చేశారు. రాష్ట్రంలో నర్సీపట్నం పేరు చెప్పగానే నాడు అల్లూరి సాయుధ పోరాటానికి, నేడు మావోయిస్టు కార్యకలాపాలకు కేంద్రంగా గుర్తింపు పొందింది. 

పట్టుతగ్గిన టీడీపీ..

నర్సీపట్నం నియోజకవర్గం రాజకీయ, సినీ, కళా, సాంస్కృతిక, విద్యా రంగాల్లో రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందింది. జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో దాదాపు అర్ధ శతాబ్దం పాటు అనేక పదవులు నిర్వహించిన తంగేడు రాజులు, సుమారు నాలుగు దశాబ్దాల పాటు రాజకీయ జీవితంలో కొనసాగుతున్న చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఐదుసార్లు రాష్ట్ర కేబినేట్‌ మంత్రి పదవులు పొందారు .

దివంగత సీఎం వైఎస్‌ నియోజవకర్గంపై ప్రత్యేక దృష్టిసారించారు. దీనిలో భాగంగా 2004లో బోళెం ముత్యాలపాపను బరిలో దింపడంతో మంత్రి అయ్యన్నపాత్రుడు ఘోర పరాజయం పొందారు. 2014లో మంత్రి అయ్యన్నపాత్రుడు స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. 

మరిన్ని వార్తలు