షార్‌ను సందర్శించిన నాసా చీఫ్ చార్లెస్ బోల్డెన్

7 Apr, 2016 02:58 IST|Sakshi
షార్‌ను సందర్శించిన నాసా చీఫ్ చార్లెస్ బోల్డెన్

శ్రీహరికోట(సూళ్లూరుపేట): అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) చీఫ్ చార్లెస్ బోల్డెన్‌తో పాటు ఆరుగురు సీనియర్ శాస్త్రవేత్తల బృందం బుధవారం షార్‌ను సందర్శించింది. మంగళవారం రాత్రే చెన్నైకి చేరుకున్న ఈ బృందం బుధవారం ఉదయం 10 గంటలకు షార్‌కు చేరుకుంది. షార్ డెరైక్టర్ కున్హికృష్ణన్ వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం కల్పనా అతిథి గృహం కాన్ఫరెన్స్ హాలులో వారికి షార్‌లో చేపట్టిన, చేపట్టబోతున్న ప్రయోగాలు, రాకెట్ లాంచ్ ఫెసిలిటీస్ గురించి క్షుణ్నంగా వివరించారు.  ఆ తర్వాత షార్‌లోని మిషన్ కంట్రోల్ సెంటర్, మల్టీ ఆబ్జెక్టివ్ ట్రాకింగ్ రాడార్ సెంటర్, మొదటి, రెండో ప్రయోగవేదికలు, రాకెట్ అసెంబ్లింగ్ బిల్డింగ్, నిర్మాణంలో ఉన్న రెండో అసెంబ్లింగ్ బిల్డింగ్‌ను వారు సందర్శించారు.

 కాలుష్యంతో భూమికి కూడా అంగారక పరిస్థితి: బోల్డెన్
 భోజన సమయం అనంతరం బ్రహ్మప్రకాష్ హాల్‌లో ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లతో శాస్త్ర సాంకేతికరంగాల్లో ఆధునిక పరిజ్ఞానం గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. రాబోయే కాలంలో వచ్చే మార్పులపై చార్లెస్ బోల్డెన్ ప్రసంగించారు. పురాణాల ప్రకారం అంగారకుడిపై జనసంచారం ఉండేదని, కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోవడంతో ఆగ్రహం ఎడారిగా మారిందని చెప్పారు. అదే పరిస్థితి భవిష్యత్తులో భూమికి కూడా వచ్చే అవకాశం లేకపోలేదని అన్నారు. కాలుష్యం పెరిగి కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోయిన రోజున భూమికి కూడా అంగారక గ్రహం పరిస్థితి వచ్చే అవకాశం లేకపోలేదని చెప్పారు. చార్లెస్ బోల్డెన్‌తో వచ్చిన నాసా సీనియర్ శాస్త్రవేత్తలకు రాకెట్ నమూనా జ్ఞాపికలను అందజేశారు. బెంగళూరు సైంటిఫిక్ కార్యదర్శి వైవీఎన్ కృష్ణమూర్తి, షార్ అసోసియేట్ డెరైక్టర్ టీ సుబ్బారెడ్డి, కంట్రోలర్ జేవీ రాజారెడ్డి, శాస్త్రవేత్తలు రంగనాథన్, పొంగినన్, గ్రూప్ డెరైక్టర్ పీ విజయసారధి, విశ్వనాథశర్మ, షార్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు