నాసి సీడ్ వలలో.. వెనామీ సాగు

20 Feb, 2016 01:07 IST|Sakshi
నాసి సీడ్ వలలో.. వెనామీ సాగు

* పుట్టగొడుగుల్లా వెలస్తున్న అనధికార హేచరీలు
* నాణ్యత లేని రొయ్యపిల్లలకు వైరస్ వ్యాధులు
* పెద్ద ఎత్తున నష్టపోతున్న ఆక్వా రైతులు
* అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వినతి

కాట్రేనికోన: కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ (సీఏఏ) అనుమతులు లేకుండా తీరం వెంబడి పుట్టగొడుగుల్లా వెలసిన వెనామీ హేచరీల్లో ఉత్పత్తవుతున్న నాణ్యత లేని రొయ్య సీడ్ (పిల్లలు) రైతులను దెబ్బ తీస్తోంది.

వెనామీ రొయ్య ధర బాగున్నా సీడును యధేచ్ఛగా ఉత్పత్తి చేస్తున్నారు.రైతులు ఆశించిన స్థాయిలో వెనామీ రొయ్యలు ధరలు ఉన్నప్పటికీ సీడ్ నాసిరకం కావడంతో వైరస్ వ్యాధులు సోకి, నష్టాల పాలవుతున్నారు. చెన్నై కేంద్రంగా పని చేస్తున్న రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వా కల్చర్ పరిధిలో 2016కి సంబంధించి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, ఒడిశా, గుజరాత్, కర్నాటక రాష్ట్రాల్లో 254 వెనామీ హేచరీలకు మాత్రమే సీఏఏ అనుమతి ఉంది. అనుమతి ఉన్న హేచరీలకు వాటి సామర్థ్యాన్ని బట్టి 400 నుంచి 10 వేలకు పైగా వ్యాధిరహిత (ఎస్‌పీఎఫ్) తల్లి రొయ్యలను  సీఏఏయే సరఫరా చేసింది.

రాష్ర్టంలో 189 హే చరీలకు మాత్రమే అనుమతి ఉండగా నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలలో అనధికారిక హేచరీలు విస్తృతంగా ఉన్నాయి. తీరం వెంబడి ఉన్న హేచరీల్లో సగానికి పైగా సీఏఏ అనుమతి లేనివే. జిల్లావ్యాప్తంగా తీరంలో 200లకు పైబడి హేచరీలుండగా 63 హేచరీలకు మాత్రమే సీఏఏ అనుమతులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అమలాపురం పరిసర ప్రాంతాల్లో సుమారు 15 హేచరీలుండగా అల్లవరం మండలంలోని  ఐదింటికే అనుమతి ఉంది.

వెనామీ రొయ్యల పెంపకం చెరువులు, హేచరీలకు సీఏఏతో పాటు సెంటర్ ఫర్ ఆక్వా కల్చర్ అనుమతి తప్పనిసరి.  అనుమతికి సంబంధించి కలెక్టర్ చైర్మన్‌గా ఉండే కమిటీలో మ త్స్యశాఖ డీడీ, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్, వ్యవసాయశాఖ అధికారులు సభ్యులుగా ఉంటా రు. ఈ కమిటీ పరిశీలన అనంతరం సంబంధిత అధికారులు పర్యవేక్షించి నిబంధనల ప్రకారం ఉంటే అనుమతి ఇస్తారు.
 
సీడ్ నాసిదైనా రేటు ఎక్కువే..
మత్స్యశాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 6 వేల హెక్టార్లలో వెనామీ సాగు జరుగుతోంది.అనుమతులు లేకుండా అనధికారికంగా మరొక 4 వేల హెక్టార్లలో సాగు చేస్తున్నట్టు అంచనా. సీఏఏ అనుమతులు లేని హేచరీలతో పాటు అనుమతి ఉన్న హేచరీలు కూడా ఒక అనుమతితో మరికొన్ని ఏర్పాటు చేసి, స్థానికంగా దొరికే తల్లిరొయ్యల తోనే సీడ్‌ను ఉత్పత్తి చేస్తున్నారుు. సీఏఏ అనుమతి ఉండి ,  నిబంధనల ప్రకారం నాణ్యైమైన రొయ్య పిల్లల్ని ఉత్పత్తి చేస్తున్న హేచరీలు పిల్లను 35 పైసల నుంచి 40 పైసల వరకు విక్రయిస్తుంటే అనుమతులు లేని హేచరీలు కూడా అదే ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారుు. అనుమతులు లేని హచరీల్లో నాసిరకం సీడ్ ఉత్పత్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
 
వైరస్ రహిత సీడ్‌ను అందించేలా చూడాలి
 సీఏఏ అనుమతులు లేని హేచరీలు ఉత్పత్తి చేస్తున్న నాణ్యత లేని రొయ్య సీడు ఎదుగుదల లేక, వైరస్ వ్యాధులుతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నాం. వైరస్ రహిత ఎస్‌పీఎఫ్ సీడ్‌నే హేచరీలు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి.
- భూపతిరాజు సుబ్రమణ్యంరాజు(బులిరాజు), రైతు, ఎదుర్లులంక
 
అనుమతి ఉన్న హేచరీల్లోనే సీడ్ తీసుకోవాలి
జిల్లాలో 63 హేచరీలకు మాత్రమే సీఏఏ అనుమతులు ఉండగా 80 హేచరీలకు అనుమతులు లేవు. 20 హేచరీలు నిర్మాణంలో ఉన్నట్టు గుర్తించాం. అనుమతులు లేకుండా సీడ్ ఉత్పత్తి చేయడం నేరం. అనుమతులు లేని హేచరీలు దరఖాస్తు చేసుకోవాలని, పాత హేచరీలు రెగ్యులర్ చేసుకోవాలని నోటీసులు జారీ చేశాం. సీఏఏ అనుమతి ఉన్న హేచరీల నుంచే రైతులు సీడ్ తీసుకోవాలి.  
- టి.కళ్యాణం, మత్స్యశాఖ డిప్యూటీ డెరైక్టర్

మరిన్ని వార్తలు