సులభతర విద్యకు.. రేఖాంశాలెన్నో..

28 Aug, 2018 13:05 IST|Sakshi
సాధించిన పలు అవార్డులతో సుసత్యరేఖ (అంతరచిత్రం) ప్రశంసాపత్రాలు

కష్టమైన చదువును ఇష్టంగా బోధించడమే ఆమె సిద్ధాంతం

ఓటమి ఎరుగని మేటి ఉపాధ్యాయిని సుసత్యరేఖ

నూతన విద్యావిధానం వల్లే ఆమె జాతీయ పురస్కారానికి ఎంపిక

తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం సిటీ: విద్యార్థుల మానసిక పరిస్థితి అంచనా వేయడం, చిన్నారుల దృష్టిని చదువుపైకి మళ్లించి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలనే సంకల్పం, వినూత్న రీతిలో విద్యాబోధన.. ఇలా ఎన్నో అంశాలు ఆమెను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకునేలా చేశాయి. జాతీయ స్థాయిలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగిన ఆదర్శ ఉపాధ్యాయ ఎంపికల్లో మన రాష్ట్రం నుంచి ఏకైక ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకోనున్నారు రాజమహేంద్రవరం నగరానికి చెందిన మేకా సుసత్యరేఖ.

1991 నుంచి రాజమహేంద్రవరంలోని నివేదిత కిశోర్‌ విహార్‌ ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలలో లెక్కలు, ఫిజిక్స్‌ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. విద్యాబోధన వృత్తిలో చేరింది మొదలు నూతన విద్యావిధానాన్ని ఆవిష్కరించాలనే దృక్పథంతో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా ఎన్నో విధానాలు ప్రవేశపెట్టారు. ఆటల ద్వారా అయితే విద్యార్థులకు సులభంగా బోధించవచ్చని గుర్తించిన ఆమె మ్యాథ్స్‌ కబడ్డీ, సైన్స్‌ కబడ్డీ, హిందీ కబడ్డీ, మ్యాథ్స్‌ మారధాన్‌ ఇలా ఆటల రూపంలో బోధన చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసి విద్యార్థుల్లో నూతనోత్తేజాన్ని నింపారు. దీనిని గమనించిన యాజమాన్యం మొత్తం అన్ని పాఠ్యాంశాలకు ఇదే పద్ధతి అలవాటు చేయడంతో ఉత్తమ ఫలితాలు సాధించడం మొదలు పెట్టారు. సుసత్యరేఖ పాఠశాలల పోటీల్లో రాష్ట్ర, జిల్లా ఏ స్థాయి పోటీలకు వెళ్లినా విజయంతోనే తిరిగివచ్చేవారు. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో ఎనిమిది అవార్డులు, రాష్ట్ర స్థాయిలో 50 పైచిలుకు అవార్డులు, జిల్లా, డివిజన్‌ స్థాయిలో లెక్కలేనన్ని అవార్డులు ఆమె సాధించారు.

నాలుగు డివిజన్లలో విద్యాబోధన
విద్యార్థుల్లో విద్యాబోధన సక్రమంగా నిర్వహించేందుకు నాలుగు పద్ధతులు అవలంబిస్తున్నట్టు సుసత్యరేఖ పేర్కొన్నారు. అవి స్కూల్లో క్లాస్‌ వర్క్, విద్యార్థి ప్రవర్తన, ప్రాజెక్ట్‌ వర్క్, జనరల్‌ స్లిప్‌ టెస్ట్‌. వీటి ద్వారా విద్యాబోధన చేస్తుండడం వల్ల విద్యార్థుల్లో గ్రహణశక్తి అధికమవుతుందని ఆమె అంటున్నారు.

ఇన్నర్‌ వీల్‌ జోనల్‌ రిప్రజెంటేటివ్‌గా 17 స్కూళ్లకు సదుపాయాలు కల్పన
ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌కు అధ్యక్షురాలిగా ఆమె పనిశారు. ఆ సమయంలో చేసిన సేవలకు జోనల్‌ రిప్రజెంటేటివ్‌గా నియమించారు. దీని ద్వారా 17 స్కూళ్లకు విద్యాసదుపాయాలు కల్పించగలిగారు. ఇప్పటి వరకూ మూడు డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

4న పీఎంతో సమావేశం.. 5న అవార్డు స్వీకరణ..
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన మేకా సుసత్యరేఖ మాట్లాడుతూ సెప్టెంబర్‌ నాలుగో తేదీన దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో దేశవ్యాప్తంగా అవార్డు పొందిన 45 మంది ఉపాధ్యాయులతో సమావేశం ఉందన్నారు 5వ తేదీ ఉపా«ధ్యాయుల దినోత్సవాన్ని పురష్కరించుకుని విద్యాభవన్‌ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నట్లు తెలిపారు.

అవి మరచిపోలేని మధురానుభూతులు
డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతమూరు గ్రామంలో నిర్వహించిన బడిబాట ప్రారంభోత్సవ కార్యక్రమంలో తాను తయారు చేసిన గాలిపటం వైఎస్‌ ఎగుర వేసి తనను అభినందించిన విధానం తన జీవితంలో మరువలేని అనుభూతిని నింపిందని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌ వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళ్లగా వైఎస్సార్‌ సీపీ అ«ధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎనర్జటైజింగ్‌ టెస్ట్‌ బుక్స్‌(కోర్‌ టెస్ట్‌ బుక్స్‌) గురించి సుమారు గంట పాటు వివరాలు అడిగారని, విద్యావ్యవస్థ«పై ఆయనకున్న ప్రోత్సాహం అర్ధమైందన్నారు.

అందరూ టీచర్లే..
తన కుటుంబంలో సుమారు రెండు డజన్లు మంది టీచర్లు ఉన్నారని, తాత, తల్లి, తండ్రి, భర్త, చిన్నాన్న, మావయ్య, బావ, అక్క, చెల్లి, మరిది, తోటికోడలు ఇలా అందరూ టీచర్లేనని ఆమె తెలిపారు. విద్యాభోదనకు ప్రేరణ, స్ఫూర్తి తనకు తాతయ్య వేగులపాటి వెంకన్న చౌదరి అని, రాష్ట్రంలో  హిందీ భాషకు తొలి టీచర్‌ తాతయ్యేనన్నారు.  

ఉభయ రాష్ట్రాల్లో ఆమెమెథడ్స్‌ అమల్లో ఉన్నాయి
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె రూపొందించిన ‘రేఖా బడి ’ మెథడ్స్‌ ఫాలో అవుతున్నారు. ఆమె తయారు చేసిన యూ ట్యూబ్‌ ఛానల్, బ్లాగ్‌స్పాట్, ఆండ్రాయిడ్‌ యాప్, కంటిన్యూనియస్‌ కాంప్రహెన్సివ్‌ ఎవల్యూషన్‌ రెండు రాష్ట్రాల స్కూళ్లల్లో అమలు చేస్తున్నారు.

పలు అవార్డులు
ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌లో తన పరిశోధనకు రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ స్థాయి అవార్డు, సీఎం సైన్స్‌ సలహాదారుడు సీఎస్‌రావు అవార్డు, రూ.10 వేల నగదు పురస్కారం ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం, గవర్నర్‌ రంగరాజన్‌ చేతుల మీదుగా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ అవార్డులు, ఇంటర్నేషనల్‌ తానా గ్లోబల్‌ సైన్స్‌ ఫేర్‌లో రెండో స్థానం సాధించి ఎఫిలికేటెడ్‌ సైన్స్‌ టీచర్‌ అవార్డు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు, రాష్ట్ర  ఉత్తమ పర్యావరణవేత్తగా గ్రీన్‌ కోర్‌ అవార్డు, నేషనల్‌ చిల్డ్రన్స్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ అవార్డు అంతర్జాతీయ జీవవైవిద్య సదస్సులో బహుమతులు ఇలా పలు అవార్డులు సాధించారు.

మరిన్ని వార్తలు