దండిగా డబ్బు.. అయినా ఏపీలో జబ్బు!

15 Jan, 2015 00:59 IST|Sakshi
దండిగా డబ్బు.. అయినా ఏపీలో జబ్బు!

రాష్ట్రంలో కుంటుబడుతున్న జాతీయ ఆరోగ్య పథకాలు
రోగుల చికిత్స, ఔషధాలు, టీకాలకు రూ. వెయ్యి కోట్లకు పైగా ఇచ్చిన కేంద్రం
కేంద్ర నిధులు దండిగా ఉన్నా ఖర్చుచేయని రాష్ట్రం
రాష్ట్ర వాటా నిధులకూ దిక్కులేని వైనం
ఖర్చు చేయని నిధులు రూ.249 కోట్లు.. మార్చి 31తో వెనక్కి!
సంచార వైద్య యూనిట్లకు రూ.2.58 కోట్లున్నా.. ఒక్క రూపాయీ వెచ్చించని ప్రభుత్వం


సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజారోగ్య పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి బోధనాసుపత్రుల వరకు ఏ ఆస్పత్రిలోనూ రోగులకు సరైన వైద్యం అందడం లేదు. వివిధ ఆరోగ్య పథకాలకుగాను జాతీయ ఆరోగ్య మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఆయా నిధులను సరిగా వినియోగించలేదు. ఫలితంగా ప్రజారోగ్యం మూలనబడుతోంది.

విభజనానంతరం ఏపీలో ప్రభుత్వం ఏర్పాటై 8 నెలలు పూర్తవుతున్నా.. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఏ ఒక్క పథకమూ అమలుకు నోచుకోలేదు. ఈ మిషన్ కింద 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ.1,044 కోట్లు నిధులు అందాయి. దీనిలో 25 శాతం చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా జోడించి మొత్తం 32 కేంద్ర ఆరోగ్య పథకాలను ప్రజలకు చేరువ చేయాల్సి ఉంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం జోడించాల్సిన నిధులు ఇవ్వకపోగా, కేంద్రం ఇచ్చిన నిధులను సకాలంలో(అంటే.. ఈ ఏడాది మార్చి 31నాటికి) ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా దాదాపు రూ.249 కోట్లను కేంద్రం వెనక్కి తీసుకునే పరిస్థితి ఏర్పడింది.

మాతా శిశు సంరక్షణ ‘వధ’
రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ మరణాలను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం.. వాటికి తక్షణమే అడ్డుకట్ట వేయాలని సూచించింది. దీనికిగాను సుమారు రూ.400 కోట్లు కేటాయించింది. అయితే, గడిచిన 9 మాసాల్లో రూ.200 కోట్లను కూడా ప్రభుత్వం ఖర్చు చేయలేదు. ఇప్పటికీ ఏటా 600 మందికి పైగా తల్లులు మరణిస్తుంటే, 35 వేల మందికి పైగా శిశువులు సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వరుసలో.. రాష్ట్రీయ బాల సురక్షా కార్యక్రమం, శిశు ఆరోగ్యం, పల్స్‌పోలియో, ప్రధాన ఆస్పత్రుల బలోపేతం, వైద్యసిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు వంటి పథకాలు రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో కుంటుపడ్డాయి.

డబ్బుండీ.. దరిద్రమే!
# వివిధ జిల్లాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలు నిర్మించాలని రూ.24 కోట్లు కేటాయిస్తే ఇప్పటి వరకూ స్థల సేకరణ కూడా చేయలేదు. దీనివల్ల మారుమూల గ్రామీణ ప్రజలకు వైద్యం గగనంగా మారింది.

# అన్ని ఆస్పత్రుల్లోనూ డయాగ్నొస్టిక్స్(వైద్య పరీక్షలు) ఉచి తంగా చేసేందుకు రూ.60 కోట్లు కేటాయిస్తే ఇప్పటి వర కూ ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఇప్పటికీ అనేక ప్రాం తాల్లో ప్రభుత్వాసుపత్రులకు వెళ్లిన రోగులు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే రక్తపరీక్షలు చేయించుకుంటున్న పరిస్థితి ఉంది.

# ఉచిత మందులకు రూ.60 కోట్లు కేటాయిస్తే.. 90 శాతం ఆస్పత్రుల్లో ఇప్పటికీ చిట్టీలు రాసి.. బయట కొనుగోలు చేయాలని సిఫార్సు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రాణాధార మందులైన కేన్సర్, హీమోఫీలియా వంటి జబ్బులకు సంబంధించిన ఔషధాలను కూడా బయటే కొనుక్కోవాలని రోగులకు సూచిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కనీసం 50 రకాల మందులతో పాటు 17 రకాల రక్తపరీక్షలు జరగాలి. కానీ అలా జరగడం లేదు.

# సంచార వైద్య యూనిట్లను ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది. ఫలితంగా రహదారి ప్రమాదాల్లో గాయపడుతున్న వారికి, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని వారికి వైద్యాన్ని చేరువ చేసి ప్రాణ నష్టాన్ని తగ్గించాలని కేంద్రం భావించింది. దీనికిగాను రూ. 2.58 కోట్లను రాష్ట్రానికి ఇచ్చింది. అయితే, దీనిలో రూ. ఒక్క రూపాయిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదు.

మరిన్ని వార్తలు