ఎక్కడి వారు అక్కడే

30 Mar, 2020 11:36 IST|Sakshi
లాక్‌డౌన్‌తో నిర్మానుష్యంగా మారిన హైదరాబాద్‌–బెంగళూరు జాతీయ రహదారి

లాక్‌డౌన్‌ కట్టుదిట్టం

పల్లె నుంచి పట్టణం వరకు బంద్‌

ఆంక్షలు కఠినతరం చేసిన పోలీసులు

కర్నూలు(హాస్పిటల్‌): కోవిడ్‌ వైరస్‌ కట్టడికి జిల్లా యంత్రాంగం లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తోంది. దీంతో పల్లె నుంచి పట్టణం వరకు ప్రజలు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు.  అక్కడక్కడ కొంత మంది  నిర్లక్ష్యంగా రోడ్లపైకి వస్తున్నా వారిని పోలీసులు తమ కఠిన ఆంక్షలతో వెనక్కి పంపిస్తున్నారు. నిత్యావసరాల కోసం పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రజలను ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అనుమతిస్తున్నారు.  ఆ తర్వాత రహదారులన్నీ నిర్మానుష్యమవుతున్నాయి. మరోపక్క   విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చిన వారిని గుర్తించేందుకు వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశాలు ఇంటింటా సర్వే ముమ్మరం చేశారు.  

రేషన్‌ పంపిణీలో సామాజిక దూరం
 లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెల్లరేషన్‌ కార్డు ఉన్న వారికి  రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం, కందిబ్యాళ్లు ఇస్తోంది. రేషన్‌షాపుల వద్ద కార్డుదారులు ఒకేసారి గుమికూడకుండా సామాజిక దూరం పాటిస్తూ సరుకులు తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

నిబంధనలు అతిక్రమిస్తే కేసులు
లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి భారీగా జరిమానాలు విధిస్తున్నారు.  దీంతో పాటు రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పటిష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి సరిహద్దు దాటి రాకుండా చర్యలు తీసుకున్నారు. 

నేటి నుంచి ఉదయం 11 గంటల వరకే...
మధ్యాహ్నం 1గంట వరకు ఉన్న నిత్యావసర సరుకుల కొనుగోలు సమయాన్ని కుదించారు. సోమవారం నుంచి ఉదయం 6 గంటల నుంచి  11 గంటల వరకు మాత్రమే అనుమతించనున్నారు. అత్యవసర మందుల కొనుగోలుకు సాయంత్రం 6 గంటల వరకు అనుమతిస్తారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేస్తుండటంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు