ప్రజాధనం రోడ్డు పాలు

6 Jun, 2019 12:07 IST|Sakshi
హైవే నుంచి మామిడిపాలెం వరకు ఇదే పరిస్థితి

రూ.కోటికి పైగా వ్యయంతో 4.5 కి.మీ. రోడ్డు నిర్మాణం

నాణ్యతకు తిలోదకాలిచ్చిన కాంట్రాక్టర్లు

కొద్ది రోజులకే బయటపడిన డొల్లతనం..

దారి పొడవునా నిర్లక్ష్యపు పగుళ్లు

అవస్థలు పడుతున్న వాహనదారులు

వర్షాకాలం వస్తే రోడ్డు గల్లంతే..

ఎన్నికల రోడ్డేనంటున్న విమర్శకులు

ఒంగోలు సిటీ:ఒంగోలు నగర శివారు అభివృద్ధిలో వేగం పుంజుకుంది. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న మార్గాల వెంట రాకపోకలు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ రహదారి నుంచి మామిడిపాలెం వయా పోలీసు శిక్షణా కళాశాల మార్గంలో విపరీతమైన ట్రాఫిక్‌ పెరగిపోయింది. ఇక్కడి మట్టిరోడ్డును తారురోడ్డుగా అభివృద్ధి చేయడానికి అంచనాలను తయారు చేశారు. ఎన్నికలకు ముందుగా నగరపాలక సంస్థలో నిధులు ఉండడంతో ఈ మార్గంలోని మట్టిరోడ్డును తారురోడ్డుగా అభివృద్ధికి చేయడానికి నిర్ణయించారు. ఈ ప్రాంతంలో అత్యధికంగా శిక్షణ కానిస్టేబుళ్లు, పోలీసు అధికారులతో పాటు బాణాసంచా గోదాములు, మామిడిపాలెంకు వెళ్లే వారితో రద్దీగా మారింది. రోడ్డు వేయడం అనివార్యమైంది ఎన్నికలు కొద్ది వారాల్లోనే వస్తాయనంగా ఈ రోడ్డు పనికి హడావుడిగా టెండర్లను వేసి పనులు మొదలు పెట్టారు. అనతి కాలంలోనే రోడ్డు పని పూర్తయిందనిపించారు. రోడ్డు వేసిన కొద్ది రోజుల వరకు నిగనిగలాడింది. ఆ తర్వాత ఎండలు మొదలయ్యాయి. ఎండ వేడికి నెర్రెలు బారింది. రోడ్డుమార్గంలో అంతా పగుళ్లు వచ్చేశాయి. మట్టి రోడ్డు ఉన్నప్పుడు వాహనాలు, ద్విచక్రవాహనాలు వెళ్లినా ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడలా కాదు. ద్విచక్ర వాహనం నెర్రెబారిన రోడ్డులో వెళ్లాలంటే ప్రమాదాలను తప్పించుకొని మరీ వెళ్లాల్సిందే. నిత్యం ప్రమాదాలకు హేతువుగా ఈ రోడ్డు మారింది.

రూ. కోటిపైనే నెర్రెపాలు..
జాతీయ రహదారి అభివృద్ధి పనులకు సుమారు రూ.కోటిపైనే నిధులను వెచ్చించారు. వేసిన రోడ్డు వేసినట్టే దెబ్బతింది. ప్రజల డబ్బు మొత్తం వృథా అయింది. సుమారు నాలుగున్నర కిలోమీటర్ల పొడవునా ఈ రోడ్డును నిర్మించారు. మట్టి రోడ్డుపై ముందు వెట్‌మిక్స్‌ వేసి రోడ్డును అభివృద్ధి చేశారు. మట్టిరోడ్డుపై ఒక పొర వెట్‌మిక్స్‌ వేసి ఆ తర్వాత రెండు పొరలు తారు రోడ్డు వేశారు. ఈ ప్రాంతం చౌడునేల. మెతక స్వభావంతో ఉంటుంది. ఇక్కడ రోడ్డు వేయడానికి సాంకేతికంగా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని పటిష్ట పరిచి ఆ తర్వాత రోడ్డు అభివృద్ధి పనులు చేయాలి.  రోడ్డు ప్రతిపాదించిన సమయానికి సమయం అంతగా లేదు. అందుబాటులో నిధులు ఉన్నాయి. ఇంకేం వెంటనే తారు పరిచి రోడ్డు వేస్తే పోలా అనుకున్నారేమో చకచకా పనులు కానిచ్చేశారు.

కొద్ది రోజులకే బయటపడిన డొల్లతనం..
రోడ్డు వేసిన కొద్ది రోజులకే ఎండ వేడికి తారు మెతకబడి తారు బయటకు వచ్చింది. తారు ఉష్ణోగ్రతల దెబ్బకి బురబురలాడి పనిలోని డొల్లతనాన్ని బయటవేసింది. ఎక్కడిక్కడే రోడ్డు బద్దలుగా విరిగింది. రోడ్డు మార్గంలో పలు చోట్ల నెర్రెబారింది. ఈ  ప్రాంతంలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మట్టి రోడ్డు ఉన్నప్పుడు దర్జాగా వాహనాలు వచ్చేవి. ఇప్పుడు వాహనాలు రావాలంటే ఎక్కడ బండి పడిపోతుందోనని భయపడుతున్నారు. రోడ్డు పనిలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. ఎక్కడ నాణ్యతలను పాటించలేదు. కాంట్రాక్టర్‌కు లాభం చేకూర్చడానికి, అధికారులు తమ పర్సంటేజీలను దండుకొనేందుకే తూతూ మంత్రంగానే రోడ్డు పనిని కానిచ్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

కొద్ది రోజులకు కనుమరుగు..
రానున్న కొద్దిరోజులకే రోడ్డు కనుమరుగయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఎండ వేడికే నెర్రెబారిన రోడ్డు కాస్త చినుకులు పడ్డాయంటే ఇక రోడ్డు తారు లేచి పోవడం ఖాయమంటున్నారు. తేలికపాటి వర్షం కురిసినా రోడ్డుపై తారు లేచిపోతుందని అంటున్నారు. వర్షాకాలం మొదలయ్యేలోగానే రూ. కోటి రోడ్డు కన్పించకుండా పోతుందన్న వ్యాఖ్యానాలు స్థానికుల నుంచి నెలకున్నాయి. జాతీయ రహదారి నుంచి మామిడిపాలెం మార్గంలో వేసిన రోడ్డు పనిలో నాణ్యత విషయంలో అడుగడుగునా లోపాలే ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులు కల్పించుకొని విచారిస్తేనే రోడ్డు నాణ్యత విషయంలోని డొల్లతనం బయటపడుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని వార్తలు