కోనప్పరెడ్డిగారిపల్లిలోనూ అదే మోసం..!

14 Jun, 2018 01:43 IST|Sakshi
అగరాల బాధితులతో మాట్లాడుతున్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

చంద్రగిరి : జాతీయ రహదారి విస్తరణలో ఇళ్లు, పొలాలు కోల్పోతున్న రైతుల వద్ద ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్న ఘటన పాకాల మండలం కోనప్పరెడ్డిగారిపల్లి, చంద్రగిరి మండలం అగరాల గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘సాక్షి’ దినపత్రికలో ప్రభుత్వ అధికారుల మోసంపై బుధవారం వచ్చిన కథనంతో బాధితుల్లో చైతన్యం వచ్చింది. కోనప్పరెడ్డిగారిపల్లిలోని సుమారు 80 కుటుంబాల వద్ద అధికారులు ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకుని మోసం చేసినట్లు గ్రహించిన బాధితులు అందోళనకు సన్నద్ధమయ్యారు.

తహసీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తాం

పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి ఆరులైన్ల రోడ్డు నిర్మాణంలో భాగంగా నిరుపేదలు, నిరక్షరాస్యులైన తమను నట్టేటముంచి, ప్రభుత్వ పెద్దలకు పట్టం కట్టేందుకు అధికారులు తమ పొట్ట కొడుతున్నారన్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అ«ధికారులు తమను బెదిరించి, మోసం చేసి అక్రమంగా సంతకాలు చేయించుకున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారులు తమ దగ్గర నుంచి సంతకాలు తీసుకున్న పత్రాలు తిరిగి ఇచ్చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. లేకుంటే గురువారం పాకాల తహసీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. 

బాధితులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి అండ..
అగరాల, కోనప్పరెడ్డిగారిపల్లిలో రెవెన్యూ అధికారుల మోసాన్ని తెలుసుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బుధవారం సాయంత్రం బాధితులతో మాట్లాడారు. కూలికెళ్తే గాని పూటగడవని పేదలను ఇలా మోసం చేయడం సమంజసం కాదన్నారు. విస్తరణ బాధితులకు న్యాయం చేసేందుకు కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. బాధితులను మోసం చేసి సంతకాలు తీసుకున్న ఖాళీ పత్రాలను వెంటనే తిరిగిచ్చేయాలని ఆయన కోరారు. అనంతరం పాకాలవారిపల్లి, కోనంగివారిపల్లిలోని బాధితులతో ఆయన సమావేశం నిర్వహించారు. 

మరిన్ని వార్తలు