బాట‘సారీ’!

29 Nov, 2019 12:21 IST|Sakshi
ఆకివీడు ప్రాంతంలో విస్తరణ పనులు ప్రారంభం కాని జాతీయ రహదారి –216

శంకుస్థాపనలతో సరి

మొదలు కాని విస్తరణ పనులు

అధ్వానంగా జాతీయ రహదారులు 

ప్రయాణికులకు తప్పని వెతలు  

టెండర్‌ దశ దాటని దుస్థితి   

ఆకివీడు: జిల్లాలో జాతీయ రహదారులు అధ్వానంగా ఉన్నాయి. విస్తరణ పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. గుండుగొలను నుంచి కొవ్వూరు వరకూ జాతీయరహదారి విస్తరణ పనులు మాత్రం జరుగుతున్నాయి. మిగిలిన జాతీయ రహదారుల పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. అవి ప్రతిపాదనలు, శంకుస్థాపనలకే పరిమితమయ్యాయి.  గత ఏడాది కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆకివీడు నుంచి రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారుల విస్తరణ పనులకు రిమోట్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. జిల్లా ద్వారా వెళ్లే పామర్రు–దిగమర్రు జాతీయరహదారి(నంబర్‌ 216)తోపాటు దేవరపల్లి–కొయ్యలగూడెం(నంబర్‌ 516డీ) జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఇది జరిగి ఏడాది గడుస్తున్నా.. పనులు మొదలు కాలేదు. ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా స్పష్టత లేదు. ఆకివీడులో పామర్రు–దిగమర్రు రోడ్డుకు వేసిన శిలాఫలకం కూడా మట్టికొట్టుకుపోయింది.

ప్రయాణికులకు చుక్కలు..  
జాతీయ రహదారులు 216, 516డీలపై ప్రయాణం వాహనచోదకులు, ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. ప్రధానంగా దేవరపల్లి– జీలుగుమిల్లి రహదారి అధ్వానంగా మారింది. అడుగడుగునా గుంతలు వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. పామర్రు–దిగమర్రు రహదారి కూడా అధ్వానంగా మారింది. కనీసం వీటికి మరమ్మతులు కూడా చేపట్టడం లేదు. ఈ రహదారులపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ఆసక్తి చూపడం లేదు.

 216 జాతీయ రహదారి ప్రతిపాదనలు ఇవీ..  
216 జాతీయ రహదారిని పామర్రు నుంచి దిగమర్రు వరకూ 108 కిలోమీటర్ల మేర విస్తరించాల్సి ఉంది. జిల్లాలో దీని విస్తీర్ణం 46 కిలోమీటర్లు. దీనికి తొలిదశలో రూ.500 కోట్లు కేటాయించారు.  ఆకివీడు, ఉండి, భీమవరం, కైకలూరు ప్రాంతాల్లో రహదారి విస్తరణలో భాగంగా బైపాస్‌లు నిర్మించాలి. ఆకివీడు వద్ద బైపాస్‌ రోడ్డుకు ఉప్పుటేరుపై వంతెన, వెంకయ్య వయ్యేరుపై మరో వంతెన నిర్మించాల్సి ఉంది. ఉప్పుటేరుపై వంతెన నిర్మాణానికి ఆగస్టు నెలలో మట్టి పరీక్షలు చేశారు. ఇదే రహదారితోపాటు హైదరాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు జిల్లాలో నేషనల్‌ హైవే నంబర్‌–5 నుంచి  బైపాస్‌ రహదారిగా ఉన్న దేవరపల్లి–గోపాలపురం–కొయ్యలగూడెం ఎన్‌హెచ్‌ రహదారి(516డీ) అభివద్ధికి కూడా అప్పట్లో డిజిటల్‌ శంకుస్థాపన చేశారు. ఈ రహదారి 20 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు, పునర్నిర్మాణ పనులు చేపట్టేందుకు రూ.93 కోట్లు విడుదలయ్యాయి. ఈ జాతీయ రహదారులను నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియాలో విలీనం చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. జాతీయ రహదారుల శాఖ పరిధిలో ఉన్నంత కాలం ఇవి అభివృద్ధికి నోచుకోవని పెదవి విరుస్తున్నారు.

వాహనాలకు దెబ్బే.. 
216 జాతీయ రహదారి అధ్వానంగా ఉంది. వాహనాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.  రోడ్డు ట్యాక్స్‌ వసూలు చేస్తున్న జాతీయ రహదారుల శాఖ రహదారులను అభివద్ధి చేయడంలేదు. కేంద్రం ప్రభుత్వం, ఏంపీలు పట్టించుకోవాలి. 
– కురెళ్ల పౌలు, లారీ డ్రైవర్, దుంపగడప

నరకం చూస్తున్నాం.. 
216 జాతీయరహదారిపై ప్రయాణం నరకం చూపిస్తోంది.  ఆకివీడు నుంచి భీమవరం వెళ్లాలంటే తీవ్ర ఇబ్బంది. పంచాయతీ రోడ్లను తలపిస్తోంది.  ఇరుకురోడ్లు, గతుకు, గుంతలతో ఎన్నాళ్లీ  అవస్థలు.   
 – లావేటి త్రిమూర్తులు, ప్రయాణికుడు, చెరుకుమిల్లి

ప్రతిపాదనలు వెళ్లాయి.. 
జాతీయరహదారి నంబర్‌ 216 విస్తరణ, బైపాస్‌ రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.500 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. దేవరపల్లి– జీలుగుమిల్లి జాతీయ రహదారి అభివృద్ధికి రూ.93 కోట్లతో టెండర్లు పిలిచాం. టెండర్లు ఖరారైన తరువాత రహదారి పనులు మొదలుపెడతారు.  
– మునగళ్ల శ్రీనివాసరావు, డీఈఈ, ఎన్‌హెచ్‌ 216, భీమవరం 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు