ఉపాధికి ‘నిమ్స్‌మే’ తోడ్పాటు

15 Aug, 2014 02:22 IST|Sakshi
ఉపాధికి ‘నిమ్స్‌మే’ తోడ్పాటు

తిరుచానూరు :  స్వయంగా ఉపాధి పొందాలనుకునే వారికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్‌ప్రజైస్(నిమ్స్‌మే) సంస్థ తోడ్పాటు అందిస్తోంది. నిరుద్యోగ యువతను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేం దుకు శిక్షణ కార్యక్రమాలు అందిస్తోంది. ఇంటర్ విద్యార్హత కలిగి, 20 నుంచి 35 ఏళ్ల లోపున్న వారికి భోజన, వసతి సౌకర్యాలు కల్పించి శిక్షణ ఇప్పిస్తోంది. స్వయం ఉపాధితో పాటు పది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తోంది. తద్వార నిరుద్యోగ సమస్యను అధిగమించడంతో పాటు ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతోంది.
 
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీస్ అండ్ ఎంటర్‌ప్రైనియర్(నిఫ్టే) సౌజన్యంతో నిమ్స్‌మే సంస్థ ఫుడ్ ప్రాసెసింగ్(ఆహార సంస్కరణ పరిశ్రమ) కోర్సులో శిక్షణ ఇస్తోంది. తిరుచానూరు రోడ్డులోని మహిళా ప్రాంగణంలో చేపట్టిన 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో 50 మంది శిక్షణ పొందుతున్నారు. వీరిని తిరుపతి పరిసరాల్లోని వివిధ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలకు తీసుకెళ్లి అక్కడ నిపుణులతో శిక్షణ ఇప్పించి అవగాహన కల్పిస్తున్నారు. అలాగే వివిధ విభాగాలకు చెందిన నిష్ణాతులతో చిన్న, మధ్య తరగతి పరిశ్రమల ఏర్పాటులో సాంకేతిక సమస్యలను అధిగమించడం, తయారుచేసిన ఉత్పత్తులను మార్కెటింగ్‌లో మెళకువలు, సూచనలు ఇప్పిస్తున్నారు.
 
సర్టిఫికెట్లతో బ్యాంకు రుణాలు
శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు నిమ్స్‌మే సంస్థ సర్టిఫికెట్లు అందిస్తుంది. సర్టిఫికెట్ ఉన్న వారికి వివిధ బ్యాంకులు చిన్న పరిశ్రమల ఏర్పాటుకు రుణ సౌకర్యం కల్పిస్తున్నాయి. తద్వార ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తాము సంపాదిస్తూ పది మందికి ఉపాధి కల్పించేందుకు ఆస్కారం ఉంటోంది. అంతేకాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలో ఉద్యోగావకాశాలకు నిమ్స్‌మే అందిస్తున్న సర్టిఫికెట్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
 
స్వయం ఉపాధిపై మక్కువ
బీటెక్ చదివాను. ఉద్యోగం చేయాలన్న ఆసక్తి కంటే స్వయం ఉపాధిపైనే మక్కువ. ఇంట్లోనే కుటీర పరిశ్రమ నెలకొల్పి పది మందికి ఉపాధి కల్పించాలన్నదే నా కోరిక. అయితే ఎలాంటి పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న దానిపై స్పష్టత లేదు. నిమ్స్‌మే అందిస్తున్న శిక్షణ ద్వారా నాకున్న సందేహాలు తొలగిపోయాయి.
 - తులసీమాల, ఎస్టీవీ నగర్, తిరుపతి
 
ఇంటి వద్ద నుంచే సంపాదన
నేను గృహిణిని. బీఏ చదివినప్పటికీ ఉద్యోగంపై ఆసక్తి లేదు. అయితే ఇంట్లోనే ఉంటూ సంపాదించాలని భావించాను. ఇదే సమయంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలుసుకుని వచ్చాను. శిక్షణలో పలు విషయాలు తెలిశాయి. ఇంట్లోనే చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటు చేసి పదిమందికి ఉపాధి కల్పిస్తా.
 - పద్మజ, బీఏ, బైరాగిపట్టెడ
 
సొంతంగా వ్యాపారం చేయాలి
ఫార్మశీ పూర్తి చేసి చెన్నైలోని డెల్ కంపెనీలో పనిచేస్తున్నా. సొంతంగా వ్యాపారం చేయాలన్నది కోరిక. రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరుపతి మరింత అభివృద్ధి చెందనుంది. ఇదే అనువైన సమయం. చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు అవసరమైన శిక్షణ ఇక్కడ తీసుకుంటున్నా. మాంసం, డెయిరీ ప్రాడెక్టుల పరిశ్రమను నెలకొల్పుతా.
 - బాలమురళి, ఎస్టీవీ నగర్, తిరుపతి
 
పాల ఉత్పాదనపై ఆసక్తి
మెకానికల్ డిప్లొమో పూర్తి చేసినప్పటికీ నాకు పాల ఉత్పాదనపై ఆసక్తి ఎక్కువ. దీంతోనే ప్రయివేటు జాబ్‌ను వదిలిపెట్టేశాను. ఇంట్లో ఉన్న ఆవు ద్వారా లభించే పాలతో రకరకాల తినుబండారాలు తయారు చేస్తుంటాను. పూర్తి స్థాయిలో అవగాహన కోసం శిక్షణ తీసుకుంటున్నా. శిక్షణ పూర్తికాగానే సొంతంగా చిన్న పరిశ్రమ ఏర్పాటు చేస్తా.
- వీ.దిలీప్‌కుమార్, ఖాదీకాలనీ, తిరుపతి

మరిన్ని వార్తలు