జాతీయ సంస్థలపై.. తర్జనభర్జన

26 Jul, 2014 03:55 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, తిరుపతి : విభజన నేపథ్యంలో రాష్ట్రంలో 11 జాతీయ విద్యా సంస్థలను ఏర్పాటుచేస్తామని కేంద్రం హామీ ఇచ్చిన విషయం విదితమే. ఆ హామీ మేరకు ఐఐటీ, ఎయిమ్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు 2014-15 బడ్జెట్లో కేంద్రం నిధులు కేటాయిం చింది. ఇందులో ఐఐటీని తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఐఐటీతోపాటు ఐఐఎస్‌ఈఆర్(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్), సెంట్రల్ వర్సిటీలను  ఏర్పాటుచేస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.

ఈ సంస్థల ఏర్పాటుకు వెయ్యి ఎకరాల భూమిని గుర్తించాలని కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు-శ్రీకాళహస్తి మండలాల పరిధిలోనూ.. చంద్రగిరి మండలం రంగంపేట సమీపంలోనూ.. రామచంద్రాపురం మండలంలోనూ అటవీ, ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఆ భూములను రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జిల్లా అధికారయంత్రాంగంతో కలిసి ఇటీవల పరిశీలించారు.

మంత్రుల పర్యటన నేపథ్యంలో జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుపై టీడీపీ నేతల మధ్య రచ్చ మొదలైంది. జాతీ య సంస్థల ఏర్పాటుతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రూ.కోట్లను కొల్లగొట్టడానికి ప్రణాళిక రచించారు. తమ ప్రాంతంలో ఏర్పాటుచేయాలంటే తమ ప్రాంతంలో నెలకొల్పాలని పట్టుబట్టారు. చంద్రగిరి మండలంలో రంగంపేటకు సమీపంలోనే జాతీయ విద్యా సంస్థలు ఏర్పాటుచేయాలంటూ నారావారిపల్లెలో సమావేశమైన టీడీపీ నేతలు తీర్మానం చేసి అధిష్ట్ఠానానికి పంపారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ సిద్ధార్థజైన్ తిరుపతి ఆర్డీవో రంగయ్య, శ్రీకాళహస్తి, ఏర్పేడు, తిరుపతి రూరల్, చంద్రగిరి తహశీల్దార్లతో భూములను పరిశీలించి.. సమీక్ష సమావేశం నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రగిరి మండలం రంగంపేట వద్ద అటవీభూములు, ప్రైవేటు భూములు ఉన్నాయి. అసైన్డు, డీకేటీ, ప్రభుత్వ భూములు అందుబాటులో లేవు. అటవీ భూములను డీ-నోటిఫై చేయాలంటే కేంద్ర అటవీశాఖ అనుమతి అవసరం. అనుమతి వచ్చాక.. అటవీ భూమి తీసుకున్న మేరకు ప్రభుత్వ భూమిని కేటాయించాలి.

ఆ తర్వాత అటవీశాఖకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం అంత సులువుగా తేలేది కాదని రెవెన్యూ వర్గాలు స్పష్టీకరించాయి. ఏర్పేడు-శ్రీకాళహస్తి మండలల పరిధిలో మేర్లపాక, పాగాలి, పంగూరు, చిందేపల్లె, చింతలపాళెం, పల్లాం, ఎంపేడు ప్రాంతాల్లో భారీ ఎత్తున ప్రభుత్వ భూము లు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు గుర్తించాయి. రేణిగుంట విమానాశ్రయం, జాతీయ రహదారులు, తెలుగుగంగ జలాలు అందుబాటులో ఉంటాయని.. ఆ ప్రాంతమే జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుకు అనుకూలమని ప్రాథమిక నివేదికను సర్కారుకు పంపినట్లు సమాచారం.

టీడీపీ నేతల ఒత్తిళ్ల కారణంగాఈ ప్రతిపాదనపై ఆమోదముద్ర పడే అవకాశాలు తక్కువనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐఐటీ ఏర్పాటుకు అవసరమైన ప్రాంతాన్ని నెలాఖరులోగా ఎంపిక చేసి, భూముల వివరాలను కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖకు పంపాల్సి ఉంటుంది. జాప్యం చేస్తే.. ఐఐటీ ఏర్పాటు వాయిదా పడే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
 

మరిన్ని వార్తలు