మానవీయ విలువలతోనే హక్కుల పరిరక్షణ

12 Aug, 2018 03:01 IST|Sakshi
సావనీర్‌ను ఆవిష్కరిస్తున్న అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్‌ దల్వీర్‌ భండారీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.రాధాకృష్ణ తదితరులు 

ఎస్కేయూ (అనంతపురం) : ‘మానవత్వంలోనే దైవ త్వం ఉంది. మానవీయ విలువలను కలిగి ఉంటూ మానవ హక్కులను కాపాడుకోవాలి’అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అన్నారు. ‘మానవీయ విలువలు– చట్టబద్ధమైన ప్రపంచం’అనే అంశంపై అనంతపురం జిల్లా పుట్టపర్తిలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ న్యాయ సేవా సదస్సు శనివారం ప్రారంభమైంది. సదస్సుకు జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ముఖ్య అతిథిగా, అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్‌ దల్వీర్‌ భండారీ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, 750 మంది న్యాయ నిపుణులు, 300 మంది న్యాయ విద్యార్థులు సదస్సులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జస్టిస్‌ దీపక్‌ మిశ్రా మాట్లాడుతూ... ఇతరుల హక్కులకు భంగం కలిగించకుండా హక్కులను అనుభవించాలన్నారు. అహాన్ని తొలగించుకుంటేనే శాంతి లభిస్తుందని చెప్పారు. ఆధ్యాత్మికత హేతుబద్ధంగాను, హేతుబద్ధమైన ఆధ్యాత్మికంగానూ ఉండాలన్నారు. మన రాజ్యాంగంలో చట్టపరమైన నిబంధనలే కాకుండా మానవత్వ విలువలు, ఆధ్యాత్మిక నిబంధనలు ఉన్నాయని చెప్పారు. ధర్మమే సమాజాన్ని రక్షిస్తుందని.. సన్మార్గంలో నడిపిస్తుందన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.రాధాకృష్ణ, శ్రీసత్యసాయి సేవా సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు జతీందర్‌ చీమా, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ ట్రస్టీ ఎస్‌ఎస్‌ నాగానంద్, ఆలిండియా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్‌ అధ్యక్షుడు నిమీశ్‌ పాండే, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మెంబర్‌ రత్నాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

మరిన్ని వార్తలు