జగన్ బాటలో జాతీయ పార్టీలు

4 Feb, 2014 01:10 IST|Sakshi
జగన్ బాటలో జాతీయ పార్టీలు

వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు
విభజనవల్ల వచ్చే సమస్యలను అందరికీ వివరించారు
అందుకే ఇప్పుడు ఆ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి
కిరణ్, ఆదాల సమైక్యవాదులైతే సస్పెండ్ చేయరేం?
 బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాట
 2014లో సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు... విజయం మాదే
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో పలు జాతీయ పార్టీలు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరిన బాటలోనే నడుస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. రాష్ట్రా న్ని విభజించడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని జగన్ కొంతకాలం కిందట జాతీయ స్థాయి నేతలను కలసి వివరించిన నేపథ్యంలోనే బిల్లుపై ఇప్పుడు ఆ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘‘సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన వెంటనే జగన్‌మోహన్‌రెడ్డి దేశమంతా తిరిగి విభజన వల్ల తలెత్తే సమస్యలు, ఆర్టికల్-3ను దుర్వినియోగం చేస్తున్న విధానాన్ని అనేక రాజకీయ పార్టీల నేతలను కలసి వివరించారని గుర్తుచేశారు.

 

విభజన ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా భవిష్యత్తులో మీ రాష్ట్రాలకూ ఆ ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. విభజనను వ్యతిరేకించే వారు మాతో కలసిరావాలని కోరారు. జగన్ లేవనెత్తిన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్న పార్టీలు విభజనకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో గళం విప్పనున్నాయి. పార్లమెంట్ సమావేశాలను పురస్కరించుకుని సోమవారం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలోనూ సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీలు విభజనను వ్యతిరేకించాయి. చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన బీజేపీ సైతం ఈ సమయంలో విభజన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం సరికాదని చెప్పింది’’ అని తెలిపారు. ఎలాంటి ప్రాతిపదిక లేకుం డా రాష్ట్రాన్ని విభజించ డానికి జరుగుతున్న ప్రయత్నాలను వివరించి... జాతీయ స్థాయి పార్టీలు సైతం ఆలోచించేలా చేసిన తమ అధినేత ప్రయత్నాలకు తామం తా గర్విస్తున్నామన్నారు. విభజనను వ్యతిరేకిస్తూ ఏకపక్షంగా జరుగుతున్న ప్రయత్నాలను జగన్ స్వయంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రిలను కూడా కలసి వివరించారని గుర్తుచేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...
 
 అసెంబ్లీ తీర్మానాన్ని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బ్రహ్మాస్త్రంగా అభివర్ణించుకుంటే కాంగ్రెస్ మాత్రం చిత్తు కాగితంతో సమానమని తీసిపారేస్తోంది.  బ్రహ్మాస్త్రం వేశానని, మౌనదీక్షలు చేస్తానని సీఎం ఇప్పుడు డ్రామాలు చేసే బదులు సీడబ్ల్యూసీ తీర్మానం సమయంలోనే రాజీనామా చేస్తే బిల్లు సభలోకి రావడం, చర్చ జరగడం వంటివి ఉండేవి కావు.
 
 సమైక్య సింహ మని చెప్పుకుంటున్న సీఎం ఆ పార్టీ అధినేత సోనియాగాంధీని విభజన దేవతగా విమర్శిస్తుంటారు. అధిష్టానం మాత్రం ఆయనను పదవినుంచి తప్పించదు. దీన్నిబట్టి ఆ పార్టీ నాటకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
 
 విభజనకు పద్ధతి ఉంటుంది. కమిటీలు, కమిషన్‌ల ద్వారా ఆ నిర్ణయాలు తీసుకుంటారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. అంటే ఆయన విభజనకు వ్యతిరేకం కాదని స్పష్టమవుతోంది.
 
 అందర్నీ కూర్చోబెట్టి నిర్ణయం తీసుకోవాలన్న చంద్రబాబు తన పార్టీలోని ఇరు ప్రాంతాల నేతలను వేర్వేరు గదుల్లో కాకుండా ఒక్కచోట ఎందుకు సమావేశపర్చలేకపోతున్నారు? గతంలో బీజేపీని విమర్శించి, సిగ్గులేకుండా తిరిగి ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకునేందుకు ఎందుకు వెంపర్లాడుతున్నారు?
 
 సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న తర్వాత అసెంబ్లీని సమావేశపరిచి విభజనకు వ్యతిరేకం అని తీర్మానం చేయమని కోరిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్.
 
 పార్టీ ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో 90శాతం విజయం సాధించాం. రాబోయే ఎన్నికల్లోనూ మా పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని తెలిసే కావాలనే కాంగ్రెస్, టీడీపీలు విమర్శలు చేస్తున్నాయి. పార్టీని వీడేవారు విమర్శలు చేస్తూ వెళ్లడం రాజకీయాల్లో సహజమే.
 
 ఢిల్లీలో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే రాష్ట్ర విభజన జరిగేట్లు కనిపించడం లేదు. 2014లో ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయి.
 
 రాజ్యసభ ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతు లేదు
 
 రాజ్యసభ ఎన్నికల్లో మేము ఏ అభ్యర్థికీ మద్దతు ఇవ్వబోమని గతంలో చెప్పిన దానికే కట్టుబడి ఉన్నాం. ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకునే సంఖ్యాబలం లేనందున మా పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం లేదు. ఎవరి బలం మీదనో ఆధారపడి అభ్యర్థిని నిలబెట్టడం అంటే అది కుమ్మక్కు రాజకీయాల్లో భాగ మే అవుతుందని మా పార్టీ అభిప్రాయం. ఆ వైఖరికే పార్టీ కట్టుబడి ఉంటుంది. ఆదాల ప్రభాకరరెడ్డికి మా పార్టీ మద్దతు ఇస్తుందని కాంగ్రెస్‌లోని ఒక బఫూన్ చెప్పారు. ఆదాల సమైక్యవాది అని ఎవరో అంటే నమ్మాలా? పార్టీలోనే ఉండి రాజ్యసభకు పోటీ చేస్తున్నా ఆయన్ను కాంగ్రెస్ ఎందుకు సస్పెండ్ చేయలేదు?
 

>
మరిన్ని వార్తలు