టూరు.. బోరే

17 Aug, 2015 02:16 IST|Sakshi

మారేడుమిల్లి :  కనువిందు చేసే ప్రకృతి అందాలు, మైమరిపించే వాతావరణం, అహ్లాదపరిచే సెలయేళ్లు ఇలా ప్రకృతి రమణీయతకు మారేడుమిల్లి పేరు. ఇక్కడికి ఏటా అధిక సంఖ్యలో పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. దీంతో కమ్యూనిటీ బేస్డ్ ఏకో-టూరిజంలో భాగంగా అటవీశాఖ అధికారులు పలు ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దారు. అయితే ప్రసుత్తం ఇవి అధ్వానంగా, కళావిహీనంగా తయారయ్యాయి.  
 
 కళావిహీనంగా నందనవనం పార్కు
 స్థానిక కాఫీ తోటల సమీపం వద్ద పర్యాటకుల కోసం పార్కు నిర్మించారు. నందనవనం అని పేరు పెట్టారు. ఇక్కడికి వచ్చే పర్యాటకుల నుంచి రూ.పది టికెట్ రూపంలో వసూలు చేసేవారు. దీంతో టూరిజం అధికారులకు అదాయం బాగా ఉండేది. రానురాను ఈ పార్కు నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కళావిహీనంగా మారింది
 
 అధ్వాన స్థితిలో పుష్పంజలి రెస్టారెంట్
 పర్యాటకుల సౌకర్యార్థం వారికి మంచి టిఫిన్, భోజన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో స్థానిక హెచ్‌ఎంటీసీ ఫారం సమీపంలో పుష్పాంజలి రెస్టారెంట్‌ను అధికారులు 2004లో నిర్మించారు కొన్నేళ్లు బాగానే నిర్వహించినా ప్రస్తుతం అది నిరుపయోగంగా మారింది. ఈ భవనం అసాంఘిక కార్యకలాపాలకు నిలయమైంది.
 
 తుప్పల మధ్య గుడారాలు
 పర్యాటకులకు సేద తీరడానికి గ్రామానికి సమీపంలో అటవీ ప్రాంతంలో నిర్మించిన హట్స్ (చిన్న చిన్న గుడారాలు) తుప్పలు, మొక్కలతో అధ్వానంగా మారాయి. వాటిలోకి వెళ్లడానికి పర్యాటకులు ఇష్టపడడంలేదు. అలాగే అమృతధార జలపాత ం, జంగిల్ స్టార్ క్యాంపు ప్రదేశాలకు వెళ్లే రహదారులు ప్రస్తుతం చాలా అధ్వానస్థితిలో ఉన్నాయి, అక్కడికి నడిచి వెళ్లడానికి పర్యాటకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని పర్యాటకులు, స్థానిక గిరిజనులు కోరుతున్నారు.  
 

మరిన్ని వార్తలు