లోగో గీస్తే.. బహుమతి మీదే

20 Jul, 2020 08:33 IST|Sakshi
నేచురల్‌ హిస్టరీ పార్కు నమూనాలు

రూ.88 కోట్లతో నేచురల్‌ హిస్టరీ రీసెర్చ్‌ పార్క్‌ 

కాపులుప్పాడలో ఏర్పాటుకు వీఎంఆర్‌డీఏ ప్రణాళికలు 

పార్కు లోగో డిజైన్‌కు వీఎంఆర్‌డీఏ ఆహ్వానం 

మొదటి బహుమతి రూ.50వేలు 

రెండో బహుమతి రూ.25 వేలు 

సాక్షి, విశాఖపట్నం: మీరు మంచి డిజైనరా.. లోగో డిజైన్లు అద్భుతంగా గీయగలరా.. అయితే మంచి లోగో గీయండి.. నగదు బహుమతి సొంతం చేసుకోండి.. అంటూ అద్భుతమైన అవకాశం ఇస్తోంది విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ. విశ్వాన్ని, విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతిక రంగాన్ని ఒకే ప్రాంతంలోకి తీసుకొచ్చేలా ఏపీ నేచురల్‌ హిస్టరీ పార్క్, మ్యూజియం అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు కానుంది. దీనికి గతేడాది డిసెంబర్‌ 28న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. నగర శివారులోని కాపులుప్పాడలో ఈ పార్కును నిర్మించనున్నారు. పదిహేనెకరాల విస్తీర్ణంలో నేచురల్‌ హిస్టరీ పార్క్‌  రూపుదిద్దుకోనుంది. వీఎంఆర్‌డీఏ, నేచురల్‌ హిస్టరీ మ్యూజియం సొసైటీ సంయుక్తంగా ఈ పార్కును నిర్మించనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. రూ.88 కోట్లతో పార్కుని తీర్చిదిద్దాలని ప్రాథమిక అంచనా. ఈ పార్కు సందర్శకులకు వైజ్ఞానిక ఆనందంతో పాటు శాస్త్రీయ అవగాహన అందించాలనే లక్ష్యంతో రూపకల్పన చేశారు. 

లోగో రూపకల్పన పోటీలు 
కైలాసగిరిపై ఏర్పాటు చేయనున్న ప్లానిటోరియం భవన డిజైన్‌పై వీఎంఆర్‌డీఏ పోటీలు నిర్వహించగా దేశంలోని వివిధ నగరాల నుంచి మంచి స్పందన లభించింది. పదమూడు ఎంట్రీలు రాగా.. అందులో ఒకదాన్ని ఎంపిక చేసి.. అదే మోడల్‌కు నిపుణులతో మెరుగులు దిద్ది.. ప్లానిటోరియం బిల్డింగ్‌ మోడల్‌ని తీర్చిదిద్దారు. ఇప్పుడు అదే తరహాలో నేచురల్‌ హిస్టరీ పార్కు లోగో రూపకల్పన కోసం వీఎంఆర్‌డీఏ పోటీ నిర్వహిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్న పార్కుకు సృజనాత్మకంగా, అర్థవంతంగా లోగో తీర్చిదిద్దే ఔత్సాహికుల్ని ఆహ్వానిస్తోంది. డిజిటల్‌ రూపంలో లేదా డ్రాయింగ్‌ రూపంలో అందించాలని వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ పి.కోటేశ్వరరావు కోరారు.  

మీ డిజైన్లను www.vmrda.gov.in కుపంపించవచ్చు. ఈ పోటీల్లో మొదటి విజేతకు రూ.50,000, రెండో విజేతకు రూ.25,000 బహుమతి అందించనున్నారు. మరిన్ని వివరాలకు 9866076922 నంబర్‌లో
సంప్రదించాలని కమిషనర్‌ కోటేశ్వరరావు సూచించారు. 

మరిన్ని వార్తలు