అనంతాగ్రహం

5 Sep, 2014 01:19 IST|Sakshi

‘ప్రకృతి చేస్తున్న ద్రోహం కంటే పాలకుల వంచనతోనే రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతోంది. 1956లో విశాలాంధ్ర కోసం కర్నూలు రాజధానిని త్యాగం చేశాం. ఇప్పుడు పాలకుల స్వార్థం వల్ల రాజధాని విజయవాడకు తరలివెళ్లింది. మనకు తరతరాలుగా అన్యాయం జరుగుతూనే ఉంది. ఇంకెంత కాలం ఇలా? అన్నీ కోల్పోయి అనాథలుగా మిగిలిపోవాల్సిందేనా?’ అంటూ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) విద్యార్థులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
 
 విద్యార్థుల అర్ధనగ్న ప్రదర్శన
 గుంతకల్లు టౌన్:  రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు గుంతకల్లు పట్టణంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఉదయాన్నే ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. మధ్యాహ్నం స్థానిక పొట్టి శ్రీరాములు సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. అక్కడి నుంచి గాంధీచౌక్ వరకు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్, నాయకులు చిరంజీవి, రాము, కిశోర్, పవన్, మురళి తదితరులు పాల్గొన్నారు.
 
 కదంతొక్కిన విద్యార్థులు
 ఉరవకొండ :  సీఎం స్వార్థ ప్రయోజనాల కోసమే విజయువాడలో రాజధాని ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారంటూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఇంటర్, డిగ్రీ విద్యార్థులు గురువారం ఉరవకొండ తహశీల్దార్ కార్యాలయుం ఎదుట రహదారిపై రెండు గంటల పాటు రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నాయుకులు లాలు, సురేష్, జిలాన్, యుూసఫ్ తదితరులు పాల్గొన్నారు. వీరిని బలవంతంగా పక్కకు నెట్టడానికి పోలీసులు ప్రయుత్నించారు. అరుునా ఆందోళన విరమించకపోవడంతో స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
 
 యూనివర్సిటీ /అనంతపురం టవర్ క్లాక్ : చంద్రబాబు ప్రభుత్వం నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధానిగా విజయవాడను ప్రకటించడాన్ని నిరసిస్తూ ఎస్కేయూ విద్యార్థి, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యాన విద్యార్థులు, ఉద్యోగులు గురువారం వర్సిటీ ఎదురుగా అనంతపురం - చెన్నై జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నేత జీవీ లింగారెడ్డి మాట్లాడుతూ.. ‘1953లో ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలనే విషయంపై ఐదు రోజుల పాటు చర్చ జరిగింది. ఆనాడు ఓటింగ్‌లో మెజారిటీ శాసనసభ్యుల నిర్ణయం మేరకే రాజధాని ప్రకటన చేశారన్నారు. ఇప్పుడు అందుకు భిన్నంగా చంద్రబాబు నియంత మాదిరిగా అసెంబ్లీలో చర్చ లేకుండానే రాజధానిని ప్రకటించార’ని మండిపడ్డారు. తెలంగాణ విషయంలో ఒంటెత్తు పోకడలను అవలంబించిన కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకొని పోయిందని, అదే మాదిరిగా వ్యవహరిస్తోన్న టీడీపీకి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు.
 
 ఆచార్య ఎన్‌ఆర్ సదాశివరెడ్డి మాట్లాడుతూ నది ఒడ్డునే రాజధాని ఉండాలనే నిబంధనేదీ లేదన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరే ఇందుకు తార్కాణమన్నారు. రాజధానిపై ప్రకటనను పునః సమీక్షించుకోవాలని, లేదంటే ఎస్కేయూ వేదికగా గ్రేటర్ రాయలసీమ ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు మల్లికార్జున, పులిరాజు, క్రాంతికిరణ్, రవి, లాలెప్ప, మోహన్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, ఎంఏ లక్ష్మణరావు, గోవింద్, కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 విద్యార్థుల నిరసన
 విజయవాడను రాజధానిగా ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ చిరంజీవిరెడ్డి విద్యాసంస్థల చైర్మన్ ఛార్లెస్ చిరంజీవిరెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు నల్ల బ్యాడ్జీలు ధరించి అనంతపురంలోని బళ్లారి బైపాస్ నుంచి టవర్ క్లాక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారం నిర్మించారు.
 
 రాజధాని రాయలసీమ హక్కు అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ నిర్ణయం సీమ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని చిరంజీవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
 
 సీఎం దిష్టిబొమ్మ దహనం
 ముందస్తుగా భూములు కొనుగోలు చేసిన మంత్రులకు లబ్ధి చేకూర్చాలన్న ఆలోచనతోనే చంద్రబాబు విజయవాడను రాజధానిగా ప్రకటించారని, ఆయన సీమ ద్రోహి అని ‘మన రాయలసీమ’ సంస్థ నాయకుడు జి.నాగరాజు ధ్వజమెత్తారు. రాజధానిపై సీఎం ప్రకటనను నిరసిస్తూ మన రాయలసీమ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో అనంతపురం టవర్ క్లాక్ వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకు ముందు దిష్టిబొమ్మతో శవయాత్రగా అక్కడికి చేరుకుని టవర్‌క్లాక్ చుట్టూ ప్రదర్శన నిర్వహించారు. రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలి.. సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నా బాబు తన నిరంకుశ ధోరణిని వీడలేదని నాగరాజు మండిపడ్డారు.
 
 ఐఎన్‌టీయూసీ నాయకుడు రమణ మాట్లాడుతూ  రాజధాని ఏర్పాటుకు విజయవాడ-గుంటూరు అనుకూలం కాదని చెప్పినా ప్రభుత్వం అక్కడే  ఏర్పాటు చేయాలనుకోవడం దుర్మార్గమైన ఆలోచనన్నారు. కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సమాఖ్య నాయకుడు సాకే నరేష్, మాదిగ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు పసులూరి ఓబులేసు,  మన సీమ నాయకులు రాంప్రసాద్, నిమ్మల నాగరాజు, రాజమన్నార్, రామ్మూర్తి, కోదండరాం, ఆనంద్, విద్యార్థులు, మాల మహానాడు, దండోరా తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు