రాజధానికి మొండిచెయ్యి...

1 Mar, 2016 01:53 IST|Sakshi
రాజధానికి మొండిచెయ్యి...

కంటితుడుపులు...  చేతి విదిలింపులతో సరి
రూ.6,769 కోట్ల ‘మెట్రో’కు కేటాయించింది రూ.106 కోట్లే
రూ.30 వేల కోట్ల పోలవరానికి  రూ.100 కోట్లే
ఈ-మార్కెట్, పంటల బీమా పథకాలతో రైతులకు ఊరట


రూ.6,769 కోట్ల ‘మెట్రో’కు కేటాయించింది  రూ.106 కోట్లే
రూ.30 వేల కోట్ల పోలవరానికి రూ.100 కోట్లే
ఈ-మార్కెట్, పంటల బీమా పథకాలతో రైతులకు ఊరట
మరోసారి పనిచేయని  సీఎం పరపతి
తీవ్రంగా నిరాశపర్చిన  జైట్లీ బడ్జెట్
పేదలకు ఉచితంగా గ్యాస్, ఆరోగ్య  బీమాలతో ఊరట

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కొత్తగా ఏర్పాటైన నవ్యాంధ్ర రాజధానికి ఎటువంటి ప్రత్యేకత చూపలేదు. లోటు బడ్జెట్‌తో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్‌కు మిగిలిన రాష్ట్రాల కంటే కొంత ప్రాధాన్యం లభించే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు భావించారు. అయితే రాష్ట్ర అభివృద్ధిపై ప్రభావం చూపే అంశాలేవీ బడ్జెట్‌లో లేకపోవడంపై అన్ని వర్గాలూ పెదవి విరుస్తున్నాయి.
 
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరోసారి ఝలక్ ఇచ్చింది. తాజా బడ్జెట్‌లో అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించలేదు.  కేంద్రంలో బీజేపీతో మిత్రపక్షంగా కొనసాగుతున్న టీడీపీ రాష్ట్ర అభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి నిధులు తీసుకొస్తుందని అన్ని వర్గాలూ భావిం చాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, రాజధానికి ప్రత్యేక ప్యాకేజీల సాధనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తాజాగా కేంద్ర బడ్జెట్‌లో రాజధాని నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అంశాలేవీ లేకపోవడం బీజేపీ, టీడీపీల మిత్రపక్షంలోని డొల్లతనాన్ని తెలియజేసింది.

‘ప్రత్యేకం’ నో చాన్స్...
విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పూడ్చడానికి ప్రత్యేక హోదా కావాలని, బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు, ప్రత్యేక రైల్వే జోన్ కావాలని ఈ ప్రాంత ప్రజలు ఆకాంక్షించారు. అయితే కేంద్రం ప్రత్యేకానికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదు. రైల్వే బడ్జెట్‌లో సైతం ప్రత్యేక జోన్ ఊసెత్తలేదు. ఇప్పుడు ప్రత్యేక హోదా కానీ, ప్రత్యేక ప్యాకేజీ కానీ ప్రకటించలేదు. రాజధాని నిర్మాణానికి రూ.22 వేల కోట్లు ఖర్చు అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా ప్రత్యేక నిధులు ఏమీ కేటాయించకపోవడం రాాజధాని వాసుల్ని తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.

‘మెట్రో’కు రూ.106 కోట్లు...
 విజయవాడ మెట్రో రైలు నిర్మాణానికి రూ. 6,769 కోట్లు వ్యయం అవుతుంది. బడ్జెట్‌లో రూ.106 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ లెక్కన ఎన్నేళ్లకు పూర్తవుతుందనే అనుమానం కలుగుతోంది.

పోలవరానికి రూ.100 కోట్లు..
పోలవరం ప్రాజెక్టుకు రూ.100 కోట్లను మాత్రమే బడ్జెట్‌లో కేటాయించారు. సుమారు రూ.30 వేల కోట్లకు చేరిన ఈ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయిస్తే, ఎన్ని సంవత్సరాల్లో పూర్తవుతుందో కూడా అంచనా వేయలేని పరిస్థితి.

 సొంత ఇల్లు కల నెరవేరుతుందా?
విజయవాడ వంటి నగరంలో సొంత ఇల్లు కట్టుకోవడం అనేది కలగానే మిగులుతోంది. నగరంలోని సుమారు 1.50 లక్షల కుటుంబాలు సొంత ఇల్లు కావాలని కార్పొరేషన్‌కు ఐదారేళ్ల క్రితమే దరఖాస్తులు చేసుకున్నాయి. తక్కువ ధర కలిగి ఉండే మొట్టమొదటి ఇల్లు కొనుగోలుదారులకు అదనంగా రూ.50 వేల వడ్డీ తగ్గింపును అనుమతించాలని నిర్ణయించింది. దీని వల్ల మధ్య తరగతి కుటుంబాలకు కొంత ఊరట కలగనుంది.

మరిన్ని వార్తలు