ఏపీ ఆలయాల్లో క్షురకుల ఆందోళన

15 Jun, 2018 08:19 IST|Sakshi
ద్వారకా తిరుమలలో ఆందోళన చేస్తున్న నాయీ బ్రాహ్మణులు

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులు తమ డిమాండ్ల సాధన కోసం శుక్రవారం ఆందోళనకు దిగారు. తిరుపతి మినహా అన్ని ప్రధాన ఆలయాల్లో ఈ తెల్లవారుజాము నుంచి ‘కత్తి డౌన్‌’ నిరసన చేపట్టారు. దేవాలయాల్లో కేశఖండనశాలల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణలకు కనీసవేతనం రూ.15 వేలు ఇచ్చి తక్షణమే పర్మినెంట్ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని.. ఉద్యోగ విమరణ చేసిన వారికి నెలకు రూ.5 వేలు పెన్షన్‌ ఇవ్వాలని కోరుతున్నారు.

విజయవాడ దుర్గగుడిలో కురక్షుడి పట్ల అనుచితంగా ప్రవర్తించిన బోర్డు సభ్యుడిపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. మూడు రోజులుగా నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న క్షురకులు.. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఈరోజు విధులను బహిష్కరించారు. సింహాచలం, శ్రీశైలం, అన్నవరం, ద్వారకా తిరుమల, కాణిపాకం, ప్రెనుగంచిప్రాలు తదితర ఆలయాల్లో నాయీ బ్రాహ్మణులు ఆందోళనకు దిగడంతో కేశఖండనశాలలు బోసిబోయాయి. తలనీలాలు సమర్పించేందుకు వస్తున్న భక్తులు వెనుదిరిగాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు. రేపటి నుంచి తిరుమలలోనూ కేశఖండన నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిద్దవటం యానాదయ్య తెలిపారు.

విజయవాడ దుర్గగుడిలో నాయీ బ్రాహ్మణుల ఆందోళన

తెలంగాణ ఐక్య వేదిక మద్దతు
ఆంధ్రప్రదేశ్‌లో క్షురకుల ఆందోళనకు తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక మద్దతు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాల్లో పనిచేస్తున్న క్షురకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, పర్మినెంట్‌ చేయాలని ఐక్యవేదిక అధ్యక్షుడు యం. లింగం నాయీ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. తమకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు