రోడ్డెక్కిన నాయీబ్రాహ్మణులు

1 Aug, 2018 10:34 IST|Sakshi
సన్నాయి, డోలు వాయిద్యాలతో  ర్యాలీగా వస్తున్న నాయీబ్రాహ్మణులు

చీమకుర్తి రూరల్‌(ప్రకాశం): సన్నాయి, డోలు వాయిద్యాలతో తమ సమస్యలను పరిష్కరించాలంటూ నాయీబ్రాహ్మణులు మంగళవారం సంతనూతలపాడు పట్టణంలో రోడ్డెక్కారు. జిల్లా అధ్యక్షుడు మిరియాల రాఘవ ఆధ్వర్యంలో చెన్నకేశవస్వామి గుడిదగ్గర నుంచి మెయిన్‌రోడ్డు మీదుగా వాయిద్య కళాకారులందరూ బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మిరియాల రాఘవ మాట్లాడుతూ హెయిర్‌ కటింగ్‌ సెలూన్‌లకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దాంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో తల నీలాలపై వచ్చే ఆదాయంలో  సగభాగం నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి ఖర్చుపెట్టాలని, కేశఖండనలో పనిచేసే క్షురకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో నాయీ బ్రాహ్మణులపై తరచూ  దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నాయీబ్రాహ్మణులకు కూడా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా తమ సామాజిక వర్గానికి చెందిన ఒక్కరంటే ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా లేకపోవడం తమ దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నియోజకవర్గం నూతన కమిటీని ఈ సందర్భంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు కరేటి నరసింహరావు, బూసరపల్లి శ్రీనివాసరావు, గుంటూరు ఆంజనేయులు, గోనుగుంట నరేష్, మద్దులూరి ప్రసాద్, ఏడుకొండలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు